ఏఐ సూచన ఫలితం.. రోగి పరిస్థితి విషమం! హెచ్ఐవీ రాకుండా..
ABN , Publish Date - Jan 31 , 2026 | 03:16 PM
హెచ్ఐవీ సోకకుండా ఉండేందుకు ఏఐ సలహా పాటించిన ఓ వ్యక్తి చివరకు ఆరోగ్యాన్ని చెడగొట్టుకున్న ఉదంతం తాజాగా ఢిల్లీలో వెలుగు చూసింది. ఈ నేపథ్యంలో ఏఐ సలహాల విషయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు.
ఇంటర్నెట్ డెస్క్: ఏఐ సూచన మేరకు కొన్ని హెచ్‌ఐవీ నిరోధక ఔషధాలు వాడిన వ్యక్తి (45) పరిస్థితి విషమంగా మారిన వైనం ప్రస్తుతం కలకలం రేపుతోంది. హెచ్ఐవీ నిరోధక మందులు వికటించడంతో బాధితుడు ప్రస్తుతం న్యూఢిల్లీలోని రామ్ మనోహర్ లోహియా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు.
జాతీయ మీడియా కథనాల ప్రకారం, హెచ్ఐవీ బారిన పడే అవకాశం ఉండటంతో ఆ వ్యక్తి ఏఐ చాట్‌బాట్‌ను సలహా అడిగాడు. ఏఐ సూచన మేరకు పీఆర్‌ఈపీ చికిత్సను తనకు తానే ఇచ్చుకున్నాడు. హెచ్‌ఐవీ సోకే అవకాశం అధికంగా ఉన్నవారికి ఈ చికిత్సను ఇస్తారు. అయితే, వైద్యుల పర్యవేక్షణలో మాత్రమే ఈ ట్రీట్‌మెంట్ తీసుకోవాల్సి ఉంటుంది. ఇందులో భాగంగా రెండు యాంటీరెట్రోవైరల్ డ్రగ్స్‌ను పేషెంట్‌కు ఇస్తారు. ఇది దాదాపు 28 రోజుల పాటు సాగాల్సిన చికిత్స. వైద్యుల పర్యవేక్షణ లేకపోవడంతో వారం రోజుల్లోనే మందులు వికటించి బాధితుడి పరిస్థితి విషమంగా మారింది. చివరకు ఆసుపత్రిలో చేరాల్సి వచ్చింది.
ఏఐపై మితిమీరిన నమ్మకంతో ఇలాంటి అనార్థాలు జరుగుతున్నాయని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ఏఐతో సాధారణ ఆరోగ్య సమాచారం మాత్రమే సాధ్యమని మరీ మరీ చెబుతున్నారు. సుశిక్షితులైన డాక్టర్లకు ఏఐ ఎంత మాత్రం ప్రత్యామ్నాయం కాదని అంటున్నారు. పీఆర్‌ఈపీ లాంటి డ్రగ్స్‌ను దుర్వినియోగ పరిస్తే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరిస్తున్నారు.
ఏమిటీ పీఆర్‌ఈపీ
లైంగిక చర్యలతో తలెత్తే హెచ్ఐవీ ముప్పును ఈ ట్రీట్‌మెంట్ చాలా వరకూ తగ్గిస్తుందని వైద్యులు చెబుతున్నారు. హెచ్‌ఐవీ లేని వారు ఈ వైరస్ బారిన పడకుండా ఉండేందుకు ఈ ట్రీట్‌మెంట్‌ను డాక్టర్లు సూచిస్తారు. ఈ ట్రీట్‌మెంట్‌తో హెచ్‌ఐవీ సోకే ముప్పు కొన్ని సందర్భాల్లో 99 శాతం వరకూ తగ్గే అవకాశం ఉండటంతో అనేక దేశాల్లో పీఆర్ఈపీకి ప్రాధాన్యం ఏర్పడింది. హెచ్ఐవీ నిరోధక చికిత్సల్లో ప్రధానమైనదిగా పేరు తెచ్చుకున్న ఈ ట్రీట్‌మెంట్‌ను అనేక దేశాలు ఫాలో అవుతున్నాయి. హెచ్ఐవీ ఉన్న వ్యక్తులు భాగస్వాములుగా ఉన్న వారు, అసురక్షిత శృంగారంలో పాల్గొనేవారు, ఇటీవల లైంగిక వ్యాధుల బారిన పడ్డ వారికి హెచ్ఐవీ ముప్పును తగ్గించేందుకు వైద్యులు ఈ ట్రీట్‌మెంట్‌ను సూచిస్తుంటారు.
ఇవీ చదవండి:
ఈసారి నేను అసెంబ్లీలో అడుగుపెట్టడం ఖాయం
రేపే కేంద్ర బడ్జెట్.. ఎప్పుడు.. ఎక్కడ వీక్షించాలి.. ఏమిటా ప్రత్యేకతలు?