టీఎంసీ ఓటమిపై కాంగ్రెస్ నేతల సంబరాలు.. రాహుల్ గాంధీ ఆగ్రహం
ABN , Publish Date - May 05 , 2026 | 01:52 PM
పశ్చిమ బెంగాల్‌లో టీఎంసీ ఓటమి చెందడం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ కొందరు కాంగ్రెస్ నాయకులు సంబరాలు చేసుకోవడంపై ఆ పార్టీ అగ్రనేత సీరియస్ అయ్యారు. ఇది ఒక పార్టీ ఓటమి మాత్రమే కాదని.. దేశ ప్రజాస్వామ్యాన్ని కూనీ చేసే దిశగా బీజేపీ వేసిన అడుగని ఆయన వ్యాఖ్యానించారు.
ఇంటర్నెట్ డెస్క్: కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఇటీవల చేసిన వ్యాఖ్యలు దేశ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారాయి. పశ్చిమ బెంగాల్‌లో తృణమూల్ కాంగ్రెస్(టీఎంసీ) ఓటమి చెందడంతో కొందరు కాంగ్రెస్ నేతలు సంబరాలు చేసుకోవడంపై ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. బెంగాల్, అస్సాం రాష్ట్రాల్లో జనాదేశాన్ని బీజేపీ చోరీచేసిందని ఆరోపించారు. ఇది కేవలం ఓ పార్టీ ఓటమి కాదని, దేశ ప్రజాస్వామ్య వ్యవస్థను కూనీ చేసే ప్రమాదకర పరిణామం అని ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు.
సంకుచిత రాజకీయ ప్రయోజనాలను పక్కనపెట్టి.. దేశ ప్రజాస్వామ్య పరిరక్షణపై అన్ని పార్టీలు దృష్టి సారించాలని ఈ సందర్భంగా రాహుల్ పిలుపునిచ్చారు. 'ఇది ఒక పార్టీకి సంబంధించిన విషయం కాదు. దేశ అస్తిత్వానికి సంబంధించిన సమస్య' అని ఆయన పేర్కొన్నారు. విపక్ష పార్టీల మధ్య అనైక్యత పెరుగుతున్న నేపథ్యంలో.. అది బీజేపీకి వరంగా మారుతోందని ఆందోళన వ్యక్తం చేశారు రాహుల్.
బెంగాల్, అస్సాం రాష్ట్రాల్లో చోటుచేసుకున్న పరిణామాలు దేశ ప్రజాస్వామ్య వినాశనానికి సంకేతాలుగా పరిగణించాల్సిన అవసరం ఉందని రాహుల్ హెచ్చరించారు. విపక్షాలు పరస్పర విభేదాలను తగ్గించి, ప్రజాస్వామ్య రక్షణ కోసం ఒకే వేదికపైకి రావాలని సూచించారు. దేశ భవిష్యత్తు దృష్ట్యా రాజకీయ పార్టీలన్నీ బాధ్యతతో వ్యవహరించాల్సిన సమయం ఆసన్నమైందని ఆయన అభిప్రాయపడ్డారు.
ఇవీ చదవండి:
'ఆప్‌లాగే టీఎంసీ అవినీతిమయమైంది.. తదుపరి టార్గెట్ అదే..'
ఒకే కుటుంబం.. మూడు పార్టీలు.. మూడు విజయాలు.. లాటరీ అంటే ఇదే..