ఐడీబీఐ బ్యాంక్ ప్రైవేటీకరణపై రాహుల్ గాంధీ ఆగ్రహం.. ఉద్యోగులకు మద్దతు
ABN , Publish Date - Oct 30 , 2026 | 12:16 PM
ఐడీబీఐ బ్యాంక్ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ బ్యాంకు ఉద్యోగులకు లోక్‌సభ ప్రతిపక్షనేత రాహుల్ గాంధీ బహిరంగ లేఖ రాశారు. ఈ మేరకు వారి పోరాటానికి సంపూర్ణ మద్దతు ప్రకటించారు.
ఇంటర్నెట్ డెస్క్: ఐడీబీఐ బ్యాంక్(ఇండస్ట్రియల్ డెవలప్‌మెంట్ బ్యాంకు ఆఫ్ ఇండియా) ను ప్రైవేటీకరించాలనే కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని రాహుల్ గాంధీ తప్పుపట్టారు. లాభాల్లో ఉన్న ప్రభుత్వ బ్యాంకును ఎందుకు విక్రయిస్తున్నారని కేంద్ర ప్రభుత్వాన్ని ఆయన ప్రశ్నించారు. ప్రభుత్వ రంగ బ్యాంకులు అమ్మకానికి పెట్టే ఆస్తులు కావని.. దేశ నిర్మాణానికి ఉపయోగపడే సంస్థలని స్పష్టం చేశారు. ఈ మేరకు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా పోరాటం చేస్తున్న బ్యాంక్ ఉద్యోగులకు బహిరంగ లేఖ ద్వారా సంపూర్ణ మద్దతు ప్రకటించారు.
‘లాభాల్లో ఉన్న ప్రభుత్వ బ్యాంకును ఎందుకు విక్రయిస్తున్నారు. ఏడేళ్ల క్రితం ఐడీబీఐ నష్టాల్లో ఉంది. కానీ.. గత ఏడాది రూ.9 వేల కోట్లకు పైగా లాభాలు ఆర్జించింది. ఉద్యోగుల శ్రమ, అంకితభావంతోనే ఇది సాధ్యమైంది. బ్యాంక్ ప్రైవేటీకరణతో ఎస్సీ, ఎస్టీ, ఓబీసీల రిజర్వేషన్లకు ముప్పు ఏర్పడుతుంది. ఉద్యోగుల సర్వీసు నిబంధనలు, ఉద్యోగ భద్రత కూడా ప్రమాదంలో పడతాయి. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం, ఎల్‌ఐసీ చేతుల్లో 95 శాతం వాటాలుండగా.. విక్రయం తర్వాత ప్రభుత్వ, ఎల్‌ఐసీ వాటా 34 శాతానికి తగ్గుతుంది. 2003లో ఐడీబీఐలో కనీసం 51 శాతం వాటా కొనసాగిస్తామని పార్లమెంట్‌కు ప్రభుత్వం హామీ ఇచ్చిందన్న విషయాన్ని కేంద్రం మరచిపోయిందా..’ అని రాహుల్ గాంధీ ప్రశ్నించారు.
ఇవి కూడా చదవండి..
పుతిన్‌తో ట్రంప్ భారీ చమురు ఒప్పందాలు.. అమెరికా కీలక ప్రతిపాదనలు!
పసిడి ధరలు స్వల్పంగా తగ్గాయి.. ఈ రోజు మీ నగరంలో ఎలా ఉన్నాయంటే..