బాలాకోట్ మెజిషియన్.. మోదీపై రాహుల్ విసుర్లు, భగ్గుమన్న బీజేపీ
ABN , Publish Date - Apr 17 , 2026 | 04:24 PM
మహిళా రిజర్వేషన్ సవరణ బిల్లు, నియోజకవర్గాల పునర్విభజనపై జరిగిన చర్చలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీని 'మెజిషియన్'గా రాహుల్ గాంధీ సంబోధించారు. దీనిపై లోక్‌సభలో బీజేపీ ఎంపీలు అభ్యంతరం వ్యక్తం చేశారు.
న్యూఢిల్లీ: మహిళా రిజర్వేషన్ సవరణ బిల్లు, నియోజకవర్గాల పునర్విభజనపై జరిగిన చర్చలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీని 'మెజిషియన్'గా రాహుల్ గాంధీ (Rahul Gandhi) సంబోధించారు. దీనిపై లోక్‌సభలో బీజేపీ ఎంపీలు అభ్యంతరం వ్యక్తం చేశారు. పార్లమెటరీ నిబంధనల ప్రకారం మాట్లాడాలని, బిల్లుపై దృష్టి పెట్టాలని స్పీకర్ ఓం బిర్లా సైతం రాహుల్‌కు సూచించారు.
రాహుల్ ఏమన్నారంటే..
కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించిన బిల్లును దేశ వ్యతిరేక చర్యగా రాహుల్ తప్పుప్టటారు. దళితులు, ఓబీసీలకు సమాజంలో దక్కాల్సిన స్థానాన్ని దూరం చేసేలా ఉందన్నారు. ఇది మహిళా సాధికారత కోసం తెచ్చిన బిల్లు కాదని, దేశ ఎన్నికల ముఖచిత్రాన్ని మార్చే ప్రయత్నమని తప్పుపట్టారు. మహిళా రిజర్వేషన్ బిల్లు ద్వారా దేశంలో కులగణన డిమాండ్‌ను పక్కదారి పట్టించే ప్రయత్నం జరుగుతోందన్నారు. 'ఈ బిల్లు ఆమోదం పొందదని బీజేపీకి కూడా తెలుసు. వాళ్లంత తెలివతక్కువ వాళ్లు కాదు. ఈ బిల్లును విపక్షంలోని ప్రతి ఒక్కరూ వ్యతిరేకిస్తారని వాళ్లకు తెలుసు. అయినా ప్రధాని రెండు సందేశాలు పంపాలనుకున్నారు. ఇందులో మొదటిది.. దేశ ఎలక్టోరల్ మ్యాప్‌ను ఆయన మార్చాలనుకున్నారు. రెండవది.. తాను మహిళా పక్షపాతినని మరోసారి చాటిచెప్పాలని అనుకున్నారు. బాలాకోట్ మెజిషియన్, డీమోనిటైజేషన్ మెజియన్, సిందూర్ మెజిషియన్ అక్షస్మాత్తుగా పట్టుబడ్డారు' అని రాహుల్ వ్యాఖ్యానించారు.
ప్రధానమంత్రిని ఉద్దేశించి రాహుల్ చేసిన వ్యాఖ్యలపై పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి అభ్యంతరం వ్యక్తం చేశారు. ప్రధానిపై అభ్యంతరకరమైన భాష వాడటాన్ని తప్పుపట్టారు. బాలాకోట్ దాడులు, ఆపరేషన్ సిందూర్ ప్రస్తావనతో దేశాన్ని, మిలటరీని అవమానపరుస్తున్నారని అన్నారు. దేశ ప్రధానమంత్రి గురించి విపక్ష నేత ఇలాంటి వ్యాఖ్యలు చేయడం దురదృష్టకరమని, ఆ వ్యాఖ్యాలను రికార్డులను నుంచి తొలగించాలని స్పీకర్ ఓం బిర్లాను రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ కోరారు. అందుకు స్పీకర్ అంగీకరించారు.
ఇవి కూడా చదవండి..
ఇది మహిళా బిల్లు కాదు, 2023లోనే బిల్లును ఆమోదించాం: రాహుల్
మీ మనస్సాక్షి చెప్పిందే వినండి.. మహిళా రిజర్వేషన్ల బిల్లుకు మద్దతివ్వండి: మోదీ