రాహుల్ జుగుప్సాకరమైన వ్యక్తి.. విదేశీ సాయం వ్యాఖ్యలపై బీజేపీ మండిపాటు
ABN , Publish Date - Nov 03 , 2026 | 01:17 PM
కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ, బీజేపీ నేతల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. విదేశీ సాయంతోనే ప్రధాని నరేంద్ర మోదీ అధికారంలో కొనసాగుతున్నారని రాహుల్ ఎక్స్‌లో ఆరోపించారు.
ఇంటర్నెట్ డెస్క్: కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ, బీజేపీ నేతల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. విదేశీ సాయంతోనే ప్రధాని నరేంద్ర మోదీ అధికారంలో కొనసాగుతున్నారని రాహుల్ ఎక్స్‌లో ఆరోపించిన విషయం తెలిసిందే. బీజేపీ ఆర్థిక వ్యవస్థను విదేశీయులే నియంత్రిస్తున్నారని ఆయన ట్వీట్ చేశారు. దీంతో ఆయన వ్యాఖ్యలపై బీజేపీ జాతీయ ప్రతినిధి సీఆర్ కేశవన్ తీవ్రంగా అభ్యంతరం తెలిపారు. రాహుల్ గాంధీ ఒక అసహ్యకరమైన, జుగుప్సాకరమైన వ్యక్తి అని ఆయన విమర్శించారు. రాహుల్ నిరాధార, పేలవ ఆరోపణలు చేసి చివరకు నవ్వులపాలవుతారని, అది ఆయనకు అలవాటేనని కేశవన్ ట్వీట్ చేశారు. వాస్తవానికి 2023 మార్చిలో యూకేలో భారత ప్రజాస్వామ్యం గురించి రాహుల్ దిగజారి మాట్లాడారని విమర్శించారు. దేశ అంతర్గత వ్యవహారాల్లో విదేశీ జోక్యం కోరింది రాహులేనని మండిపడ్డారు.
నాడు రాహుల్ మాట్లాడిన వీడియోను ఆయన షేర్ చేశారు. కాంగ్రెస్ నాయకత్వానికి ఫోరం ఆఫ్ డెమోక్రటిక్ లీడర్స్ ఇన్ ద ఏషియా పసిఫిక్‌తో సంబంధాలు ఉన్నాయని, అంతేకాకుండా జార్జ్ సోరోస్ ఫౌండేషన్ నుంచి కాంగ్రెస్‌కు నిధులు కూడా అందాయని ఆయన ఆరోపించారు. అలాగే రాహుల్ విదేశీ పర్యటనలపైనా ఆయన విమర్శలు చేశారు. ‘రాహుల్ ఎందుకు రహస్యంగా విదేశీ పర్యటనలకు వెళ్తారు? విదేశాల్లో వ్యక్తులను ఆయన ఎందుకు రహస్యంగా కలుస్తారు? అసలు ఆయన అజెండా ఏమిటి?’ అని కేశవన్ ప్రశ్నించారు.