Jana Nayagan: విజయ్ జననాయగన్ వాయిదాపై రాహుల్ ట్వీట్.. మోదీపై విమర్శలు
ABN , Publish Date - Jan 13 , 2026 | 04:09 PM
పొంగల్ సీజన్‌ను దృష్టిలో ఉంచుకుని జనవరి 9న 'జననాయగన్' విడుదల కావాల్సి ఉంది. అయితే సెన్సార్ చిక్కుల వల్ల సినిమా వాయిదా పడింది. దీనిపై కోర్టులను ఆశ్రయించినప్పటికీ విడుదలలో జాప్యం తలెత్తింది.
చెన్నై: తమిళ స్టార్ హీరో విజయ్ (Vijay) నటించిన 'జన నాయగన్' (Jana Nayagan) చిత్రం సెన్సార్‌కు నోచుకోకుండా వాయిదా పడటంతో తమిళనాట రాజకీయ దుమారం రేగుతోంది. దీనిపై లోక్‌సభలో విపక్ష కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) ఒక ట్వీట్‌లో స్పందించారు. తమిళ సంస్కృతిపై కేంద్రం దాడి జరుపుతోందని విమర్శించారు.
'జన నాయగన్' సినిమాను అడ్దుకోవడం ద్వారా తమిళ సంస్కృతిపై కేంద్ర సమాచార, ప్రసార శాఖ దాడి చేస్తోందని రాహుల్ విమర్శించారు. తమిళ ప్రజల వాణిని అణిచివేయాలని మోదీ చేస్తున్న ప్రయత్నాలు సఫలం కావని అన్నారు.
పొంగల్ సీజన్‌ను దృష్టిలో ఉంచుకుని జనవరి 9న 'జననాయగన్' విడుదల కావాల్సి ఉంది. అయితే సెన్సార్ చిక్కుల వల్ల సినిమా వాయిదా పడింది. దీనిపై కోర్టులను ఆశ్రయించినప్పటికీ విడుదలలో జాప్యం తలెత్తింది. అయితే సర్టిఫికేషన్ నిబంధనల పేరుతో కేంద్ర సమాచార, ప్రచార శాఖ సినిమా క్లియరెన్స్‌ను అడ్డుకుందనే ప్రచారం జరుగుతోంది. సామాజిక న్యాయం, రాజకీయ జవాబుదారీతనం, మాస్ లీడర్‌షిప్ వంటి ప్రధాన అంశాలతో పాటు తమిళ రాజకీయ చరిత్ర, సాంస్కృతిక నేపథ్యంతో 'జన నాయగన్' రూపొందినట్టు ప్రచారం జరగడంతో సినిమా విడుదలకు ముందే ప్రేక్షకుల్లో ఉత్సుకత నెలకొంది. అయితే సినిమా సెన్సార్ చిక్కుల్లో పడటంపై విపక్ష నేతలు, తమిళ సినీ పరిశ్రమ వర్గాలు నుంచి విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
కాగా, రాహుల్ గాంధీ వ్యాఖ్యలపై కానీ, సాంస్కృతిక అణిచివేత ఆరోపణలపై కానీ కేంద్రం ఇంతవరకూ స్పందించలేదు. అయితే 'జననాయగన్' సినిమాపై తీసుకునే ఎలాంటి చర్యలైనా సినిమాటోగ్రఫీ చట్టం, సర్టిఫికేషన్ గైడ్‌లైన్స్ కింద అమలులో ఉన్న చట్టాలు, రెగ్యులేటరీ విధానాలకు లోబడే ఉంటాయని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి.
ఇవి కూడా చదవండి..
భూతల దాడులకు కూడా సిద్ధం.. ఆర్మీ చీఫ్ ఉపేంద్ర ద్వివేది
కరూర్ తొక్కిసలాటతో టీవీకేకు సంబంధం లేదు... సీబీఐకి చెప్పిన విజయ్
మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి