పుతిన్ కోసం ఐటీసీ మౌర్య స్పెషల్ వంటకాలు.. ప్రత్యేక చాక్లెట్ల నుంచి థాలీ వరకు అన్నీ ప్రత్యేకమే!
ABN , Publish Date - Sep 11 , 2026 | 08:51 PM
బ్రిక్స్ సదస్సు కోసం ఢిల్లీకి వచ్చిన రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌కు ఐటీసీ మౌర్య హోటల్ ప్రత్యేక ఆతిథ్యం సిద్ధం చేసింది. రష్యా సంస్కృతిని ప్రతిబింబించే మ్యాట్రియోష్కా బొమ్మల ఆకారంలోని చాక్లెట్లతో పాటు.. భారతీయ సంప్రదాయ రుచులతో ప్రత్యేక థాలీని కూడా తయారు చేసింది.
ఇంటర్నెట్ డెస్క్: 18వ బ్రిక్స్ శిఖరాగ్ర సమావేశంలో పాల్గొనేందుకు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ న్యూఢిల్లీకి చేరుకున్న సంగతి తెలిసిందే. సెప్టెంబర్ 12, 13 తేదీల్లో భారత్ మండపంలో ఈ సదస్సు జరగనుంది. ఈ సమావేశానికి బ్రెజిల్, రష్యా, చైనా, దక్షిణాఫ్రికా, ఈజిప్ట్, ఇండోనేషియా, ఇరాన్, యూఏఈతో పాటు ఇతర భాగస్వామ్య దేశాల నేతలు హాజరుకానున్నారు. పుతిన్ ఢిల్లీలోని ఐటీసీ మౌర్య హోటల్‌లో బస చేయనున్నట్లు సమాచారం.
ఈ క్రమంలోనే పుతిన్ కోసం ఐటీసీ మౌర్య ప్రత్యేకమైన విందును సిద్ధం చేసింది. రష్యా సంస్కృతి, సంప్రదాయాలు, వారసత్వం, ఐక్యతకు ప్రతీకగా నిలిచే మ్యాట్రియోష్కా బొమ్మల ఆకారంలోని చాక్లెట్లను ప్రత్యేకంగా తయారు చేసింది. వీటితో పాటు రష్యా ప్రకృతి దృశ్యాలు, అక్కడి ప్రముఖ నిర్మాణాలను ప్రతిబింబించేలా ఓ ప్రత్యేకమైన చాక్లెట్ శిల్పాన్ని కూడా సిద్ధం చేసినట్లు హోటల్ వర్గాలు తెలిపాయి.
భారతీయ రుచులతో ప్రత్యేక థాలీ
చాక్లెట్లతో పాటు భారతీయ పాకశాస్త్ర సంప్రదాయాన్ని ప్రతిబింబించేలా ప్రత్యేకమైన థాలీని కూడా చెఫ్‌లు సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. ఇందులో భారతీయ సంప్రదాయ స్వీట్లను అందించనున్నారు. భారతీయ రుచులను మరింత ప్రత్యేకంగా పరిచయం చేసేందుకు యాలకులు, కుంకుమపువ్వు, గులాబీ, అల్లం, సోంపు వంటి సుగంధ ద్రవ్యాలతో తయారు చేసిన చాక్లెట్ బాన్‌బాన్‌లను కూడా సిద్ధం చేశారు. బ్రిక్స్ సదస్సుకు హాజరవుతున్న అంతర్జాతీయ నేతలు, ప్రతినిధులకు ఆతిథ్యం ఇచ్చేందుకు ఢిల్లీలోని పలు విలాసవంతమైన హోటళ్లు కూడా ప్రత్యేకమైన వంటకాలను సిద్ధం చేస్తున్నట్లు సమాచారం.
Also Read:
జీవో నంబర్ 97పై అసెంబ్లీ వేదికగా మంత్రి వివేక్ కీలక ప్రకటన..
నెట్‌వర్క్ సమస్య.. టెక్నీషియన్‌ను టవర్‌కు కట్టేసిన గ్రామస్థులు