Share News

పంజాబీ సిక్కు యువకుడి వీడియో వైరల్

ABN , Publish Date - Aug 14 , 2026 | 03:42 PM

మెక్సికోలో చిక్కుకున్న పంజాబీ సిక్కు యువకుడి వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 'నేను పెద్ద తప్పు చేశాను' అని కన్నీళ్లు పెట్టుకుంటూ అతడు వేడుకుంటున్న తీరు అందరినీ చలింపజేస్తోంది.

పంజాబీ సిక్కు యువకుడి వీడియో వైరల్
Punjab Youth Warns Against 'Donkey' Route in Tearful Mexico Video

ఇంటర్నెట్ డెస్క్, ఆగస్టు 14: అక్రమంగా విదేశాలకు వెళ్లే 'డంకీ రూట్' (Dunki Route) వల్ల ఎలాంటి దారుణ పరిస్థితులు ఎదురవుతాయో తెలిపే ఓ వీడియో బయటకొచ్చింది. మెక్సికోలో చిక్కుకుపోయానని చెబుతూ, కన్నీరు మున్నీరవుతున్న ఓ పంజాబీ సిక్కు యువకుడి వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.


సదరు వీడియోలో, ఆ యువకుడు గదిలో మంచంపై పడుకుని, చేతులు జోడించి వేడుకుంటూ, చట్టవిరుద్ధమైన 'డంకీ' మార్గం ద్వారా మెక్సికోకు రావద్దని ప్రజలను కోరుతున్నాడు. 'మెక్సికోలో భారతీయ సిక్కు పట్ల దారుణమైన ప్రవర్తన' అనే శీర్షికతో ఉన్న ఈ వీడియోలో, తప్పించుకోవడానికి ప్రయత్నించినప్పుడు తనపై దాడి జరిగిందని ఆ యువకుడు ఆరోపిస్తున్నాడు. తనను చాలా తీవ్రంగా కొట్టారని, ప్రస్తుతం నడవలేని స్థితిలో ఉన్నానని చెప్పుకొచ్చాడు. తీవ్ర ఆవేదన, భయంతో ఉన్న అతను.. ఇలాంటి తప్పు ఎవరూ చేయొద్దని పదే పదే విజ్ఞప్తి చేశాడు.


తనను తీసుకువచ్చిన వ్యక్తి వైపు చూపుతూ.. ఏజెంట్ల మాయమాటలు నమ్మి అక్రమ మార్గాల్లో విదేశాలకు రావద్దని అతను అభ్యర్థించాడు. 'నేను పెద్ద తప్పు చేశాను, దానికి తగిన మూల్యం కూడా చెల్లించుకున్నాను' అని కన్నీళ్లతో క్షమాపణలు కోరాడు. యువకుడి పేరు, చిరునామా వివరాలు వెల్లడి కాలేదు. ప్రస్తుతం ఇతనిలాగే ఎంతో మంది పంజాబీ యువకులు మెక్సికోలో చిక్కుకున్నారని సోషల్ మీడియా పోస్టులు పేర్కొంటున్నాయి.

ఏంటి ఈ 'డంకీ రూట్'?

అమెరికా, కెనడా, యూకే వంటి అభివృద్ధి చెందిన దేశాలకు అక్రమంగా చేరుకోవడానికి మానవ అక్రమ రవాణాదారులు(Human Traffickers) ఉపయోగించే ప్రమాదకరమైన నెట్‌వర్క్‌ను 'డంకీ రూట్' అంటారు. ఈ ప్రయాణం కోసం ఏజెంట్లు రూ.20 లక్షల నుంచి రూ.70 లక్షల వరకు వసూలు చేస్తారు.

నరకప్రాయ ప్రయాణం: ఒకటి కంటే ఎక్కువ దేశాల (ఉదాహరణకు ఈక్వెడార్, కొలంబియా, పనామా అడవులు, మెక్సికో) గుండా ప్రాణాలకు తెగించి దాటాల్సి ఉంటుంది.

అకృత్యాలు - దోపిడీలు: ప్రయాణంలో తీవ్రమైన శారీరక దాడి, దోపిడీ, ఆకలి, నిర్బంధం, ప్రాణాపాయ పరిస్థితులను ఎదుర్కొంటారు.

అక్రమ మార్గాలు ఎందుకు ఎంచుకుంటున్నారు?

చట్టబద్ధమైన వీసాలు(స్టడీ లేదా వర్క్ వీసాలు) పొందడానికి అవసరమైన చదువు, భాషా ప్రావీణ్యం లేకపోవడం, ఆర్థిక స్తోమత సరిగా లేకపోవడమే ఇందుకు ప్రధాన కారణం. మెరుగైన భవిష్యత్తు కోసం, విదేశీ ఆదాయంపై ఆశతో పంజాబ్, హరియాణా వంటి రాష్ట్రాల నుంచి అనేకమంది యువకులు ఏజెంట్ల ముఠాల వలలో పడి ఇరుక్కుపోతున్నారు.


ఇవి కూడా చదవండి...

కరూర్ తొక్కిసలాట బాధితులకు ప్రభుత్వ జాబ్స్.. హైకోర్టు తీర్పుపై సుప్రీం స్టే

రాహుల్ గాంధీకి ఊరట.. పరువు నష్టం కేసును కొట్టేసిన సుప్రీం

Read Latest National News And Telugu News

Updated Date - Aug 14 , 2026 | 04:44 PM