Share News

పాఠ్యాంశం తొలగిస్తాం.. సుప్రీం సీరియస్‌పై కేంద్రం

ABN , Publish Date - Feb 25 , 2026 | 05:25 PM

ఎన్‌సీఈఆర్‌టీ 8వ తరగతి పాఠ్యాంశంలో 'న్యాయవవస్థలో అవినీతి' అంశాన్ని ప్రవేశపెట్టడంపై సుప్రీంకోర్టు సీరియస్‌ కావడంతో కేంద్రం వెంటనే స్పందించింది. పాఠ్యాంశంలోని భాగాలను తొలగించేందుకు నిర్ణయించింది.

పాఠ్యాంశం తొలగిస్తాం.. సుప్రీం సీరియస్‌పై కేంద్రం
Supreme court

న్యూఢిల్లీ: ఎన్‌సీఈఆర్‌టీ (NCERT) 8వ తరగతి పాఠ్యాంశంలో 'న్యాయవవస్థలో అవినీతి' అంశాన్ని ప్రవేశపెట్టడంపై సుప్రీంకోర్టు సీరియస్‌ కావడంతో కేంద్రం వెంటనే స్పందించింది. పాఠ్యాంశంలోని భాగాలను తొలగించేందుకు నిర్ణయించింది. పాఠ్యాంశంలో ఆవిధంగా వచ్చి ఉండాల్సింది కాదని, దీనికి బదులు స్ఫూర్తిదాయకమైన విషయాలను రాసి ఉండాల్సిందని కేంద్రం అభిప్రాయపడినట్టు ఉన్నత స్థాయి వర్గాలు తెలిపాయి.


ఎన్‌సీఈఆర్‌టీ 8వ తరగతి పాఠ్యాశంలో న్యాయవ్యవస్థలో అవినీతి అంశాన్ని ప్రవేశపెట్టడంపై సుప్రీంకోర్టు బుధవారంనాడు తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. ఈ వ్యవహారం న్యాయవాదులు, న్యాయమూర్తులందరినీ కలవరానికి గురి చేసిందని, న్యాయవ్యవస్థ ప్రతిష్ఠకు భంగం కలిగిస్తే ఊరుకునేది లేదని, చట్టం తన పని తాను చేసుకుపోతుందని సీజేఐ సూర్యకాంత్ పేర్కొన్నారు. 'కొన్ని రోజులు ఆగండి. దీనిపై నేను సుమోటోగా విచారణ చేపడతాను' అని తెలిపారు. న్యాయవ్యవస్థలో అవినీతి గురించి 8వ తరగతి విద్యార్థులకు ఎన్‌సీఈఆర్‌టీ బోధిస్తోందని సీనియర్ న్యాయవాది కపిల్ సిబల్ సుప్రీంకోర్టు దృష్టికి తెచ్చారు. మంత్రులు, ఎమ్మెల్యేలు సహా రాజకీయ నేతలు పెద్దఎత్తున అవినీతికి పాల్పడుతుంటే ప్రభుత్వాలు ఎందుకు దాచిపెడుతున్నాయని ప్రశ్నించారు. ఎంపిక చేసి మరీ న్యాయవ్యవస్థనే నిలదీస్తున్నట్టు కనిపిస్తోందని సీనియర్ న్యాయవాది అభిషేక్ మను సింఘ్వి సైతం అభ్యంతరం వ్యక్తం చేశారు.


ఎన్‌సీఈఆర్‌టీ పాఠ్యాంశంలో..

ఎన్‌సీఈఆర్‌టీ ఇటీవల న్యాయవ్యవస్థ అనే అధ్యాయాన్ని విస్తరించింది. న్యాయవ్యవస్థలో ఉన్న అవినీతి అంశాన్ని తొలిసారిగా ప్రవేశపెట్టింది. విద్యార్థులు కేవలం సిద్ధాంత పరమైన అవగాహనకే పరిమితం కారాదని, వ్యవస్థలోని సవాళ్లు, లోపాలు, వాస్తవ పరిస్థితుల గురించి కూడా తెలుసుకోవాలనే లక్ష్యంతో ఈ మార్పులు చేసినట్టు చెబుతోంది. లక్షలాది కేసులు, విచారణలో జరుగుతున్న జాప్యం వంటి అంశాలను పాఠ్యాంశంలో ప్రస్తావించింది. అయితే పాఠ్యాంశంలో తాజా మార్పుల వల్ల చిన్నారులలో న్యాయవ్యవస్థపై ప్రతికూల భావన పెరగవచ్చనే ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.


ఇవి కూడా చదవండి..

న్యాయవ్యవస్థలో అవినీతిపై పాఠ్యాంశం.. ఎన్‌సీఈఆర్‌టీపై సుప్రీం సీరియస్

వివాదంలో బీఎస్ఎన్ఎల్ డైరెక్టర్ పర్యటన.. కేంద్రం షోకాజ్ నోటీసు

Updated Date - Feb 25 , 2026 | 05:28 PM