మోదీ రాజీనామా లేఖ వైరల్.. పీఐబీ ఫ్యాక్ట్ చెక్ స్పందనిదే..
ABN , Publish Date - Jul 30 , 2026 | 05:08 PM
ప్రధాని సంతకంతో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న లేఖ నకిలీదేనని పీఐబీ ఫ్యాక్ట్ చెక్ చేసింది. వైరల్ పోస్టులను ఆధారంగా చేసుకుని వ్యక్తిగత, ఆర్థిక వివరాలను షేర్ చేసుకోవద్దని పీఐబీ సూచించింది.
ఇంటర్నెట్ డెస్క్: ప్రధాని నరేంద్ర మోదీ రాజీనామా చేసినట్లు ఆయన సంతకంతో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న లేఖ పూర్తిగా ఫేక్ అని కేంద్ర ప్రభుత్వ ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో(పీఐబీ) ఫ్యాక్ట్ చెక్ విభాగం నిర్ధారించింది. ప్రధానమంత్రి కార్యాలయం నుంచి అలాంటి లేఖ ఏదీ విడుదల కాలేదని, మోదీ కూడా దానిపై సంతకం చేయలేదని స్పష్టం చేసింది. నెట్టింట చక్కర్లు కొడుతున్న ఈ ఫేక్ లెటర్ పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.
అధికారిక వర్గాల నుంచి నిర్ధారణ చేసుకోకుండా ఇలాంటి సందేశాలను నమ్మకూడదని, ఫార్వర్డ్ చేయకూడదని 'ఎక్స్' వేదికగా సూచించింది పీఐబీ. 'ప్రధాని సంతకంతో ప్రచారంలో ఉన్న లేఖ పూర్తిగా ఫేక్. తప్పుడు పత్రాలు, నకిలీ మెసేజ్ల ద్వారా ప్రజల్లో గందరగోళం సృష్టించడం, తప్పుగా ప్రచారం చేయడం, కొన్ని సందర్భాల్లో ఆర్థిక మోసాలకు పాల్పడటం జరుగుతుంది' అని తెలిపింది.
వైరల్ పోస్టులను ఆధారంగా చేసుకుని వ్యక్తిగత, ఆర్థిక వివరాలను షేర్ చేసుకోవద్దని, పెట్టుబడుల వంటి నిర్ణయాలు తీసుకోవద్దని పౌరులకు సూచించింది పీఐబీ. అనుమానాస్పద పోస్టులు, నకిలీ పత్రాలు కనిపిస్తే పీఐబీ ఫ్యాక్ట్ చెక్ బృందానికి వాట్సాప్ లేదా ఈ-మెయిల్ ద్వారా ఫిర్యాదు చేయాలని కోరింది. కృత్రిమ మేధ(AI) ఆధారిత నకిలీ కంటెంట్, ఫోర్జరీ పత్రాలు పెరుగుతున్న నేపథ్యంలో ఏ సమాచారాన్నైనా అధికారిక వర్గాలు ధ్రువీకరించాకే నమ్మాలని అధికారులు సూచిస్తున్నారు.
ఇవీ చదవండి:
బస్సు డ్రైవర్ ఇంట్లో రూ.28 కోట్ల నగదు.. లెక్కించడంలో 5 మెషీన్లు విఫలం
ఢిల్లీలో ఆప్ కార్యాలయం ముట్టడి.. పంజాబ్ పేపర్ లీక్‌పై బీజేపీ ఆందోళన