Share News

తిరుపతికి ప్రధాని

ABN , Publish Date - Nov 29 , 2026 | 01:13 AM

తిరుపతిలో ప్రధాని నరేంద్ర మోదీ మూడు రోజులపాటు బస చేయనున్నారు. ఏర్పేడు వద్దనున్న ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ సైన్స్‌ ఎడ్యుకేషన్‌ అండ్‌ రీసెర్చ్‌(ఐసర్‌) వేదికగా జరగనున్న 61వ అఖిల భారత పోలీస్‌ డైరెక్టర్‌ జనరల్స్‌(డీజీపీ, ఐజీపీ) సదస్సుకు హాజరవుతున్నారు.

తిరుపతికి ప్రధాని

  • 4 నుంచి డీజీపీ, ఐజీపీల సదస్సు

  • అదేరోజు రానున్న మోదీ.. 3 రోజులు బస

  • స్వాగతించనున్న చంద్రబాబు, పవన్‌ కల్యాణ్‌

  • సదస్సుకు హాజరు కానున్న అమిత్‌ షా, దోభాల్‌

  • పాల్గొననున్న 200 మంది ఐపీఎస్‌ అధికారులు

  • 6న శ్రీవారిని దర్శించుకోనున్న మోదీ

తిరుపతి(కలెక్టరేట్‌), నవంబరు 28(ఆంధ్రజ్యోతి): తిరుపతిలో ప్రధాని నరేంద్ర మోదీ మూడు రోజులపాటు బస చేయనున్నారు. ఏర్పేడు వద్దనున్న ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ సైన్స్‌ ఎడ్యుకేషన్‌ అండ్‌ రీసెర్చ్‌(ఐసర్‌) వేదికగా జరగనున్న 61వ అఖిల భారత పోలీస్‌ డైరెక్టర్‌ జనరల్స్‌(డీజీపీ, ఐజీపీ) సదస్సుకు హాజరవుతున్నారు. డిసెంబరు 4న ప్రారంభమయ్యే ఈ ప్రతిష్ఠాత్మక సదస్సులో దేశ అంతర్గత భద్రత తదితర ముఖ్యమైన అంశాలపై ప్రధాని అధ్యక్షతన సమీక్షించనున్నారు. కేంద్ర హోం మంత్రి అమిత్‌షాతో పాటు జాతీయ భద్రతా సలహాదారు అజిత్‌ దోభాల్‌, రాష్ట్రాల డీజీపీలు, ఐజీపీలతో పాటు 200 మంది ఐపీఎస్‌లు సదస్సులో పాల్గొంటున్నారు. సదస్సు చివరి రోజు 6న మోదీ తిరుమల శ్రీవారిని దర్శించుకుంటారు.

ప్రధాని పర్యటన ఇలా

ప్రత్యేక విమానంలో ఢిల్లీ నుంచి డిసెంబరు 4, రాత్రి 8.30 గంటలకు రేణిగుంట ఎయిర్‌పోర్టుకు మోదీ చేరుకోనున్నారు. అక్కడి నుంచి రోడ్డు మార్గాన ఐసర్‌కు చేరుకుంటారు. అక్కడే రాత్రి బస చేస్తారు. మరుసటి రోజు శనివారం ఉదయం 8.15 నుంచి రాత్రి 9 గంటల వరకు సదస్సులో వివిధ అంశాలపై చర్చాగోష్ఠిలో పాల్గొంటారు. ఆదివారం ఉదయం 8.15 గంటల నుంచి మధ్యాహ్నం 3.30 గంటల వరకు ఐసర్‌లో ఉండి తర్వాత తిరుమల చేరుకుంటారు. 5.30 గంటలకు శ్రీవారిని దర్శించుకుని ఢిల్లీకి తిరుగుపయనం అవుతారు. ఆయనకు స్వాగతం పలికేందుకు 4వ తేది సాయంత్రం గవర్నర్‌ నజీర్‌, సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్‌ తిరుపతికి రానున్నారు.

ఈ వార్తలనూ చదవండి:

అమరావతి నిర్మాణాలపై వైసీపీ తప్పుడు ప్రచారం.. నిజాలు తేల్చిన ఏపీ ఫ్యాక్ట్‌ చెక్..

నేడే రెండో విడత పల్లె సమరం

Updated Date - Nov 29 , 2026 | 02:18 AM