Share News

అగ్నిప్రమాదం వేళ.. రాజస్థాన్ రిఫైనరీకి మోదీ ప్రారంభోత్సవం వాయిదా

ABN , Publish Date - Apr 20 , 2026 | 08:04 PM

రాజస్థాన్‌లోని బలోత్రా జిల్లా పచ్‌పద్రలోని ఆయిల్ రిఫైనరీని మంగళవారంనాడు తన చేతుల మీదుగా ప్రధాని మంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించాల్సి ఉండగా ఆ కార్యక్రమం తాజాగా వాయిదా పడింది. పచ్‌పద్రలోని క్రూడ్ డిస్టిలేషన్ యూనిట్ వద్ద సోమవారంనాడు అగ్నిప్రమాదం జరిగింది.

అగ్నిప్రమాదం వేళ.. రాజస్థాన్ రిఫైనరీకి మోదీ ప్రారంభోత్సవం వాయిదా
Rajasthan Refinery

న్యూఢిల్లీ: రాజస్థాన్‌లోని బలోత్రా జిల్లా పచ్‌పద్రలోని ఆయిల్ రిఫైనరీని మంగళవారంనాడు తన చేతుల మీదుగా ప్రధాని మంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించాల్సి ఉండగా ఆ కార్యక్రమం తాజాగా వాయిదా పడింది. పచ్‌పద్రలోని క్రూడ్ డిస్టిలేషన్ యూనిట్ వద్ద సోమవారంనాడు అగ్నిప్రమాదం జరిగింది. మంటలను వెంటనే ఆర్పివేయడంతో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని, ప్రమాదంపై విచారణ జరుపుతున్నామని అధికారులు చెబుతున్నారు. ఈ ప్రమాదం కారణంగా ప్రధానమంత్రి ఆయిల్ రిఫైనరీ ప్రారంభోత్సవ కార్యక్రమం వాయిదా పడినట్టు పెట్రోలియం, నేచురల్ గ్యాస్ మంత్రిత్వ శాఖ సామాజిక మాధ్యమం 'ఎక్స్'లో తెలిపింది.


'హెచ్ఆర్ఆర్ఎల్ రిఫైనరీలోని క్రూడ్ డిస్టిలేషన్ యూనిట్ సమీపంలో ఈరోజు అగ్నిప్రమాదం జరిగింది. దీంతో షెడ్యూల్ ప్రకారం ప్రధానమంత్రి ఈనెల 21న తన చేతులమీదుగా ఈ రిఫైనరీని జాతికి అంకితం చేసే కార్యక్రమం వాయిదా పడింది. ప్రమాదంలో మంటలను అదుపుచేశారు. ఎలాంటి ప్రాణనష్టం జరిగినట్టు సమాచారం లేదు. ప్రమాదానికి కారణాలపై ప్రస్తుతం విచారణ జరుగుతోంది. రిఫైనరీని జాతికి అంకితం చేసే కార్యక్రమం మళ్లీ ఎప్పుడు ఉంటుందనేది మరోసారి తెలియజేస్తాం' అని పెట్రోలియం మంత్రిత్వ శాఖ తెలిపింది.


కాగా, పచ్‌పద్రలోని రిఫైనరీలో అగ్నిప్రమాదం జరగడంపై రాజస్థాన్ ముఖ్యమంత్రి భజన్‌లాల్ శర్మ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ రిఫైనరీ రాజస్థాన్‌కు గర్వకారణమని, షెడ్యూల్ ప్రకారం మంగళవారంనాడు ఈ రిఫైనరీకి ప్రారంభోత్సవం జరగాల్సి ఉందని చెప్పారు. ఇలాంటి సమయంలో ప్రమాదం జరగడం దురదృష్టరమని అన్నారు. కాంగ్రెస్ నేత సచిన్ పైలట్ కూడా రిఫైనరీలో అగ్నిప్రమాదం సంభవించడం బాధాకరమన్నారు. ఇది చిరకాలంగా కోరుకుంటున్న కీలకమైన ప్రాజెక్టు అన్నారు. ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణనష్టం జరగకుండా ఉండాలని కోరుకుంటున్నట్టు చెప్పారు.


ఇవి కూడా చదవండి..

రాజస్థాన్ రిఫైనరీలో భారీ అగ్నిప్రమాదం.. ప్రారంభానికి 24 గంటల ముందు..

పది రూపాయలతో మోదీ డ్రామా.. మమత విసుర్లు

Updated Date - Apr 20 , 2026 | 08:32 PM