Share News

బంగ్లాదేశ్ ఎన్నికల్లో బీఎన్‌పీ ఘన విజయం.. తారిఖ్ రెహ్మాన్‌కు మోదీ అభినందనలు

ABN , Publish Date - Feb 13 , 2026 | 10:12 AM

పార్లమెంటు ఎన్నికల్లో బీఎన్‌పీ ఘనవిజయం సాధించడంతో తారిఖ్ రెహ్మాన్‌కు భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అభినందనలు తెలిపారు. ఇది నిర్ణయాత్మకమైన గెలుపుగా అభివర్ణించారు.

బంగ్లాదేశ్ ఎన్నికల్లో బీఎన్‌పీ ఘన విజయం.. తారిఖ్ రెహ్మాన్‌కు మోదీ అభినందనలు
Modi with Tarique Rahman

న్యూఢిల్లీ: బంగ్లాదేశ్ పార్లమెంటు ఎన్నికల్లో బంగ్లాదేశ్ నేషనలిస్టు పార్టీ (BNP) మూడింట రెండు వంతుల సీట్లు గెలుచుకొని ఘన విజయం సాధించింది. 299 పార్లమెంటు స్థానాలకు జరిగిన పోలింగ్‌లో మిత్రపక్షాలతో కలిపి 212 స్థానాల్లో గెలుపు సాధించినట్టు బీఎన్‌పీ ప్రకటించింది. దీంతో బీఎన్‌పీ నేత తారిఖ్ రెహ్మాన్ (Tarique Rahman) నేతృత్వంలో కొత్త ప్రభుత్వం ఏర్పాటుకు సన్నాహాలు జరుగుతున్నాయి. కాగా, పార్లమెంటు ఎన్నికల్లో బీఎన్‌పీ ఘనవిజయం సాధించడంతో తారిఖ్ రెహ్మాన్‌కు భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (Narendra Modi) అభినందనలు తెలిపారు. ఇది నిర్ణయాత్మకమైన గెలుపుగా అభివర్ణించారు. రెహ్మాన్ నాయకత్వంపై ప్రజలు విశ్వాసం కనిపించారనడానికి బీఎన్‌పీ ఘన విజయం నిదర్శనమని, రెహ్మాన్‌తో కలిసి పనిచేయడానికి, ఉమ్మడి అభివృద్ధి లక్ష్యాల దిశగా రెండు దేశాల మధ్య సంబంధాలను పటిష్టం చేసేందుకు తాము ఎదురు చూస్తున్నామని సామాజిక మాధ్యమం 'ఎక్స్'లో మోదీ పేర్కొన్నారు.


tarique-rahman.jpg

బంగ్లా పార్లమెంటు ఎన్నికల్లో బీఎన్‌పీతో పాటు ఎన్నికల బరిలో పోటీపడిన జమాతే-ఇ-ఇస్లామి సారథ్యంలోని 11 పార్టీల కూటమి 70 సీట్లు గెలుచుకుని అధికారానికి దూరంగా ఉండిపోయింది. బీఎన్‌పీ‌ సారథ్యంలోని కూటమి ఘనవిజయంతో బంగ్లాదేశ్ తదుపరి ప్రధాని తారిఖ్ రెహ్మాన్ పగ్గాలు చేపట్టేందుకు మార్గం సుగమమైంది. 17 ఏళ్ల ప్రవాసం తరువాత గత డిసెంబర్‌లో స్వదేశానికి వచ్చిన రెహ్మాన్ గెలుపుదిశగా పార్టీని నడిపించారు. తాను పోటీ చేసిన ఢాకా-17, బోగ్రా-6 నియోజకవర్గాలు రెండిట్లోనూ భారీ మెజారిటీతో ఆయన విజయం సాధించారు. బీఎన్‌పీ కూటమి అధికారంలోకి వస్తే రెహ్మాన్ తదుపరి ప్రధానమంత్రి అవుతారని ఆ పార్టీ ఇప్పటికే ప్రకటించింది.


బీఎస్‌పీ ఘన విజయంతో 18 నెలలుగా బంగ్లాలో అధికారంలో ఉన్న మొహమ్మద్ యూనస్ నేతృత్వంలోని తాత్కాలిక ప్రభుత్వానికి తెరపడింది. బీఎన్‌పీ గెలుపుతో ఆ పార్టీ కార్యకర్తలు విజయ సంబరాలు జరుపుకొంటున్నారు. మసీదుల్లో ప్రత్యేక కృతజ్ఞతా ప్రార్థనలు జరుగుతున్నాయి.


ఇవి కూడా చదవండి..

అమెరికాకు భారత్‌ లొంగిపోయినట్టే కనిపిస్తోంది!

జనరల్‌ నరవణె పుస్తకాన్ని.. కావాలనే లీక్‌ చేశారు!

Updated Date - Feb 13 , 2026 | 10:35 AM