రాహుల్ సభ్యత్వం రద్దు చేయండి
ABN , Publish Date - Feb 13 , 2026 | 06:10 AM
దేశ రాజధానిలో గురువారం మూడు ఆసక్తికర రాజకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి. లోక్‌సభలో అనైతికంగా ప్రవర్తించిన కాంగ్రెస్ నాయకుడు, విపక్ష నేత రాహుల్ గాంధీ పార్లమెంట్ సభ్యత్వాన్ని రద్దు చేయాలని కోరుతూ....
దేశాన్ని అస్థిరపరిచే కుట్ర.. రహస్య విదేశీ పర్యటనలతో ముప్పు
రాజ్యాంగ వ్యవస్థలను దిగజార్చుతున్నారు
వ్యవహార శైలిపై దర్యాప్తు జరిపించండి
స్పీకర్‌కు బీజేపీ ఎంపీ నిశికాంత దుబే లేఖ
న్యూఢిల్లీ, ఫిబ్రవరి 12 (ఆంధ్రజ్యోతి): దేశ రాజధానిలో గురువారం మూడు ఆసక్తికర రాజకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి. లోక్‌సభలో అనైతికంగా ప్రవర్తించిన కాంగ్రెస్ నాయకుడు, విపక్ష నేత రాహుల్ గాంధీ పార్లమెంట్ సభ్యత్వాన్ని రద్దు చేయాలని కోరుతూ బీజీపీ ఎంపీ నిశికాంత దుబే లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాకు లేఖ రాయడం ప్రధానమైనది. ఆయన ప్రవర్తనపై దర్యాప్తునకు పార్లమెంటరీ కమిటీని నియమించాలని, దేశాన్ని అస్థిరపరిచేందుకు ఆయన నిరంతరం చేస్తున్న యత్నాలపై విచారణ జరిపించాలని అందులో కోరారు. మరోవైపు రాహుల్‌పై సభా హక్కుల ఉల్లంఘన తీర్మానం ప్రవేశపెట్టాలని తొలుత భావించినప్పటికీ అలాంటి అవకాశం లేదని బీజేపీ వర్గాలు తెలిపాయి. ఇంకోవైపు లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాపై ప్రతిపక్షాలు ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానంపై చర్చ జరపాలా, వద్దా అనే విషయాన్ని మార్చి 9న నిర్ణయిస్తారని అధికారికంగా వెల్లడయింది. రాహుల్ గాంధీపై నిశికాంత దూబె తీవ్ర ఆరోపణలు చేశారు. భారత దేశాన్ని అస్థిరపరిచే దోపిడీ ముఠాతో చేతులు కలిపారని, దేశ సమైక్యత, సమగ్రత, సార్వభౌమ అధికారానికి నష్టం వాటిల్లజేసే చర్యలకు పాల్పడ్డారని తన లేఖలో పేర్కొన్నారు. సైనిక దళాల ప్రతిష్ఠను, ప్రధాని, ఎన్నికల కమిషన్, సుప్రీంకోర్టుల గౌరవాన్ని దిగజార్చారని తెలిపారు. మాజీ సైనిక చీఫ్ నరవణే అప్రచురిత పుస్తకంలోని వాక్యాలను ఉటంకించి ఆయనను కూడా వివాదంలోకి లాగారని ఆరోపించారు. ప్రపంచవ్యాప్తంగా ప్రభుత్వాలను కుప్పకూల్చే సోరోస్ ఫౌండేషన్, ఫోర్డ్ ఫౌండేషన్‌లతో ఆయన చేతులు కలిపారని విమర్శించారు. బ్యాంకింగ్ వ్యవస్థ కుప్పకూలిందనే దుష్ప్రచారం చేశారని తెలిపారు. రాహుల్ వివిధ దేశాల్లో తరుచూ రహస్య పర్యటనలు చేస్తున్నారని విమర్శించారు. కాగా, రాహుల్ గాంధీ అబద్ధాలకోరు (ఝూటా), రౌడీ (లుచ్ఛా) అని కేంద్ర మంత్రి గిరిరాజ్ సింగ్ ఆరోపించారు. అధికారంలోకి రాలేకపోవడంతో దేశంలో అంతర్యుద్ధాన్ని రెచ్చగొడుతున్నారని విమర్శించారు.
లోక్‌సభలో ఎంపీల నిరసన
భారత- అమెరికా ఒప్పందంలో ఉన్న ప్రజా వ్యతిరేక నిబంధనలకు నిరసనగా గురువారం కూడా ప్రతిపక్ష ఎంపీలు లోక్‌సభలో నినాదాలు చేయడంతో పాటు ప్లకార్డు లను ప్రదర్శించారు. పార్లమెంట్ మకర ద్వారం ఎదుట నిరసన ప్రదర్శనలు నిర్వహించారు. రాహుల్ గాంధీని దేశ వ్యతిరేక శక్తిగా దూషిస్తూ నిశికాంత దుబే లోక్‌సభలో చేసిన ఆరోపణలపై ప్రతిపక్షాలు తీవ్ర నిరసన వ్యక్తం చేయడంతో సభ శుక్రవారానికి వాయిదా పడింది.
రెండో విడతలో అవిశ్వాసంపై నిర్ణయం
శుక్రవారంతో పార్లమెంట్ తొలి విడత బడ్టెట్ సమావేశాలు ముగియనున్నాయి. రెండో విడత సమావేశాలు మార్చి 9న ప్రారంభం కానుండగా తొలిరోజునే స్పీకర్‌పై ఇచ్చిన అవిశ్వాస తీర్మానం నోటీసు విషయమై నిర్ణయం తీసుకుంటారు. 50 మంది సభ్యులు లేచి నిలబడి ఈ తీర్మానానికి మద్దతు తెలిపితే దానిపై చర్చ జరిపేందుకు తేదీని నిర్ణయిస్తారని లోక్‌సభ స్పీకర్ కార్యాలయ వర్గాలు తెలిపాయి.

మీరు బీజేపీ ఉద్యోగులు కారు: జర్నలిస్టులపై రాహుల్ చిరాకు
పార్లమెంటు ప్రాంగణంలో జర్నలిస్టులపై రాహుల్ గాంధీ చిరాకు పడ్డారు. ఆయన కారు ఎక్కుతున్న సమయంలో విలేకరులు అక్కడికి వచ్చి బీజేపీ ప్రవేశపెట్టనున్న సభా హక్కుల ఉల్లంఘన (ప్రివిలేజ్) తీర్మానంపై ప్రశ్నించారు. చిరాకుపడ్డ రాహుల్ ‘‘ఈ రోజు ‘ప్రివిలేజ్’ అన్న పదాన్ని పట్టుకోవాలని మీకు సూచనలు వచ్చాయన్న మాట. నిన్న అథంటికేషన్ (ప్రామాణీకరణ) అన్న మాటను పట్టుకున్నారు. మీరేమీ బీజేపీ ఉద్యోగులు కారు. సిగ్గు చేటు. మీరు బాధ్యతాయుతమైన వ్యక్తులు. నిష్పక్షపాతంగా ఉండాల్సిన బాధ్యత మీపై ఉంది. ఇలాంటి చర్యలతో దేశానికి నష్టం కలిగిస్తున్నారు. మీరు దాన్ని గుర్తిస్తున్నారా?’’ అని అన్నారు.

రిజిజువి అన్నీ అబద్ధాలు: ప్రియాంక
స్పీకర్ చాంబర్ వద్ద తాను ఎంపీలను రెచ్చగొట్టానంటూ కేంద్ర మంత్రి రిజిజు చెప్పిన మాటలు పూర్తిగా అబద్ధమని కాంగ్రెస్ ఎంపీ ప్రియాంక గాంధీ వాద్రా అన్నారు. తాము ఎవరినీ దూషించలేదని, ఒకరిద్దరు ఎంపీలు కొంచం గట్టిగా మాట్లాడారని చెప్పారు. తాను ఎవరినీ రెచ్చగొట్టలేదన్నారు. చివరకు స్పీకర్‌కు చెప్పాల్సిన విషయాలను చాలా ప్రశాంతంగా వివరించానని పేర్కొన్నారు.