Share News

స్పీకర్ ఓం బిర్లాపై అవిశ్వాస తీర్మానానికి విపక్షాలు సన్నద్ధం

ABN , Publish Date - Feb 09 , 2026 | 03:14 PM

స్పీకర్ ఓం బిర్లాపై విపక్షాలు అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టే యోచనలో ఉన్నాయని విశ్వసనీయ వర్గాల సమాచారం. ఇప్పటికే నోటీసులు కూడా ఇచ్చినట్టు తెలుస్తోంది.

స్పీకర్ ఓం బిర్లాపై అవిశ్వాస తీర్మానానికి విపక్షాలు సన్నద్ధం
Om Birla

న్యూఢిల్లీ: పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు సజావుగా సాగకపోవడంతో ఇటు అధికార పక్ష సభ్యులు, అటు విపక్ష సభ్యులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. గందరగోళ పరిస్థితుల మధ్య ఉభయసభల కార్యకలాపాలకు తరచు అంతరాయం కలుగుతోంది. సభలో తమను మాట్లాడేందుకు అనుమతించడం లేదంటూ విపక్షాలు ఆరోపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో స్పీకర్ ఓం బిర్లా (Om Birla)పై అవిశ్వాస తీర్మానం (No confidence Motion) ప్రవేశపెట్టే యోచనలో విపక్షాలు ఉన్నట్టు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. ఇప్పటికే నోటీసులు కూడా ఇచ్చినట్టు చెబుతున్నారు.


అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టాలంటే 14 రోజుల ముందుగా నోటీసులు ఇవ్వాలి. ఆప్రకారం బడ్జెట్ రెండో విడత సమావేశాల్లో అవిశ్వాస తీర్మనం సభలో చర్చకు వచ్చే అవకాశం ఉంటుంది. బడ్జెట్ తొలి విడత సమావేశాలు జనవరి 8న ప్రారంభమై ఫిబ్రవరి 13తో ముగియనున్నాయి. రెండో విడత సమావేశాలు మార్చి 9న తిరిగి ప్రారంభమై ఏప్రిల్ 2 వరకూ జరుగుతాయి.


కాగా, కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే కార్యాలయంలో సోమవారం ఉదయం జరిగిన సమావేశంలో అవిశ్వాస తీర్మానంపై నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. టీఎంసీ, డీఎంకే, వామపక్షాలు, సమాజ్‌వాదీ పార్టీ, శివసేన (యూబీటీ), ఎన్‌సీపీ (ఎస్పీ) తదితరల పార్టీల ఎంపీలు ఈ సమావేశంలో పాల్గొన్నట్టు సమాచారం.


ఓం బిర్లాకు కాంగ్రెస్ మహిళా ఎంపీలు లేఖ

మరోవైపు, ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై దాడికి సిద్ధమయ్యామంటూ తమపై అసత్య ఆరోపణలు చేయడాన్ని కాంగ్రెస్ మహిళా ఎంపీలు ఖండించారు. ఈ మేరకు లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాకు లేఖ రాశారు. ప్రజాస్వామ్య పద్ధతిలో శాంతియుతంగా తాము నిరసన తెలిపామని, హింసకు దిగాలని తాము అనుకోలేదని, విపక్షాలను ఎదుర్కొనే ధైర్యం ప్రధానికి లేకపోవడం వల్లే భయపడి సభకు రాలేదని మహిళా ఎంపీలు ఆ లేఖలో పేర్కొన్నారు. లోక్‌సభ స్పీకర్ నిష్పక్షపాతంగా ఉండాలన్నారు. ఎంపిక చేసి మరీ 8 మంది విపక్ష ఎంపీలపై సస్పెన్షన్ వేటు వేశారని, మాజీ ప్రధానులపై బీజేపీ ఎంపీ అనుచిత వ్యాఖ్యలు చేస్తే పట్టించుకోలేదని అన్నారు. కాంగ్రెస్ ఎంపీ జోతిమణి, పలువురు మహిళా ఎంపీలు ఈ లేఖపై సంతకాలు చేశారు.


ఇవి కూడా చదవండి..

లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాకు కాంగ్రెస్ మహిళా ఎంపీల లేఖ

45 లక్షల కోట్ల దిగుమతులు..పెద్ద విషయమేం కాదు!

Updated Date - Feb 09 , 2026 | 07:25 PM