Share News

రష్యా చమురుపై సందిగ్ధం

ABN , Publish Date - Feb 09 , 2026 | 01:46 AM

అమెరికాతో వాణిజ్య ఒప్పందంలో గందరగోళం, రష్యా చమురు కొనుగోళ్ల నిలిపివేతపై అయోమయం కనిపిస్తున్నాయి. రష్యా చమురు కొనుగోళ్ల నిలిపివేతపై కేంద్ర వాణిజ్య, విదేశాంగ శాఖ మంత్రులు ఇద్దరూ సమాధానం దాటవేయడం చర్చనీయాంశంగా మారింది.

రష్యా చమురుపై సందిగ్ధం

  • కొనుగోలు ఉంటుందా అడిగితే జవాబు దాటవేత

  • అది వాణిజ్య మంత్రికే తెలుసన్న విదేశాంగ మంత్రి

  • జైశంకర్‌కే తెలుసన్న పీయూష్‌ గోయల్‌

  • రష్యా నుంచి చమురు కొనుగోలు నిలిపేస్తామంటే తగ్గించాం.. కొంటే మళ్లీ సుంకాలు: అమెరికా

  • దీనిపై కేంద్రం నుంచి వెలువడని అధికారిక ప్రకటన

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 8: అమెరికాతో వాణిజ్య ఒప్పందంలో గందరగోళం, రష్యా చమురు కొనుగోళ్ల నిలిపివేతపై అయోమయం కనిపిస్తున్నాయి. రష్యా చమురు కొనుగోళ్ల నిలిపివేతపై కేంద్ర వాణిజ్య, విదేశాంగ శాఖ మంత్రులు ఇద్దరూ సమాధానం దాటవేయడం చర్చనీయాంశంగా మారింది. శుక్రవారం అమెరికాలో ఆ దేశ విదేశాంగ మంత్రి మార్కో రూబియోతో సమావేశమైన అనంతరం మన విదేశాంగ మంత్రి జైశంకర్‌ వాణిజ్య ఒప్పందంపై మాట్లాడారు. రష్యా చమురు కొనుగోళ్లను భారత్‌ నిలిపివేస్తుందా? అని మీడియా ప్రశ్నిస్తే.. దాని గురించి తనకు తెలియదని, వాణిజ్య మంత్రి పీయూష్‌ గోయల్‌ను అడగడం మంచిదని సమాధానమిచ్చారు. ఇదే అంశంపై శనివారం పీయూష్‌ గోయల్‌ను అడిగితే.. ‘రష్యా చమురు కొనుగోళ్ల నిలిపివేతపై విదేశాంగ శాఖనే సమాచారం ఇస్తుంది’ అంటూ దాటవేశారు. ఈ అంశానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. పీయూష్‌ గోయల్‌ కూడా అంతర్జాతీయ పరిణామాలకు అనుగుణంగా వివిధ మార్గాల్లో చమురు కొనుగోలు కోసం చర్యలు చేపడుతున్నామని మాత్రమే చెప్పారు. రష్యా నుంచి చమురు కొనుగోలు ఆపేస్తామన్న భారత హామీ మేరకు 25శాతం అదనపు సుంకాలు తొలగిస్తున్నామంటూ అమెరికా అధ్యక్షుడు శనివారం ఉత్తర్వులు జారీచేశారు. భారత్‌ ప్రత్యక్షంగాగానీ, పరోక్షంగా గానీ రష్య చమురును కొనుగోలు చేస్తే.. మళ్లీ 25శాతం సుంకాలు వసూలు చేస్తామని హెచ్చరించారు. మరోవైపు చమురు కొనుగోళ్లు నిలిపేస్తామని భారత్‌ నుంచి తమకు అధికారిక సమాచారమేదీ రాలేదని రష్యా ప్రకటించింది. తనకు వీలైన చోట చమురు కొనుగోలు చేసే హక్కు భారత్‌కు ఉందనీ పేర్కొంది.


వాణిజ్య ఒప్పందం పరిస్థితి ఏంటి?

అమెరికా-భారత్‌ వాణిజ్య ఒప్పందంపై ట్రంప్‌ తొలుత ప్రకటన చేశారు. ఒప్పందం కుదిరిందని, సుంకాలను 18శాతానికి తగ్గిస్తున్నామని.. ఇది వెంటనే అమల్లోకి వస్తుందని గత సోమవారం ప్రకటించారు. ట్రంప్‌ చెప్పినట్టుగా ఒప్పందం వెంటనే అమల్లోకి రాలేదు. ఒప్పందం తుది దశలో ఉందని, నాలుగైదు రోజుల్లో సంయుక్త ప్రకటన చేస్తామని.. ఆ వెంటనే అమెరికా సుంకాల తగ్గింపు అమల్లోకి వస్తుందని మంగళవారం పీయూష్‌ గోయల్‌ ప్రకటించారు. శనివారం విడుదల చేసిన అమెరికా-భారత్‌ సంయుక్త ప్రకటనలో మధ్యంతర ఒప్పందం ఫ్రేమ్‌వర్క్‌ మాత్రమే ఖరారైందని పేర్కొన్నారు. 18శాతానికి సుంకాల తగ్గింపు అమల్లోకి రాలేదు. ఇక ఆదివారం పీయూష్‌ గోయల్‌ పీటీఐ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. సంయుక్త ప్రకటనలో విడుదల చేసింది రెండు పేజీల ఫ్రేమ్‌వర్క్‌ మాత్రమేనని, చేర్చాల్సిన అంశాలు ఇంకా చాలా ఉన్నాయని పేర్కొన్నారు. పలు రకాల అమెరికా ఉత్పత్తులు వచ్చిపడకుండా భారత్‌ రక్షణలు కోరినట్టుగానే.. అమెరికా కూడా పలు అంశాల్లో రక్షణలు కోరుతోందని వెల్లడించారు. ఈ ప్రక్రియ కొనసాగుతోందని, ఇంకా చాలా అంశాల్లో స్పష్టత రావాల్సి ఉందని చెప్పారు. దీనితో వాణిజ్య ఒప్పందం పరిస్థితి ఏమిటి? ఏ స్థాయిలో ఉన్నట్టు? సంయుక్త ప్రకటనలో ఇచ్చిన రక్షణలు ఉంటాయా, మారుతాయా? అమెరికా రక్షణలు కోరితే.. మన ఎగుమతుల పరిస్థితి ఏమిటి? సుంకాల తగ్గింపు ఎప్పటి నుంచి అమల్లోకి వస్తుందనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.

Updated Date - Feb 09 , 2026 | 07:30 AM