Share News

45 లక్షల కోట్ల దిగుమతులు..పెద్ద విషయమేం కాదు!

ABN , Publish Date - Feb 09 , 2026 | 01:50 AM

అమెరికా నుంచి ఐదేళ్లలో రూ.45 లక్షలకోట్ల దిగుమతులు పెద్ద విషయమేమీ కాదని కేంద్ర వాణిజ్య మంత్రి పీయూష్‌ గోయల్‌ చెప్పారు.

45 లక్షల కోట్ల దిగుమతులు..పెద్ద విషయమేం కాదు!

  • ఐదేళ్లలో కేవలం వైమానిక రంగం కోసమే రూ.9 లక్షల కోట్లు అవసరం

  • ఐదేళ్లలో భారత మొత్తం దిగుమతులు రూ. 181 లక్షల కోట్లకు చేరుతాయి

  • ప్రస్తుతం విడుదల చేసినది రెండు పేజీల ఫ్రేమ్‌వర్క్‌ మాత్రమే

  • చేర్చాల్సినవి చాలా ఉన్నాయి: గోయల్‌

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 8: అమెరికా నుంచి ఐదేళ్లలో రూ.45 లక్షలకోట్ల దిగుమతులు పెద్ద విషయమేమీ కాదని కేంద్ర వాణిజ్య మంత్రి పీయూష్‌ గోయల్‌ చెప్పారు. 2,717 లక్షల కోట్ల (30 ట్రిలియన్‌ డాలర్ల) ఆర్థిక వ్యవస్థగా ఎదిగే లక్ష్యంతో ముందుకెళ్తున్న మన దేశానికి ఆ స్థాయి దిగుమతులు సాధారణమేనని పేర్కొన్నారు. వాణిజ్య ఒప్పందంలో భాగంగా అమెరికా నుంచి అత్యంత భారీగా దిగుమతులు చేసుకునేందుకు భారత్‌ అంగీకరించడంపై ఆయన పీటీఐ ఇంటర్వ్యూలో మాట్లాడారు. ‘‘వచ్చే ఐదేళ్లలో కేవలం వైమానిక రంగం కోసమే రూ.9 లక్షల కోట్లు (100 బిలియన్‌ డాలర్లు) అవసరం. ఇక చమురు, సహజవాయువు, ఎల్పీజీ ఉత్పత్తుల దిగుమతులు అంతకన్నా చాలా ఎక్కువగా ఉంటాయి. ప్రస్తుతం భారత్‌ వివిధ దేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్న రూ.27 లక్షల కోట్ల (300 బిలియన్‌ డాలర్ల) ఉత్పత్తులను అమెరికా నుంచే దిగుమతి చేసుకోవచ్చు. ప్రపంచంలోని అన్ని ప్రాంతాల నుంచి మనం దిగుమతులు చేసుకుంటున్నాం. వచ్చే ఐదేళ్లలో మన దిగుమతులు రూ. 181 లక్షల కోట్ల (2 ట్రిలియన్‌ డాలర్ల)కు పెరుగుతాయి. భారత్‌లో భారీగా డిమాండ్‌ ఉండటం ఖాయమని, అందుకు తగినట్టుగా మీరు ఉండాలని అమెరికా వాణిజ్య అధికారులకు నేను స్పష్టంగా చెప్పాను కూడా. ఇప్పటికే అమెరికా నుంచి భారత్‌కు రూ.4.5 లక్షల కోట్ల (50 బిలియన్ల) మేర దిగుమతులు జరుగుతున్నాయి. ప్రస్తుతం భారత ఆర్థిక వ్యవస్థ వేగంగా వృద్ధి చెందుతోంది. అందుకు అనుగుణంగా పరిశ్రమలకు అవసరమైన అత్యాధునిక యంత్రాల నుంచి డేటా సెంటర్లు, వైమానిక రంగ అవసరాల దాకా భారీ స్థాయిలో అవసరం. ఉక్కు పరిశ్రమలకు కోకింగ్‌ కోల్‌ (అత్యధిక నాణ్యత ఉన్న రాతిబొగ్గు) కావాలి. పెరుగుతున్న దేశీయ వినియోగానికి తగినట్టుగా చమురు ఉత్పత్తులు అవసరం. వాటన్నింటికీ అమెరికా సరఫరా చేయగలదు’’ అని గోయల్‌ పేర్కొన్నారు. నిజానికి ఇవన్నీ యూపీఏ అధికారంలో ఉన్నప్పటి నుంచీ దిగుమతి అవుతున్నవేనని, ఇప్పుడు కొత్తగా ఏమీ లేదని తెలిపారు. ఇక అమెరికా సుంకాలు 18శాతానికి తగ్గడం మంచి పరిణామమని అభివర్ణించారు. అమెరికాలో మన సరుకులకు పోటీ ఇచ్చే చైనాపై 35శాతం, ఇతర దేశాలపై 19ు, ఆపైన సుంకాలు ఉన్నాయని.. అంటే మన ఉత్పత్తులు తక్కువ ధరకే అందుబాటులో ఉండి డిమాండ్‌ పెరుగుతుందని, మన ఎగుమతులు పెరుగుతాయని చెప్పారు.


ఒప్పందంలో చేర్చాల్సినవి చాలా ఉన్నాయి

ప్రస్తుత అమెరికా-భారత్‌ వాణిజ్య ఒప్పందం సంయుక్త ప్రకటన కేవలం రెండు పేజీల ఫ్రేమ్‌వర్క్‌ మాత్రమేనని.. ఇందులో చేర్చాల్సినవి ఇంకా చాలా ఉంటాయని పీయూష్‌ గోయల్‌ చెప్పారు. భారత్‌లో వ్యవసాయ, పాడి రంగాల ప్రయోజనాలు దెబ్బతినకుండా వాణిజ్య ఒప్పందంలో రక్షణలు కోరినట్టే.. అమెరికా కూడా మన ఉత్పత్తులు వెల్లువలా వచ్చిపడకుండా రక్షణలు కోరుతుందని తెలిపారు. చర్చల్లో ఇది సాధారణమేనని, ప్రక్రియ ఇంకా కొనసాగుతోందని చెప్పారు. అంతేతప్ప ఈ సంయుక్త ప్రకటనలో ఫలానా అంశాలపై రక్షణలు లేవంటూ ప్రజలను తప్పుదారి పట్టించేందుకు ప్రతిపక్షాలు ప్రయత్నిస్తున్నాయని విమర్శించారు.

అమెరికాతో వాణిజ్య ఒప్పందం ‘సంపూర్ణ లొంగుబాటు’

  • 12న నిరసనలకు రైతుసంఘాల పిలుపు

అమెరికాతో భారత్‌ కుదుర్చుకున్న వాణిజ్య ఒప్పందాన్ని ‘సంపూర్ణ లొంగుబాటు’గా రైతు సంఘాలు అభివర్ణించాయి. ఇది కునారిల్లుతున్న అమెరికా ఆర్థిక వ్యవస్థకు మేలు కలిగిస్తుందే తప్ప భారత్‌కు కాదని అభిప్రాయపడ్డాయి. ఇందుకు నిరసనగా ఈ నెల 12న ఆందోళన చేయనున్నట్టు తెలిపాయి. ఈ విషయాన్ని సంయుక్త కిసాన్‌ మోర్చా(ఎ్‌సకేఎం) సహా పలు రైతు సంఘాల నాయకులు శనివారం ప్రకటించారు. ఈ ఒప్పందం కారణంగా భారత వ్యవసాయ రంగాన్ని అమెరికా బహుళజాతి సంస్థల చేతుల్లో పెట్టినట్టయిందని విమర్శించారు. ఇందుకు బాధ్యత వహిస్తూ కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి గోయల్‌ రాజీనామా చేయాలని డిమాండు చేశారు. ఆల్‌ ఇండియా కిసాన్‌ సభ నాయకుడు కృష్ణ ప్రసాద్‌ మాట్లాడుతూ ఈ ఒప్పందం ప్రభావం వ్యవసాయం, పాడి రంగాలపై అధికంగా ఉంటుందని చెప్పారు. ఎర్ర జొన్నలు, సోయా చెక్క, సోయా నూనెలపై దిగుమతి సుంకాలను తగ్గించడాన్ని తప్పుపట్టారు.

Updated Date - Feb 09 , 2026 | 01:50 AM