'ప్రధాన్‌ను తొలగించండి'.. నీట్ పేపర్ లీక్‌పై పార్లమెంట్‌లో ప్రతిపక్ష ఎంపీల నిరసన
ABN , Publish Date - Jul 24 , 2026 | 11:08 AM
'నీట్' వ్యవహారంపై నేటికి వరుసగా ఐదో రోజు పార్లమెంట్‌లోని 'మకర్ ద్వార్' వద్ద ఇండియా కూటమి ఎంపీలు నిరసన ప్రదర్శన చేశారు. కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలని, లేదా ఆయనను బర్తరఫ్ చేయాలని విపక్ష ఎంపీలు ఫ్లకార్డులు ప్రదర్శించారు.
ఢిల్లీ, జులై 24: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన NEET-UG ప్రశ్నపత్రాల లీకేజీ వ్యవహారం పార్లమెంట్‌ను కుదిపేస్తోంది. వరుసగా నేటికి ఐదో రోజు పార్లమెంట్‌లోని 'మకర్ ద్వార్' వద్ద ఇండియా (INDIA) కూటమి ఎంపీలు నిరసన ప్రదర్శన కొనసాగించారు. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తక్షణమే రాజీనామా చేయాలని, లేదా ఆయనను పదవి నుంచి బర్తరఫ్ చేయాలని విపక్ష ఎంపీలు ఫ్లకార్డులు చేతబూని నినాదాలతో హోరెత్తించారు.
నిన్న (గురువారం) మకర్ ద్వార్ వద్ద అధికార ఎన్డీఏ (NDA), ప్రతిపక్ష ఇండియా కూటమి ఎంపీలు పరస్పర నిరసనలతో ఎదురెదురుగా నిలబడి ఆందోళన చేపట్టడం ఉద్రిక్తతకు దారితీసింది. చర్చను ప్రతిపక్షాలే అడ్డుకుంటున్నాయని ఎన్డీఏ ఆరోపిస్తుండగా, విద్యాశాఖ మంత్రి రాజీనామాకే విపక్షాలు పట్టుబడుతున్నాయి.
ప్రధాని మోదీపై మల్లికార్జున ఖర్గే ధ్వజం
నీట్ వ్యవహారంపై ప్రధాని నరేంద్ర మోదీ అర్థరాత్రి వీడియో సందేశం విడుదల చేయడాన్ని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే తీవ్రంగా తప్పుపట్టారు. 'పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్నప్పుడు ప్రధాని తన వ్యాఖ్యలను సభలోనే వినిపించాలి తప్ప, బయట రాత్రివేళల్లో రికార్డ్ చేసిన వీడియోలతో ఒంటెద్దు పోకడ 'మన్ కీ బాత్' చెప్పడం సరికాదు. ప్రధాని మోదీ.. ఈరోజు పార్లమెంట్‌కు వచ్చేముందు ధర్మేంద్ర ప్రధాన్‌ను పదవి నుంచి తొలగించి రండి. ఆందోళనకారులపై లాఠీఛార్జ్, పల్లెట్ గన్ల ప్రయోగానికి ఆదేశించిన వారిపై చర్యలు తీసుకోండి. ఆ తర్వాతే విద్యావ్యవస్థపై సమగ్ర చర్చకు మేం సిద్ధం' అని ఖర్గే అన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి:
క్వాంటం వ్యాలీలో మరో కీలక ప్రాజెక్టు