Share News

సీజేపీ నిర‌స‌న పిలుపుతో నాకు సంబంధం లేదు: నేహా బోరా

ABN , Publish Date - Oct 22 , 2026 | 06:40 PM

కాక్రోచ్ జ‌న‌తా పార్టీ(సీజేపీ) నిర‌స‌న‌ల పిలుపుతో త‌న‌కు ఎలాంటి సంబంధం లేద‌ని ఆలిండియా స్టూడెంట్స్ అసోసియేష‌న్(ఏఐఎస్ఏ) ప్రెసిడెంట్ నేహా బోరా గురువారం ఢిల్లీ హైకోర్టుకు చెప్పారు. ఈనెల 16న మండి హౌస్​కు ప్ర‌ద‌ర్శ‌న‌గా వెళ్తుండ‌గా నేహాను పోలీసులు నిర్బంధంలోకి తీసుకున్న విష‌యం తెలిసిందే.

సీజేపీ నిర‌స‌న పిలుపుతో నాకు సంబంధం లేదు: నేహా బోరా

ఇంట‌ర్నెట్ డెస్క్: కాక్రోచ్ జ‌న‌తా పార్టీ(సీజేపీ) నిర‌స‌న‌ల పిలుపుతో త‌న‌కు ఎలాంటి సంబంధం లేద‌ని ఆల్ఇండియా స్టూడెంట్స్ అసోసియేష‌న్(ఏఐఎస్ఏ) ప్రెసిడెంట్ నేహా బోరా గురువారం ఢిల్లీ హైకోర్టుకు చెప్పారు. ఈనెల 16న మండి హౌస్​కు ప్ర‌ద‌ర్శ‌న‌గా వెళ్తుండ‌గా నేహాను పోలీసులు నిర్బంధంలోకి తీసుకున్న విష‌యం తెలిసిందే. త‌ర్వాతి రోజు ఆమెను విడుద‌ల చేశారు. అయితే ఈ నెల 18న స్పెష‌ల్ ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్(ఎస్ఈఎం) ఆమెకు నోటీసు జారీ చేశారు. నిషేధం ఉన్న‌ప్ప‌టికీ జంత‌ర్ మంత‌ర్ వైపు వెళ్లేందుకు నేహా ప్ర‌య‌త్నించి శాంతిభ‌ద్ర‌త‌ల‌కు విఘాతం క‌లిగించార‌ని ఆ నోటీసులో పేర్కొన్నారు. ఆ నోటీసుపై హైకోర్టులో నేహా స‌వాలు చేశారు. ఆమె పిటిష‌న్​ను హైకోర్టు గురువారం విచారించింది.


నేహా త‌ర‌ఫున ఆమె అడ్వకేట్ గోపాల్ శంక‌ర‌ నారాయ‌ణ‌న్ వాద‌న‌లు వినిపించారు. నేహా ఏ నేర‌మూ చేయ‌లేద‌ని, శాంతిభ‌ద్ర‌త‌ల‌కు విఘాతం క‌లిగించే ఎలాంటి కార్య‌క‌లాపాలకూ పాల్ప‌డ‌లేద‌ని చెప్పారు. మండి హౌస్​కు చేరుకున్న త‌ర్వాత నేహాను పోలీసులు 10 నుంచి 15 నిమిషాల పాటు నిర్బంధించార‌ని తెలిపారు. ఈ నెల 15న సాయంత్రం 5:00 గంట‌ల‌కు క‌లుస్తాన‌ని నేహా ఇచ్చిన పిలుపులో హింస‌కు పాల్ప‌డాల‌న్న ఎలాంటి ఉద్దేశంలేద‌ని పేర్కొన్నారు. శాంతికి విఘాతం క‌లిగించాల‌న్న ఉద్దేశం కూడా ఆమెకు లేద‌న్నారు.


పాల‌న మార్పుపై వాదోప‌వాదాలు..

ఢిల్లీ పోలీసులు, కేంద్రం త‌ర‌ఫున అద‌న‌పు సొలిసిట‌ర్ జ‌న‌ర‌ల్(ఏఎస్​జీ) చేత‌న్ శ‌ర్మ వాదిస్తూ.. హింసాత్మ‌క ఘ‌ట‌న‌లో నేహా హ‌స్తం ఉంద‌న్నారు. పోలీసుల ఆదేశాల‌ను ఆమె ఉల్లంఘించింద‌న్నారు. అలాగే బంగ్లాదేశ్, నేపాల్​లో జ‌రిగిన‌ట్లు భార‌త్​లోనూ పాల‌న మార్పు జ‌ర‌గాల‌ని నేహా పిలుపునిచ్చార‌ని పేర్కొన్నారు. ఆందోళ‌న‌లు, హింస ద్వారా పాల‌న మార్పు జ‌ర‌గ‌ద‌ని, అది కేవ‌లం ఓట్ల‌తోనే జ‌రిగే ప్ర‌క్రియ అన్నారు. కాగా.. ఇరుప‌క్షాల వాద‌న‌లు విన్న హైకోర్టు.. ఈ నెల 23కు తీర్పును రిజ‌ర్వ్ చేసింది. అలాగే రూ.10 వేల ప‌ర్స‌న‌ల్ బాండ్ ఇవ్వాల‌ని, శాంతిభ‌ద్ర‌త‌ల‌కు విఘాతం క‌లిగించ‌బోన‌ని హామీ ఇవ్వాలని నేహాను హైకోర్టు ఆదేశించింది.


ఈ వార్తలు కూడా చదవండి

నేను ట్రావెల్ ఏజెంట్‌ కాదు.. రాహుల్ వియత్నాం పర్యటనపై శశి థరూర్ ఆసక్తికర వ్యాఖ్యలు..

దారుణ ఘటన.. సవతి తల్లిపై డీజిల్ పోసి నిప్పంటించిన కొడుకు

Updated Date - Oct 22 , 2026 | 06:47 PM