Share News

ప్రధాని మోదీ హయాంలో వీళ్ల ఆటలు సాగవు: నితిన్‌ నబీన్‌

ABN , Publish Date - Oct 10 , 2026 | 12:44 PM

దేశాన్ని అస్థిరపరిచే కుట్ర జరుగుతోందని బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ ఆందోళన వ్యక్తం చేశారు. రాహుల్ గాంధీ సారథ్యంలోని ఇండియా కూటమి, కాక్రోచ్ జనతా పార్టీతోపాటు ఆమ్ ఆద్మీ పార్టీ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్‌ అనుచరులు కలిసి ఈ కుట్ర చేస్తున్నారని ఆరోపించారు.

ప్రధాని మోదీ హయాంలో వీళ్ల ఆటలు సాగవు: నితిన్‌ నబీన్‌
BJP National Chief Nitin Nabin

న్యూఢిల్లీ, అక్టోబర్10: దేశాన్ని అస్థిరపరిచే కుట్ర జరుగుతోందని బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ ఆందోళన వ్యక్తం చేశారు. రాహుల్ గాంధీ సారథ్యంలోని ఇండియా కూటమి, కాక్రోచ్ జనతా పార్టీతోపాటు ఆమ్ ఆద్మీ పార్టీ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్‌ అనుచరులు కలిసి ఈ కుట్ర చేస్తున్నారని ఆరోపించారు. శాంతి సామరస్యాలతో జీవిస్తున్న 140 కోట్ల ప్రజలున్న దేశాన్ని అస్థిర పరిచేందుకు వీరంతా కుట్ర చేస్తున్నారని మండిపడ్డారు. శనివారం న్యూఢిల్లీలో ఆయన మాట్లాడుతూ.. ఈ రోజు దేశంలో అత్యంత ప్రమాదకరమైన పరిస్థితులను సృష్టించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని పేర్కొన్నారు.


వీటి వెనుక రెండు గ్రూపులు ఉన్నాయని బీజేపీ జాతీయ అధ్యక్షుడు వివరించారు. వాటిలో ఒకటి రాహుల్ గాంధీ నేతృత్వంలోని ఇండియా కూటమి అయితే మరొకటి సీజేపీలోని అరవింద్ కేజీవ్రాల్ అనుచరులు అని సోదాహరణంగా వివరించారు. అయితే వీరి ప్రయత్నాలు సఫలం కావని స్పష్టం చేశారు. మిమ్మల్ని ప్రజలు తిరస్కరించారని తెలిపారు. దీని నుంచి మీరు పాఠాలు నేర్చుకోకుండా.. దేశాన్ని అస్థిర పరిచేందుకు కుట్రలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజకీయ అజెండాతో ప్రేరేపించబడి విదేశీ శక్తుల ఆదేశాలతో వీరంతా ఈ ఆందోళనలు చేస్తున్నారని చెప్పారు.


దేశంలో శాంతి నెలకొల్పేందుకు.. ఉగ్రవాదంపై ఉక్కుపాదం మోపుతున్నామని నితిన్ నబీన్ వివరించారు. ఇప్పటికే దేశంలో నక్సలిజాన్ని రూపుమాపామని గుర్తు చేశారు. అర్బన్‌ నక్సల్స్‌ దేశాన్ని నాశనం చేయాలని కుట్ర పన్నుతున్నారని చెప్పారు. ప్రధాని మోదీ హయాంలో వీళ్ల ఆటలు సాగవని ఆయన కుండ బద్దలు కొట్టారు.


ప్రపంచం సంక్షోభం ఎదుర్కొన్నప్పటికీ.. భారత్ మాత్రం పురోగమిస్తునే ఉంటుందని విశ్వాసం వ్యక్తం చేశారు. బలమైన ప్రజాస్వామ్య భారతదేశానికి అపారమైన శక్తి ఉందని అన్నారు. దేశభక్తులంతా ఒకతాటిపైకి వచ్చి.. మీ కలల కూలదోస్తారని వారిని ఉద్దేశించి బీజేపీ చీఫ్ నితిన్ నబీన్ వ్యాఖ్యానించారు.


ఈ వార్తలు కూడా చదవండి..

ఢిల్లీలో ఉద్రిక్తత: బారికేడ్లతో పాటు రోడ్లపై స్పైక్ స్ట్రిప్స్ ఏర్పాటు చేసిన పోలీసులు!

స్టార్‌లింక్ లైసెన్స్ వివాదం.. కమల్ హాసన్‌కు మద్దతుగా కంగనా రనౌత్

Updated Date - Oct 10 , 2026 | 12:59 PM