టీఎంసీలో చేరిన నేతాజీ మునిమనుమడు
ABN , Publish Date - Apr 13 , 2026 | 11:12 AM
ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధుడు నేతాజీ సుభాష్ చంద్రబోస్ మునిమనుమడు చంద్ర కుమార్ బోస్ తృణమూల్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. పశ్చిమబెంగాల్ అసెంబ్లీ ఎన్నికల వేళ ఆయన టీఎంసీలో చేరడం ప్రాధాన్యం సంతరించుకుంది.
న్యూఢిల్లీ: ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధుడు నేతాజీ సుభాష్ చంద్రబోస్ మునిమనుమడు చంద్ర కుమార్ బోస్ (Chandra Kumar Bose) తృణమూల్ కాంగ్రెస్ పార్టీ (TMC)లో చేరారు. పశ్చిమబెంగాల్ అసెంబ్లీ ఎన్నికల వేళ ఆయన టీఎంసీలో చేరడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఆయన 2023లో సైద్ధాంతిక వైరుధ్యాల కారణంగా బీజేపీ నుంచి వైదొలిగారు.
బీజేపీ విభజన రాజకీయాల వల్లే..
టీఎంసీలో చేరిన అనంతరం చంద్ర కుమార్ బోస్ మాట్లాడుతూ, నేతాజీ సుభాష్ చంద్రబోస్ ఆదర్శాలను బీజేపీ నీరుగార్చిందని విమర్శించారు. ఎంతో జాగ్రత్తగా పరిశీలించి, నిశితంగా విశ్లేషించిన తరువాతే తాను టీఎంసీలో చేరాలనే నిర్ణయం తీసుకున్నట్టు చెప్పారు. 'మళ్లీ తప్పు చేయదలచుకోలేదు. రాజకీయ పార్టీలను ఎంతో జాగ్రత్తగా పరిశీలించి ఒక అవగాహనకు వచ్చాను. సమ్మిళిత, సెక్యులర్ రాజకీయాలకు టీఎంసీ కట్టుబడి ఉంది. నా ఐడియాలజీ కూడా అదే' అని ఆయన వివరించారు.
చంద్ర కుమార్ బోస్ 2016లో బీజేపీలో చేరారు. శరత్ చంద్ర బోస్, నేతాజీ సుభాష్ చంద్రబోస్ అనుసరించిన సెక్యులర్ విలువలకు బీజేపీ కట్టుబడి ఉంటుందనే నమ్మకంతోనే ఆ పార్టీలో తాను చేరానని, అయితే రాజ్యాంగంలో పొందుపరిచిన ఆశయాలకు భిన్నంగా బీజేపీ విధానాలు ఉన్నట్టు తాను గ్రహించానని చెప్పారు. రాజ్యంగం మీద ప్రమాణం చేసి అధికారంలోకి వచ్చిన బీజేపీ రాజ్యాంగ సూత్రాలు, విధానాలను దూరంగా పెట్టి విభజన ధోరణిలో ఓటు బ్యాంకు రాజకీయాలకు పాల్పడుతోందని ఆరోపించారు. 2016, 2019 ఎన్నికల్లో బీజేపీ టిక్కెట్టుపై చంద్రకుమార్ బోస్ పోటీ చేశారు. అయితే రెండుసార్లూ ఆయన ఓటమి పాలయ్యారు. భారత స్వాతంత్ర్య ఉద్యమ ప్రధాన స్ఫూర్తిని బీజేపీ విస్మరించిందని బోస్ ఆరోపిస్తున్నారు.
బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలు నిర్ణయాత్మకంగా మారుతున్న వేళ నేతాజీ సుభాష్ వారసత్వం పార్టీలోకి రావడం తమకు బలం చేకూర్చే అంశంగా టీఎంసీ భావిస్తోంది. 294 మంది సభ్యుల పశ్చిమబెంగాల్ అసెంబ్లీకి రెండు విడతలుగా ఏప్రిల్ 23, 29 తేదీల్లో పోలింగ్ జరుగనుంది. మే 4న ఫలితాలు వెలువడతాయి.
ఇవి కూడా చదవండి..
మోదీ యూటర్న్‌కు 30 నెలలు పట్టింది.. పార్లమెంటు ప్రత్యేక సమావేశంపై సోనియాగాంధీ ఫైర్
50 శాతం సీట్ల పెంపునకు.. దక్షిణాదిలో 40 శాతం మద్దతు!