మోదీ యూటర్న్‌కు 30 నెలలు పట్టింది.. పార్లమెంటు ప్రత్యేక సమావేశంపై సోనియాగాంధీ ఫైర్
ABN , Publish Date - Apr 13 , 2026 | 10:02 AM
మహిళా రిజర్వేషన్ల చట్టంతో ముడిపడిన సవరణ బిల్లును ఆమోదించాలని కోరుతూ పార్లమెంటు ప్రత్యేక సమావేశానికి కేంద్రం పిలుపునివ్వడంపై కాంగ్రెస్ అగ్రనాయకురాలు సోనియాగాంధీ స్పందించారు. ప్రత్యేక సమావేశానికి ప్రభుత్వం పిలుపునివ్వడం వెనుక అసలు ఉద్దేశం మహిళా రిజర్వేషన్ కాదని, నియోజకవర్గాల పునర్వభజన (డీలిమిటేషన్) కోసమేనని అన్నారు.
న్యూఢిల్లీ: మహిళా రిజర్వేషన్ల చట్టంతో (నారీ శక్తి వందన్ అధినియం) ముడిపడిన సవరణ బిల్లును ఆమోదించాలని కోరుతూ పార్లమెంటు ప్రత్యేక సమావేశానికి కేంద్రం పిలుపునివ్వడంపై కాంగ్రెస్ అగ్రనాయకురాలు సోనియాగాంధీ (Sonia Gandhi) స్పందించారు. ప్రత్యేక సమావేశానికి ప్రభుత్వం పిలుపునివ్వడం వెనుక అసలు ఉద్దేశం మహిళా రిజర్వేషన్ కాదని, నియోజకవర్గాల పునర్వభజన (డీలిమిటేషన్) కోసమేనని అన్నారు. ప్రభుత్వ ప్రతిపాదిత నియోజకవర్గాల పునర్విభజన అత్యంత ప్రమాదకరమని, రాజ్యాంగంపై దాడి అని మండిప్డడారు. కులగణనను జాప్యం చేయడమే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వం ముఖ్యోద్దేశమని ఆరోపించారు. నాలుగు రాష్ట్రాలు, ఒక కేంద్రపాలిత ప్రాంతంలో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న తరుణంలో మహిళా రిజర్వేషన్ చట్టానికి సవరణలు చేసేందుకు ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేయడం వెనుక ఉద్దేశాన్ని కూడా సోనియాగాంధీ నిలదీశారు.
'ఇంతా హడావిడిగా కేంద్రం వ్యవహరించడం వెనుక ఒకే ఒక్క కారణం కనిపిస్తోంది. విపక్షాలను ఆత్మరక్షణలో పడేసి రాజకీయ ప్రయోజనం పొందాలనుకుంటోంది' అని ఒక ఆంగ్ల దినపత్రికలో రాసిన వ్యాసంలో సోనియాగాంధీ పేర్కొన్నారు. 2023 సెప్టెంబర్‌లో నారీ శక్తి వందన్ అధినియం-2023 బిల్లును పార్లమెంటు ఏకగ్రీవంగా ఆమోదించిందని గుర్తు చేశారు. రాజ్యాంగంలోని అధికరణ '334-ఎ' కింద దీన్ని ప్రవేశపెట్టారని, ఆ ప్రకారం లోక్‌సభ, విధానసభల్లో మహిళలకు మూడింట ఒకవంతు రిజర్వేషన్ కల్పించాల్సి ఉంటుందని, తదుపరి జనగణన, జనాభా ఆధారిత నియోజకవర్గాల ప్రక్రియ పూర్తయినప్పటి నుంచి ఇది అమల్లోకి వస్తుందని వివరించారు. ఇది విపక్షాలు పెట్టిన షరతు కాదని అన్నారు. నిజానికి 2024 లోక్‌సభ ఎన్నికల నుంచే రిజర్వేషన్ ప్రొవిజన్‌ను అమలు చేయాలని రాజ్యసభలో విపక్ష నేత మల్లికార్జున్ ఖర్గే డిమాండ్ చేశారని తెలిపారు. అయితే ప్రభుత్వం అంగీకరించ లేదని, దానికి కారణం కూడా ప్రభుత్వానికి బాగా తెలుసునని సోనియాగాంధీ విమర్శించారు.
'2029 నుంచి మహిళా రిజర్వేషన్ అమలు చేసేందుకు 334-ఎ అధికరణను సవరించడమే ప్రభుత్వ ప్రధాన ఉద్దేశంగా అవగాహన చేసుకోవాల్సి వస్తోంది. ప్రధానమంత్రి యూ-టర్న్ తీసుకోవడానికి 30 నెలలు సమయం ఎందుకు తీసుకోవాల్సి వచ్చింది? ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేయడానికి మరి కొద్ది వారాలు ఎందుకు ఆగలేకపోయారు?' అని ప్రశ్నలు కురిపించారు. నిజానికి కులగణనను మరింత జాప్యం చేయాలన్నదే ప్రధానమంత్రి ఎత్తుగడ అని సోనియాగాంధీ విమర్శించారు. 2029 నుంచి మహిళ రిజర్వేషన్ అమలు చేసేందుకు వీలుగా సవరణలు చేసేందుకు ఈనెల 16 నుంచి 18వ తేదీ వరకూ మూడ్రోజుల పార్లమెంటు ప్రత్యేక సమావేశాలకు కేంద్రం పిలుపునిచ్చింది.
ఇవి కూడా చదవండి..
50 శాతం సీట్ల పెంపునకు.. దక్షిణాదిలో 40 శాతం మద్దతు!