Share News

కలిసి రండి

ABN , Publish Date - Apr 13 , 2026 | 05:07 AM

మహిళా రిజర్వేషన్ల అమలు కోసం చట్ట సవరణను ఆమోదించే చరిత్రాత్మక ఘట్టంలో.. అందరూ ఏకతాటిపైకి వచ్చి భాగస్వాములు కావాలని పార్లమెంటు ఉభయసభల్లోని అన్ని రాజకీయ పక్షాలకు ప్రధాని నరేంద్ర మోదీ .....

కలిసి రండి

  • మహిళా రిజర్వేషన్ల అమలులో భాగస్వాములు కండి

  • భవిష్యత్‌ తరాల పట్ల మన బాధ్యతను చాటుకుందాం

  • పార్లమెంటులోని అన్ని పార్టీల ఫ్లోర్‌ లీడర్లకూ ప్రధాని మోదీ లేఖ

  • 2023లోనే ఆ చట్టం.. 30 నెలల తర్వాత గుర్తొచ్చిందా?

  • నియోజకవర్గాల పునర్విభజన, ఇతర వివరాలపై స్పష్టత లేకుండా.. ఈ చట్టంపై అర్థవంతమైన చర్చ అసాధ్యం

  • డీలిమిటేషన్‌పై చర్చకు ఏప్రిల్‌ 29 తర్వాత అఖిల పక్ష సమావేశం ఏర్పాటు చేయండి.. మోదీకి ఏఐసీసీ చీఫ్‌ మల్లికార్జున ఖర్గే లేఖ

న్యూఢిల్లీ, ఏప్రిల్‌ 12 (ఆంధ్రజ్యోతి): మహిళా రిజర్వేషన్ల అమలు కోసం చట్ట సవరణను ఆమోదించే చరిత్రాత్మక ఘట్టంలో.. అందరూ ఏకతాటిపైకి వచ్చి భాగస్వాములు కావాలని పార్లమెంటు ఉభయసభల్లోని అన్ని రాజకీయ పక్షాలకు ప్రధాని నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. ఇది కేవలం ఒక పార్టీకో, వ్యక్తికో సంబంధించిన అంశం కాదని, ఇది మన మహిళా లోకం పట్ల, భవిష్యత్‌ తరాల పట్ల మన బాధ్యతను చాటుకునే సమయమని అన్నారు. నారీ శక్తిని, 140 కోట్ల మంది భారతీయుల ఆకాంక్షలను నిజం చేస్తూ పార్లమెంటులో మహిళా రిజర్వేషన్ల చట్ట సవరణను ఏకతాటిపైకి వచ్చి ఆమోదిస్తారని తాను నమ్ముతున్నానని మోదీ పేర్కొన్నారు. ‘నారీ శక్తి వందన్‌ అధినియం’ (మహిళా రిజర్వేషన్‌ చట్టం) అమలుపై చర్చించేందుకు ఏప్రిల్‌ 16 నుంచి పార్లమెంట్‌ ప్రత్యేక సమావేశాలను నిర్వహించనున్నట్లు ప్రకటించారు. ఈ మేరకు ఆయన ఉభయసభలలోని అన్ని పార్టీల ఫ్లోర్‌ లీడర్లకూ లేఖ రాశారు. ఈ ప్రత్యేక సమావేశాలు భారత ప్రజాస్వామ్యాన్ని మరింత బలోపేతం చేస్తాయని ప్రధాని తన లేఖలో ఆకాంక్షించారు. ‘‘అభివృద్ధి చెందిన భారత్‌ను ఆవిష్కరించడంలో మహిళల పాత్ర ఎంతో కీలకం. అంతరిక్షం నుంచి క్రీడల వరకూ, సాయుధ దళాల నుంచి స్టార్ట్‌పల వరకూ ప్రతి రంగంలో దేశ ఆడబిడ్డలు తమ సత్తా చాటుతున్నారు. ఇప్పుడు రాజకీయాల్లోనూ వారి ప్రాతినిధ్యం పెరగాల్సిన సమయం వచ్చింది. 2029 లోక్‌సభ, శాసనసభల అసెంబ్లీ ఎన్నికలు మహిళా రిజర్వేషన్లతోనే నిర్వహించడం చాలా ముఖ్యం. ఇది మన ప్రజాస్వామ్య వ్యవస్థలో కొత్త శక్తిని నింపుతుంది. పాలనలో మహిళల ప్రాతినిధ్యాన్ని నిర్ధారిస్తుంది’’ అని ప్రధాని పేర్కొన్నారు. 2023లో పార్లమెంట్‌లో అన్ని పార్టీలూ ఏకగ్రీవంగా మహిళా రిజర్వేషన్ల చట్టానికి మద్దతు తెలపడం ఒక చిరస్మరణీయ ఘట్టమని గుర్తుచేశారు. మహిళా కోటా అమలుపై గత కొంతకాలంగా రాజ్యాంగ నిపుణులతో, వివిధ రాజకీయ పక్షాలతో సంప్రదింపులు జరపగా.. ఈ చట్టాన్ని వీలైనంత త్వరగా అమలు చేయాలనే విస్తృత ఏకాభిప్రాయం వ్యక్తమైందని తెలిపారు. మహిళా రి జర్వేషన్‌ చట్టాన్ని దాని అసలు స్ఫూర్తితో అమలు చేసే సమయం ఆసన్నమైందని స్పష్టంచేశారు. ఇందుకు సహకరించే పార్లమెంటు సభ్యులు ఈ చరిత్రాత్మక ప్రయత్నంలో భాగమైనందుకు ఎల్లప్పుడూ గర్వపడతారని, ఈ అవకాశాన్ని జారిపోనివ్వకూడదని ప్రధాని సూచించారు.


ఇన్నాళ్లూ నిద్ర పోయారా?: ఖర్గే

మహిళా రిజర్వేషన్ల అమలుపై ఏప్రిల్‌ 16 నుంచి పార్లమెంట్‌ ప్రత్యేక సమావేశాలు నిర్వహించనున్నట్లు ప్రధాని మోదీ ప్రకటించడంపై కాంగ్రెస్‌ అధ్యక్షుడు, రాజ్యసభలో విపక్ష నేత మల్లికార్జున ఖర్గే తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ‘‘2023లోనే మహిళా కోటా చట్టం చేసినా 30 నెలల పాటు నిద్రపోయి, ఇప్పుడు ఎన్నికల వేళ రాజకీయ లబ్ధి కోసం హడావుడి చేస్తున్నారా?’’ అంటూ మోదీకి రాసిన లేఖలో సూటిగా ప్రశ్నించారు. మహిళా రిజర్వేషన్ల చట్టసవరణతో ముడిపడి ఉన్న డీలిమిటేషన్‌ అంశంపై చర్చించడానికి.. ఐదు రాష్ట్రాల ఎన్నికలు ముగిసే ఏప్రిల్‌ 29 తర్వాత ఎప్పుడైనా అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేయాలని సూచించారు. మహిళా రిజర్వేషన్ల తక్షణ అమలు పై అందరిలోనూ ఏకాభిప్రాయం ఉందని ప్రధాని తన లేఖలో పేర్కొనడాన్ని ఖర్గే తప్పుబట్టారు. 2023 సెప్టెంబరులో బిల్లు పాసైనప్పుడే.. వెంటనే అమలు చేయాలని కాంగ్రెస్‌ తరఫున తాను డిమాండ్‌ చేశానని, అప్పుడు పట్టించుకోకుండా ఇప్పుడు విపక్షాల్ని సంప్రదించకుండానే ఈ ప్రత్యేక సమావేశాలకు పిలిచారని విమర్శించారు. నియోజకవర్గాల పునర్విభజనపై వివరాలు వెల్లడించకుండానే కేంద్రం తమ సహకారాన్ని కోరుతోందని, పునర్విభజన వివరాలు, ఇతర అంశాలపై స్పష్టత లేకుండా ఈ చట్టంపై పార్లమెంటు సమావేశాలలో అర్థవంతమైన చర్చ అసాధ్యమని ఖర్గే తేల్చిచెప్పారు. రాజకీయ పక్షాలతో సంప్రదింపులు జరిపామని ప్రధాని మోదీ చెప్పడం అసత్యమని విమర్శించారు. కేవలం రాజకీయ మైలేజీ కోసమే మోదీ సర్కారు తొందరపడుతోందని ఆయన ఆరోపించారు. కాగా, మోదీ ప్రభుత్వం జనాభా లెక్కల సేకరణను అటకెక్కించాలని చూస్తోందని ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి జైరాం రమేశ్‌ ఆరోపించారు. దేశాన్ని తప్పుదోవ పట్టించే ఎజెండాతో మహిళా రిజర్వేషన్‌ బిల్లును సవరించాలని ప్రధాని మోదీ భావిస్తున్నారని, ఇది భారీ వంచనేనని ఆదివారం ‘ఎక్స్‌’లో ఆయన ధ్వజమెత్తారు.

Updated Date - Apr 13 , 2026 | 05:07 AM