బెంగాల్‌ను మూడు ముక్కలు చేసేందుకే.. డీలిమిటేషన్‌పై బీజేపీని తప్పుపట్టిన మమత
ABN , Publish Date - Apr 12 , 2026 | 08:23 PM
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంపై పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మరోసారి తీవ్ర విమర్శలు చేశారు. నియోజకవర్గాల పునర్విజన ద్వారా బెంగాల్‌ను మూడు ముక్కలు చేయాలని కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఆలోచనగా ఉందని ఆరోపించారు.
కోల్‌కతా: కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంపై పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ (Mamata Banerjee) మరోసారి తీవ్ర విమర్శలు చేశారు. నియోజకవర్గాల పునర్విభజన ద్వారా బెంగాల్‌ను మూడు ముక్కలు చేయాలని కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం యోచిస్తోందని ఆరోపించారు. బెంగాల్‌లోని కొన్ని ప్రాంతాలను బిహార్‌లో కానీ, ఒడిశాలో కానీ వీలీనం చేయాలనుకుంటోందని.. ఇది ఆయా ప్రాంతాల్లో నివసించే బెంగాలీ ప్రజలను కష్టాల్లోకి నెట్టేస్తుందని అన్నారు. పూర్వ బర్దమాన్‌లోని బంకురా జిల్లాలో జరిగిన ఎన్నికల ర్యాలీల్లో మమతా బెనర్జీ తాజా విమర్శలు చేశారు.
'పశ్చిమబెంగాల్‌ను మూడుగా విభజించేందుకే నియోజకవర్గాల పునర్విభజన బిల్లును బీజేపీ తెస్తోంది. ఒడిశా లేదా బిహార్‌లో ఆ భాగాలను కలిపేసి అక్కడి బెంగాలీలకు నరకం చూపించనుంది' అని మమత ఆరోపించారు. టీఎంసీని ఓడించి ముస్లిం మైనారిటీ ఓట్లను చీల్చేందుకు ఆమ్ జనాత ఉన్నయన్ పార్టీ చీఫ్ హుమయూన్ కబీర్‌తో బీజేపీ రూ.1,000 కోట్ల డీల్ కుదుర్చుకున్నట్టు, అందులో రూ.200 కోట్లు ఆయన అందుకున్నట్టు వెలుగుచూసిన వీడియోను కూడా మమతా బెనర్జీ ప్రస్తావించారు. బెంగాల్‌లోని టీఎంసీని గద్దె దించేందుకు బీజేపీ ఈ డీల్ సాగిస్తోందని విమర్శించారు. అసెంబ్లీ ఎన్నికల కోసం మోహరించిన కేంద్ర బలగాలు గాలింపుల పేరుతో మహిళలను అగౌరపరుస్తారని కూడా మమత ఆరోపించారు.
సభావేదిక అందుబాటులో ఉన్నప్పటికీ ర్యాలీ నిర్వహించేందుకు తనకు అనుమతి ఇవ్వలేదనీ, అదే ప్రధానమంత్రి మోదీ మీటింగ్‌కు ఆగమేఘాల మీద క్లియరెన్స్ ఇచ్చారని మమతా బెనర్జీ తెలిపారు. ఇటీవల కాలంలో దేశంలోనే అతిపెద్ద కుంభకోణంగా ఎస్ఐఆర్‌ను అభివర్ణించారు. '2026లో మీ ప్రభుత్వం కూలిపోతుందని ప్రపంచంలోని ప్రతి ఒక్కరికీ తెలుసు. అప్పుడు మీ ప్రభుత్వం తీసుకువచ్చిన అన్ని ప్రజావ్యతిరేక చట్టాలను మేము రద్దు చేస్తాం' అని మమత స్పష్టం చేశారు.
టీ, స్వీట్లు ఇస్తారు.. అప్రమత్తంగా ఉండండి
గెలుపు కోసం ఎన్నికల ప్రక్రియలో అవకతవకలకు బీజేపీ పాల్పడే అవకాశం ఉందని, ఆల్కహాల్ టీ, స్వీట్లు ప్రజలకు పంచి ఓట్లు లూటీ చేయవచ్చని, అప్రమత్తంగా ఉండాలని మమత హెచ్చరించారు. 'స్పైక్ టీ, బిస్కెట్లు తీసుకుంటే మీరు నిద్రలోకి జారుకుంటారు. అప్పడు మీ ఓట్లు వాళ్లు లూటీ చేస్తారు. అప్రమత్తంగా ఉండండి' అని అన్నారు.
ఇవి కూడా చదవండి..
పేర్లు మార్చినంత మాత్రాన వాస్తవం మారదు: అరుణాచల్‌లో చైనా చర్యలపై ఎంఈఏ
పార్లమెంటు ప్రత్యేక సమావేశాలు.. మూడు లైన్ల విప్ జారీ చేసిన బీజేపీ