మహిళా రిజర్వేషన్ బిల్లుకు మద్దతు కోరుతూ ఎంపీలకు మోదీ లేఖ
ABN , Publish Date - Apr 12 , 2026 | 02:42 PM
మహిళా రిజర్వేషన్ చట్ట (నారీ శక్తి వందన్ అధినియమ్) సవరణ బిల్లుకు మద్దతు కోరుతూ అన్ని పార్టీల ఫోర్ల్ లీడర్లకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ లేఖ రాశారు. వ్యక్తులు, పార్టీలకు అతీతంగా చట్టాన్ని నిజమైన స్ఫూర్తితో అమలు చేసేందుకు సమయం ఆసన్నమైందని పేర్కొన్నారు.
న్యూఢిల్లీ: మహిళా రిజర్వేషన్ చట్ట (నారీ శక్తి వందన్ అధినియమ్) సవరణ బిల్లుకు మద్దతు కోరుతూ అన్ని పార్టీల ఫోర్ల్ లీడర్లకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (PM Modi) లేఖ రాశారు. వ్యక్తులు, పార్టీలకు అతీతంగా చట్టాన్ని నిజమైన స్ఫూర్తితో అమలు చేసేందుకు సమయం ఆసన్నమైందని పేర్కొన్నారు. 2029 లోక్‌సభ ఎన్నికలను మహిళలకు 33 శాతం రిజర్వేషన్‌తో నిర్వహిద్దామని అన్నారు.
విస్తృత సంప్రదింపుల అనంతరం నారీ శక్తి వందన్ అధినియమ్ అమలుకు సమయం ఆసన్నమైందనే నిశ్చితాభిప్రాయానికి వచ్చామని, 2029 లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికలు మహిళా రిజర్వేషన్‌తో నిర్వహించడం అనివార్యమని అని ఆ లేఖలో ప్రధాని పేర్కొన్నారు. మహిళలు, భవిష్యత్తు తరాల కోసం బాధ్యత తీసుకోవాలని పార్టీలను కోరారు. ఇందుకోసం పార్లమెంటులో చర్చను స్వాగతిస్తున్నామని చెప్పారు.
'మహిళా రిజర్వేషన్ చట్ట సవరణ బిల్లును ఆమోదించే విషయంలో అందరినీ ఒకేతాటిపైకి రావాలని కోరేందుకు ఈ లేఖ రాస్తున్నాను. పార్లమెంటులో ఎక్కువ మంది తమ అభిప్రాయాలను పంచుకోవడం అందరికీ గర్వకారణమవుతుంది. వ్యక్తులు, పార్టీలకు అతీతంగా, మహిళలు, భవిష్యత్తు తరాల పట్ల బాధ్యతను చాటుకునే సందర్భమిది. మహిళలకు రిజర్వేషన్ కల్పించాలని చాలాకాలంగా సభ్యులు కోరుతున్నారు. వారి ఆకాంక్షలు కార్యరూపంలోకి వచ్చే సమయం ఇప్పుడు వచ్చింది. 140 కోట్ల భారతీయులు, నారీశక్తి సాధించిన విజయం ఇది. ఈ చారిత్రక ఘట్టాన్ని ఆవిష్కరించేందుకు అంతా కలిసికట్టుగా ముందుకు వస్తారనే పూర్తి నమ్మకం నాకు ఉంది' అని మోదీ ఆ లేఖలో పేర్కొన్నారు.
మహిళలు ఎదిగేందుకు, నిర్ణయాలు తీసుకునేందుకు, ప్రత్యేకించి నాయకత్వం వహించేందుకు ఎంతగా అవకాశమిస్తే అంతగా సమాజం ప్రగతి పథంలోకి వెళ్తుందని మోదీ అన్నారు. అభివృద్ధి చెందిన దేశంగా ఇండియా విజన్ సాకారం కావాలంటే ఈ ప్రయాణంలో మహిళలు కీలకమైన, చురుకైన పాత్ర పోషించడం అవసరమని అన్నారు. ఏప్రిల్ 16 నుంచి పార్లమెంటులో మహిళా రిజర్వేషన్ బిల్లుపై చర్చ ప్రారంభించనున్నట్టు ఆ లేఖలో ప్రధాని తెలిపారు.