ప్రసిద్ధ గాయని ఆశా భోంస్లే కన్నుమూత
ABN , Publish Date - Apr 12 , 2026 | 01:05 PM
ప్రసిద్ధ గాయని ఆశా భోంస్లే తుది శ్వాస విడిచారు. ఛాతి ఇన్ఫెక్షన్ సోకడంతో ఆసుపత్రిలో చేరిన ఆమె నేడు కన్నుమూశారు.
ఇంటర్నెట్ డెస్క్: ప్రసిద్ధ గాయని ఆశా భోంస్లే (92) తుది శ్వాస విడిచారు. శనివారం సాయంత్రం ఆమె అస్వస్థతకు లోనయ్యారు. ఛాతిలో ఇన్ఫెక్షన్ సోకడంతో ఆమెను ముంబైలోని బ్రీచ్ క్యాండీ ఆసుపత్రిలో చేర్పించగా ఆదివారం తుది శ్వాస విడిచారు. ఈ విషయాన్ని ఆమె కుమారుడు ఆనంద్ భోంస్లే ధ్రువీకరించారు. తన తల్లి అంత్యక్రియలను సోమవారం సాయంత్రం ముంబైలోని శివాజీ పార్క్లో నిర్వహిస్తామని చెప్పారు.
1933లో జన్మించిన ఆశా భోంస్లే పదేళ్ల వయసులో ఒక మరాఠీ సినిమాలో తొలి పాటను పాడారు. ఆ తరువాత దాదాపు ఎనిమిది దశాబ్దాల పాటు తన అద్భుత గాత్రంతో సంగీత ప్రియులను అలరించారు. 2023లో తన 90వ పుట్టిన రోజు సందర్భంగా దుబాయ్లో లైవ్ కార్యక్రమంలో ఏకంగా మూడు గంటల పాటు పాడి అభిమానులను ఆశ్చర్యంలో ముంచెత్తారు. సంగీత ప్రపంచంలో ఎనలేని ప్రతిభ కనబరిచిన ఆమె పద్మ విభూషణ్, దాదాసాహెబ్ ఫాల్కే అవార్డులతో పాటు అనేక ఇతర సత్కారాలను అందుకున్నారు. ఆశా భోంస్లే మృతిపై వివిధ రంగాల ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు.