Share News

50 శాతం సీట్ల పెంపునకు.. దక్షిణాదిలో 40 శాతం మద్దతు!

ABN , Publish Date - Apr 13 , 2026 | 05:54 AM

లోక్‌సభ సీట్లను రాష్ట్రాల వారీగా 50 శాతం పెంచే ప్రతిపాదనను పార్లమెంటులో నెగ్గించుకునేందుకు మోదీ సర్కారు తగిన మద్దతు కూడగడుతోంది.

50 శాతం సీట్ల పెంపునకు.. దక్షిణాదిలో 40 శాతం మద్దతు!

  • పార్టీల మద్దతు కూడగడుతున్న కేంద్ర పెద్దలు

  • వ్యతిరేక పార్టీలకు చెక్‌ పెట్టనున్న మోదీ

  • మహిళా బిల్లుతోపాటే పార్లమెంటు ముందుకు

  • తెలంగాణలో జమిలి, మహిళా రిజర్వేషన్‌,

  • నియోజకవర్గాల పెంపు ఒకేసారి అమలు

హైదరాబాద్‌, ఏప్రిల్‌ 12 (ఆంధ్రజ్యోతి): లోక్‌సభ సీట్లను రాష్ట్రాల వారీగా 50 శాతం పెంచే ప్రతిపాదనను పార్లమెంటులో నెగ్గించుకునేందుకు మోదీ సర్కారు తగిన మద్దతు కూడగడుతోంది. చట్టసభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్‌ కోసం తీసుకొస్తున్న చట్ట సవరణ బిల్లుపై చర్చలో భాగంగానే సీట్ల పెంపు అంశంపై కూడా చర్చ చేపట్టనున్నట్లు తెలుస్తోంది. మహిళా రిజర్వేషన్‌ సవరణ బిల్లును ఆమోదించేందుకు ఈ నెల 16 నుంచి 18 వరకు పార్లమెంటు ప్రత్యేక సమావేశాలు నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఈ మేరకు తమ పార్టీ ఎంపీలకు బీజేపీ విప్‌ జారీ చేసింది. పార్టీ ఎంపీలందరూ తప్పనిసరిగా హాజరుకావాలని పేర్కొంది. ఎన్డీయేలోని ఇతర భాగస్వామ్య పక్షాలు కూడా విప్‌ జారీ చేయనున్నాయి. అయితే సీట్ల పెంపు బిల్లు.. మహిళా రిజర్వేషన్‌ సవరణ బిల్లులో భాగంగా వస్తుందా? లేక ప్రత్యేకంగా బిల్లు పెడతారా? అన్నదానిపై స్పష్టత లేదు. కానీ, ఈ ప్రత్యేక సమావేశాల్లో నిర్ణయం జరిగే అవకాశం ఉందని తెలుస్తోంది. కాగా, 50 శాతం సీట్ల పెంపు ఫార్ములాకు ఎన్డీయే భాగస్వామ్య పార్టీలన్నీ మద్దతు పలకనున్నాయి. అయితే ప్రతిపక్ష ఇండియా కూటమిలో ఇందుకు సానుకూలంగా ఉన్న కొన్ని పార్టీల మద్దతును, రెండు కూటములకు చెందని పార్టీల మద్దతును కూడా కూడగట్టేందుకు కేంద్ర ప్రభుత్వ పెద్దలు ఇప్పటికే చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. తద్వారా ఈ ఫార్ములాను వ్యతిరేకించే పార్టీలకు చెక్‌ పెట్టే ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. అయితే 50 శాతం సీట్ల ఫార్ములాతో దక్షిణాది రాష్ట్రాల రాజకీయ, ఇతర ప్రయోజనాలకు తీవ్ర నష్టం వాటిల్లనుందంటూ.. దీనిని వ్యతిరేకిస్తున్న పార్టీలు వాదిస్తున్న నేపథ్యంలో.. బీజేపీ ప్రయత్నాలకు దక్షిణాది నుంచి ఏ మేరకు మద్దతు లభిస్తుందన్నది ఆసక్తికరంగా మారింది.


దక్షిణాది నుంచి 40 శాతం మద్దతు?

దక్షిణాది రాష్ట్రాలకు సంబంధించి ఆంధ్రప్రదేశ్‌లో 25 ఎంపీ సీట్లు ఉండగా.. ఇందులో టీడీపీ నేతృత్వంలోని కూటమికి 21, వైసీపీకి 4 సీట్లు ఉన్నాయి. నలుగురు వైసీపీ ఎంపీలు సహా మొత్తం 25 మంది ఎంపీలూ 50 శాతం పెంపు ఫార్ములాకు మద్దతు పలకనున్నారు. తెలంగాణలో కాంగ్రెస్‌కు చెందిన 8 మంది ఎంపీలు, ఎంఐఎం ఎంపీ ఒకరు వ్యతిరేకించినా.. బీజేపీకి చెందిన 8 మంది మద్దతు దక్కనుంది. బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ సైతం ఈ ఫార్ములాపై సానుకూలంగా స్పందించారు. అంటే రాజ్యసభలోని బీఆర్‌ఎస్‌ ఎంపీల మద్దతు లభించనుంది. కర్ణాటకలో మొత్తం 28 ఉంటే.. బీజేపీకి 17, కాంగ్రెస్‌కు 9, జేడీఎస్కు 2 సీట్లు ఉన్నాయి. అయితే కాంగ్రెస్‌ను మినహాయించి 19 మంది ఎంపీల మద్దతూ 50 శాతం ఫార్ములాకే దక్కనుంది. తమిళనాడులో 39 ఎంపీ సీట్లకుగాను డీఎంకేకు 22, కాంగ్రెస్‌కు 9, వీసీకే 2, సీపీఐకి 2, ఇండియన్‌ యూనియన్‌ ముస్లిం లీగ్‌ 1, ఎండీఎంకేకు ఒకటి ఉన్నాయి. అయితే 50 శాతం పెంపు ప్రతిపాదనను ఈ రాష్ట్రం నుంచి 39 మంది ఎంపీలూ వ్యతిరేకించే అవకాశం ఉంది. కేరళలో 20 ఎంపీ సీట్లు ఉంటే.. ఈ సీట్లన్నీ ఎల్డీఎఫ్‌, యూడీఎ్‌ఫలకు చెందినవే. రెండు కూటములూ ఈ ప్రతిపాదనను వ్యతిరేకిస్తున్నాయి. పుదుచ్చేరి నుంచి ఉన్న ఒక్క సీటూ కాంగ్రెస్‌ పార్టీదే. మొత్తంగా దక్షిణాది రాష్ట్రాల నుంచి 130 సీట్లు ఉంటే.. ఇందులో పెంపు ప్రతిపాదనకు మద్దతిచ్చే ఎంపీల సంఖ్య నికరంగా 52గా ఉంది. మిగిలిన 78 మంది వ్యతిరేకించే అవకాశం ఉంది. అయినా దక్షిణాది రాష్ట్రాల నుంచి కూడా 40 శాతం ఎంపీల మద్దతును మోదీ సర్కారు కూడగట్టనుండటం విశేషమేనని అంటున్నారు.

తెలంగాణలో జమిలి, డీ లిమిటేషన్‌, మహిళా రిజర్వేషన్‌ ఒకేసారి

చట్ట సభల్లో మహిళా రిజర్వేషన్‌ అమలు, నియోజకవర్గాల పునర్విభజన చేసి 2029లో జమిలి ఎన్నికలకు వెళ్లాలని మోదీ సర్కారు భావిస్తున్న నేపథ్యంలో తెలంగాణలో ఈ మూడూ ఒకేసారి అమలు కానున్నాయి. ప్రస్తుత ప్రభుత్వ పాలన గడువు 2028 డిసెంబరులో ముగియనుండగా.. ఎన్నికలను మరో ఆరు నెలలు వాయిదా వేసి జమిలిలో భాగంగా నిర్వహించే ఆస్కారం ఉంది. అలాగే నియోజకవర్గాల పునర్విభజనతో అసెంబ్లీ, లోక్‌సభ సీట్లు 50 శాతం మేరకు పెరగనున్నాయి. సీట్ల పెరుగుదలలో భాగంగా ఎస్సీ, ఎస్టీ రిజర్వుడు స్థానాలు కూడా పెరుగుతాయి. అలాగే మహిళా రిజర్వేషన్‌ అమలుతో 33 శాతం సీట్లు మహిళలకు రిజర్వ్‌ కానున్నాయి.

Updated Date - Apr 13 , 2026 | 05:54 AM