నేపాల్ ఫ్లాష్ ఫ్లడ్స్.. 50మందికి పైగా చిక్కుకున్న తమిళనాడు యాత్రికులు
ABN , Publish Date - Aug 27 , 2026 | 10:05 AM
నేపాల్‌లో భారీ వర్షాలు, ఆకస్మిక వరదల నేపథ్యంలో కైలాస్ మానస సరోవర్ యాత్రకు వెళ్లిన తమిళనాడు వాసుల్లో 50 మందికిపైగా చిక్కుకుపోయినట్లు సమాచారం.
చెన్నై, ఆగస్టు 27: నేపాల్‌లో భారీ వర్షాలు, ఆకస్మిక వరదల నేపథ్యంలో కైలాస్ మానస సరోవర్ యాత్రకు వెళ్లిన తమిళనాడు వాసుల్లో 50 మందికిపైగా చిక్కుకుపోయినట్లు సమాచారం. తంజావూరు, కుంభకోణం, మైలాడుతురై జిల్లాలకు చెందిన యాత్రికులు మూడు కార్లలో ప్రయాణిస్తుండగా ఫ్లాష్ ఫ్లడ్స్ సంభవించినట్లు తెలుస్తోంది. ఆకస్మిక వరదల కారణంగా కొందరు యాత్రికులు టిమురే ప్రాంతంలోని ఆర్మ్డ్ పోలీస్ ఫోర్స్ అవుట్‌పోస్ట్‌లో ఆశ్రయం పొందినట్లు సమాచారం. అయితే, అక్కడ మొబైల్ కనెక్టివిటీ లేకపోవడంతో యాత్రికులతో సంబంధాలు తెగిపోయిన పరిస్థితి. దీంతో వారి కుటుంబ సభ్యుల్లో ఆందోళన నెలకొంది. తమిళనాడు యాత్రికుల రక్షణ కోసం ప్రభుత్వ అధికారులు సమన్వయ చర్యలు చేపట్టారు.
ఇదిలా ఉండగా, సద్గురు కైలాస్ యాత్ర బృందానికి చెందిన 77 మంది యాత్రికులు గైరోంగ్‌లోని ఇమ్మిగ్రేషన్ సెంటర్‌లో ఉన్నట్లు సమాచారం. అక్కడ ఫ్లాష్ ఫ్లడ్స్ సంభవించిన సమయంలో 77 మంది యాత్రికులు ఇమ్మిగ్రేషన్ కేంద్రంలో ఉన్నట్లు తెలుస్తోంది. అయితే, ఈ 77 మంది యాత్రికుల ఆచూకీపై ఇంకా అధికారిక సమాచారం అందలేదు. సద్గురు సోజర్న్‌లో మొత్తం 21 యాత్ర బృందాలు ఉన్నట్లు సమాచారం. వీరిలో 495 మంది యాత్రికులు ఇప్పటికే సురక్షితంగా తిరిగి వచ్చినట్లు సద్గురు సంస్థ వెల్లడించింది. తమిళనాడు యాత్రికుల రక్షణ కోసం ముఖ్యమంత్రి విజయ్ ప్రత్యేక ఆదేశాలు జారీ చేశారు. ఢిల్లీలోని తమిళనాడు హౌస్ అధికారులను తక్షణ చర్యలు చేపట్టాలని ఆదేశించారు. విదేశాంగ శాఖతో పాటు నేపాల్‌లోని భారత రాయబార కార్యాలయంతో సంప్రదింపులు కొనసాగుతున్నాయి.
బాధిత తమిళనాడు వాసుల కోసం ప్రభుత్వం 24 గంటల టోల్‌ఫ్రీ హెల్ప్‌లైన్ నంబర్లను విడుదల చేసింది.
భారత్ నుంచి: 1800 309 3793 నంబర్‌కు కాల్ చేయవచ్చు.
విదేశాల నుంచి: +91 80 6900 9900కు మిస్డ్ కాల్ ఇవ్వవచ్చు.
సహాయం కోసం మరో నంబర్: +91 80 6900 9901
తమిళనాడు హౌస్, ఢిల్లీ కంట్రోల్ రూమ్: 92895 16712
మరోవైపు, నేపాల్‌లోని భోటే కోషి నది ఉద్ధృతంగా ప్రవహిస్తుండటంతో బిహార్‌లోనూ అప్రమత్తత కొనసాగుతోంది. వరద ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యల కోసం NDRF బృందాలను అధికారులు సిద్ధం చేస్తున్నట్లు సమాచారం.
ఇవి కూడా చదవండి...
అవినీతి ఆరోపణలు.. భూపాలపల్లి మైన్స్ ఏడీ ఇంట్లో ఏసీబీ రైడ్స్
10 అంతస్తుల భవనంపై నుంచి దూకిన నవ వధువు.. చెట్టు కొమ్మల్లో చిక్కుకుని...
Read Latest National News And Telugu News