అజిత్ పవార్ శాఖలపై సీఎంను కలిసిన ఎన్‌సీపీ నేతలు
ABN , Publish Date - Jan 30 , 2026 | 06:45 PM
మహాయుతి కూటమి ప్రభుత్వంలోని ఎన్‌సీపీ కోటాలో భాగంగా అజిత్ పవార్ చేతిలో కీలకమైన ఆర్థిక, రాష్ట్ర ఎక్సైజ్, క్రీడా శాఖలు ఉన్నాయి.
ముంబై: మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ (Ajit Pawar) గత బుధవారంనాడు విమాన ప్రమాదంలో మరణించడంతో ఆయన చేతిలోని పదవుల విషయమై నేషనల్ కాంగ్రెస్ పార్టీ (NCP) నేతలు ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్‌ను ఆయన నివాసమైన 'వర్ష' బంగ్లాలో శుక్రవారంనాడు కలుసుకున్నారు. మహాయుతి కూటమి ప్రభుత్వంలోని ఎన్‌సీపీ కోటాలో భాగంగా అజిత్ చేతిలో కీలకమైన ఆర్థిక, రాష్ట్ర ఎక్సైజ్, క్రీడా శాఖలు కూడా ఉన్నాయి. ఆ పదవులను తమ పార్టీకే కేటాయించాలని కోరుతూ ఎన్‌సీపీ నేతలు సీఎంకు లాంఛనంగా ఒక విజ్ఞాపన పత్రాన్ని అందజేశారు.
సీఎంతో సమావేశానంతరం ప్రఫుల్ పటేల్ మాట్లాడుతూ, తాము మహాయుతి కూటమిలో భాగస్వాములుగా ఉన్నందున అజిత్ పవార్ నిర్వహించిన శాఖలు సాధ్యమైనంత త్వరగా భర్తీ కావాలని కోరుకుంటున్నామని చెప్పారు. ఏ నిర్ణయం తీసుకున్నప్పటికీ ప్రజల సెంటిమెంట్లను పరిగణనలోకి తీసుకుంటామని చెప్పారు. అజిత్ పవార్‌ను కోల్పోయిన దుఃఖంలో కుటుంబ సభ్యులు ఉన్నారని, వారు కోలుకోవడానికి కొంత సమయం పడుతుందని, పార్టీ భవిష్యత్ ప్రణాళికపై సునేత్ర పవార్, ఆయన కుటుంబ సభ్యులను త్వరలోనే సంప్రదిస్తామని తెలిపారు.
అజిత్ పవార్ ఆకస్మిత మృతితో ఎన్‌సీపీలో పలు ప్రశ్నలు తలెత్తాయి. శరద్ పవార్ సారథ్యంలోని ఎన్‌సీపీ (ఎస్‌పీ)తో తిరిగి ఎన్‌సీపీ విలీనం అవుతుందనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. పార్టీ భవిష్యత్ నాయకత్వ పగ్గాలు ఎవరు చేపడతారనే దానిపై కూడా అనిశ్చితి ఉంది.
శాసనసభా పక్ష సమావేశం
ఎన్‌సీపీ శాసనసభా పక్షం సమావేశం వచ్చే ఆదివారంనాడు నిర్వహించనున్నారు. ఈ సమావేశంలో అజిత్ భార్య, రాజ్యసభ ఎంపీ సునేత్ర పవార్‌ను శాసనసభాపక్ష నేతగా ఎన్నుకునే అవకాశం ఉంది. పార్టీ కొత్త అధ్యక్షుడిగా ఎవరిని ఎన్నుకోవాలనే దానిపై కూడా శనివారంనాడు సమావేశం జరుగునున్నట్టు ఎన్‌సీపీ వర్గాలు చెబుతున్నాయి
మరోవైపు, రెండు పార్టీలు (ఎన్‌సీపీ-ఎన్‌సీపీఎస్‌పీ) తిరిగి ఏక కావాలన్నదే అజిత్ పవార్ చివరి కోరిక అని, ఇందుకు సంబంధించి ఆయన ఇటీవల శరద్ పవార్‌తో పలు సమావేశాలు జరిపారని ఎన్‌సీపీ (ఎస్‌పీ) నేత అనిల్ దేశ్‌ముఖ్ తెలిపారు. రాబోయే రోజుల్లో పవార్ కుటుంబం మొత్తం సమావేశమై పెండింగ్ అంశాలన్నింటిపైన చర్చ జరుపుతుందని చెప్పారు. కాగా, విలీనం దాదాపు ఖాయమేనని, లాంఛనంగా ప్రకటించడమే తరువాయి అని శరద్ పవార్ వర్గీయుడు ఏక్‌నాథ్ ఖడ్సే తెలిపారు.
ఇవి కూడా చదవండి..
ఫిబ్రవరిలో ఎన్‌సీపీ వర్గాల విలీనం.. అధ్యక్ష పదవికి పోటీలో నలుగురు
చరిత్ర సృష్టించనున్న ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్
For More National News And Telugu News