మేదినీపూర్, నందిగ్రామ్ బాటలోనే బెంగాల్ అంతా హల్దియా సభలో ప్రధాని మోదీ
ABN , Publish Date - Apr 09 , 2026 | 01:44 PM
పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో మార్పు తుఫాను మొదలైందని, ఈసారి బీజేపీ విజయం ఖాయమని ప్రధాని నరేంద్రమోదీ ధీమా వ్యక్తం చేశారు. అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో మోదీ ఇవాళ హల్దియాలో భారీ బహిరంగ సభను ఉద్దేశించి ప్రసంగించారు.
హల్దియా (పశ్చిమ బెంగాల్) ఏప్రిల్ 9: పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ ఇవాళ హల్దియాలో భారీ బహిరంగ సభను ఉద్దేశించి ప్రసంగించారు. ఈ సందర్భంగా అధికార తృణమూల్ కాంగ్రెస్ (TMC) ప్రభుత్వంపై ఆయన తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. రాష్ట్రంలో మార్పు తుఫాను మొదలైందని, ఈసారి బీజేపీ విజయం ఖాయమని ఆయన ధీమా వ్యక్తం చేశారు.
ఐదేళ్ల క్రితం మేదినీపూర్, నందిగ్రామ్ ప్రజలు మార్పు కోసం ఏ బాటను చూపించారో, నేడు మొత్తం పశ్చిమ బెంగాల్ అదే మార్గంలో నడుస్తోందని ప్రధాని అన్నారు. 'నందిగ్రామ్‌లో గతంలో జరిగిన అద్భుతం, ఈసారి భవానీపూర్‌తో పాటు బెంగాల్ వ్యాప్తంగా పునరావృతం కాబోతోంది' అని ఆయన పేర్కొన్నారు. టీఎంసీ ప్రభుత్వం కేవలం అణచివేతకు, అవినీతికి ప్రాధాన్యం ఇస్తోందని, దీనిని ప్రజలు ఇక సహించబోరని హెచ్చరించారు.
ఒకప్పుడు భారతదేశ పారిశ్రామిక కేంద్రంగా ఉన్న హల్దియాలో నేడు ఫ్యాక్టరీలు మూతపడ్డాయని ప్రధాని ఆవేదన వ్యక్తం చేశారు. 'హల్దియాలో పరిశ్రమలు మూతపడ్డాయి, కానీ చొరబాటుదారులు, నేరస్థుల దుకాణాలు మాత్రం బాగా సాగుతున్నాయి' అని ఆయన విమర్శించారు. బెంగాల్‌ను మళ్లీ అభివృద్ధి పథంలో నడిపించడానికి బీజేపీ 6 గ్యారెంటీలను ఇస్తోందని ఆయన ప్రకటించారు. అందులో ముఖ్యంగా భయం లేని వాతావరణం, చట్టబద్ధమైన పాలన, అన్ని కుంభకోణాలపై విచారణ, బాధ్యులకు జైలు శిక్ష, 7వ పే కమిషన్ అమలు వంటి హామీలు ఉన్నాయి.
రాష్ట్రంలోని యువత ఉపాధి కోసం ఇతర రాష్ట్రాలకు వలస వెళ్తున్నారని, బెంగాల్ వైభవాన్ని పునరుద్ధరించాలంటే ఈ కరుణ లేని ప్రభుత్వానికి వీడ్కోలు పలకడం అత్యంత ఆవశ్యకమని మోదీ పిలుపునిచ్చారు. ఈ ఎన్నికలు కేవలం అధికారం కోసం కాదని, బెంగాల్ భవిష్యత్తును నిర్ణయించే ఎన్నికలని ఆయన స్పష్టం చేశారు. కాగా, పశ్చిమ బెంగాల్‌లో 294 స్థానాలకు గాను ఏప్రిల్ 23, ఏప్రిల్ 29న రెండు దశల్లో పోలింగ్ జరగనుంది. మే 4వ తేదీన ఫలితాలు వెలువడనున్నాయి.
ఈ వార్తలు కూడా చదవండి...
ఇలా చేస్తే ఉపేక్షించేది లేదు.. టీడీపీ నేతలపై మంత్రి నారా లోకేశ్ తీవ్ర ఆగ్రహం
జగన్ హయాంలో వ్యవసాయానికి తీరని నష్టం: అచ్చెన్నాయుడు
రహదారుల నిర్వహణ పటిష్ఠంగా ఉండాలి: సీఎం చంద్రబాబు
Read Latest AP News And Telangana News And International News And Telugu News