Share News

సీఎం ముందే రాజకీయ నాయకులపై విమర్శలు.. నానా పటేకర్ పాత వీడియో వైరల్

ABN , Publish Date - Oct 08 , 2026 | 06:29 PM

గతంలో నానా పటేకర్ రాజకీయ నాయకులను ఉద్దేశించి చేసిన ఘాటు వ్యాఖ్యలకు సంబంధించిన ఓ వీడియో వైరలవుతోంది. ఈ వ్యాఖ్యలు ఆయన మహారాష్ట్ర ముఖ్యమంత్రి, ఉపముఖ్యమంత్రి ముందు చేయడం గమనార్హం.

సీఎం ముందే రాజకీయ నాయకులపై విమర్శలు.. నానా పటేకర్ పాత వీడియో వైరల్
Nana Patekar

ఇంటర్నెట్ డెస్క్: ఈరోజు (గురువారం) ప్రముఖ నటుడు, దర్శకుడు నానా పటేకర్ గుండెపోటు కారణంగా కన్నుమూశారు. ఈ నేపథ్యంలో ఆయన పాత వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. గతంలో నానా పటేకర్ రాజకీయ నాయకులను ఉద్దేశించి చేసిన ఘాటు వ్యాఖ్యలకు సంబంధించిన ఓ వీడియో కూడా ట్రెండ్ అవుతోంది. ఈ వ్యాఖ్యలు ఆయన మహారాష్ట్ర ముఖ్యమంత్రి, ఉపముఖ్యమంత్రి ముందు చేయడం గమనార్హం.


మహారాష్ట్రలో 2022లో ‘లోక్‌మత్ మహారాష్ట్రియన్ ఆఫ్ ది ఇయర్’ అవార్డుల ప్రదానోత్సవం జరిగింది. ఈ కార్యక్రమంలో అప్పటి ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే, ఉపముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ అతిథులుగా పాల్గొన్నారు. అప్పుడే వేదికపైకి వెళ్లి, ప్రసంగాన్ని మొదలుపెట్టిన నానా పటేకర్.. రాజకీయ నాయకులను తీవ్రంగా విమర్శించారు. పన్నులు కడుతున్న సామాన్యులు వేధింపులకు గురవుతున్నారని, మరోవైపు అవినీతి రాజకీయ నాయకులు మాత్రం హాయిగా జీవిస్తున్నారని ఆయన వ్యాఖ్యానించారు. ‘మనం రూ.100 సంపాదిస్తే, ఆదాయపు పన్ను కింద రూ.30 చెల్లిస్తాం. అలాగే జీఎస్టీ కింద 18 శాతం కడతాం. ఇంత పన్ను కట్టిన సామాన్యులపై విచారణలు, దర్యాప్తులు జరుగుతాయి. కానీ అవినీతి చేసి, వేల కోట్ల దోచుకుంటున్న రాజకీయ నాయకులపై మాత్రం విచారణ ప్రక్రియలు ఎందుకు ఉండవు?’ అని ఆయన నిలదీశారు.


కొంతమంది ప్రజా ప్రతినిధులు ఎన్నికైన కొద్దికాలంలోనే కోట్ల ఆస్తులు ఎలా సంపాదిస్తున్నారని నానా పటేకర్ ప్రశ్నించారు. ఈ ప్రశ్నలకు దేవేంద్ర ఫడ్నవిస్ సమాధానమిచ్చారు. అవినీతి అంతం కావాలంటే అందరి సహకారం అవసరమని ఆయన చెప్పారు. కొన్నిసార్లు అవినీతిపరులనే సమాజం ప్రతినిధిగా ఎన్నుకుంటోందని అన్నారు. మంచి, చెడులను గుర్తించి ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరారు. అయితే సీఎం ముందే ఇలాంటి వ్యాఖ్యలు చేసిన నానా పటేకర్ ధైర్యాన్ని నెటిజన్లు మెచ్చుకుంటున్నారు. సామాన్యుల గొంతుకగా ఆయన మారినందుకు ప్రశంసిస్తున్నారు.


ఈ వార్తలూ చదవండి
చనిపోయే ముందు స్నేహితుడికి మెసేజ్ చేసిన నానా పటేకర్.. అందులో ఏముందంటే..!

కోట్ల ఆస్తులున్నా.. ఆటోలో షూటింగ్‌కు.. నానా పటేకర్ సింపుల్ లైఫ్‌స్టైల్

Updated Date - Oct 08 , 2026 | 06:38 PM