Share News

తండ్రి మృతదేహంతో నాలుగేళ్లుగా నివసిస్తున్న కుమార్తె..

ABN , Publish Date - Sep 30 , 2026 | 10:41 AM

తండ్రి మీదున్న పిచ్చిప్రేమతో ఓ కూతురు చేసిన పని స్థానికులను కన్నీరుపెట్టిస్తోంది. తండ్రి మరణం తట్టుకోలేని ఓ కుమార్తె ఆయన మృతదేహంతో నాలుగేళ్లుగా కలిసి జీవిస్తోంది. ఈ విషాదకర ఘటన ముంబయిలో చోటుచేసుకుంది.

తండ్రి మృతదేహంతో నాలుగేళ్లుగా నివసిస్తున్న కుమార్తె..
daughter preserving father deadbody for 4 years

ఇంటర్నెట్ డెస్క్: ముంబయిలోని ఓ డే కేర్ సెంటర్ నిర్వాహకురాలు తన తండ్రి మరణం తట్టుకోలేక.. ఆయన మృతదేహంతో నాలుగేళ్లుగా జీవిస్తోంది. వివరాల్లోకి వెళితే..


పోలీసులు, స్థానికుల కథనం ప్రకారం.. ముంబయిలోని మలద్ ప్రాంతంలో తండ్రీకూతుళ్లు తమ ఇంట్లోనే డే కేర్ సెంటర్ నిర్వహించడానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేసుకున్నారు. సెంటర్‌ను ప్రారంభించే తేదీని కూడా ప్రకటించారు. ఏమైందో తెలియదు కానీ.. డే కేర్ సెంటర్ ప్రారంభం కాలేదు. అప్పటి నుంచి తండ్రీకూతుళ్లు ఇద్దరూ అకస్మాత్తుగా బయట కనిపించడం మానేశారు.


అయితే.. కొన్ని రోజులుగా వారి ఇంటి నుంచి తీవ్ర దుర్వాసన వస్తోంది. అనుమానం వచ్చిన కాలనీవాసులు.. స్థానిక పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ఇంటి తలుపులు తెరిచి చూడగా.. విస్తుపోయే విషయాలు వెలుగులోకి వచ్చాయి. 2022 జూన్‌లో తండ్రి గుండెపోటుతో మృతి చెందగా.. ఆయన మరణాన్ని తట్టుకోలేని కుమార్తె.. అంత్యక్రియలు చేయకుండా నాలుగేళ్లుగా మృతదేహాన్ని కెమికల్స్‌లో పెట్టి భద్రపరుస్తోంది. ఈ పని కోసం ఆమె ఓ విదేశీ సంస్థతో ఒప్పందం కుదుర్చున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. అయితే.. తండ్రి మీదున్న ప్రేమతోనే మహిళ ఈ పనిచేసినట్లు ఆమె తరఫున న్యాయవాది వాదిస్తున్నారు.


మృతదేహాన్ని భద్రపరిచేందుకు అనుమతివ్వండి: కుటుంబసభ్యులు

తమని అత్యంత ప్రాణప్రదంగా చూసుకున్న తండ్రి దహనసంస్కారాలు చేయబోమని కుటుంబసభ్యులు తెలిపారు. డెత్ సర్టిఫికేట్‌ను మంజూరు చేసి.. మృతదేహాన్ని అలాగే భద్రపరిచేందుకు అనుమతులివ్వాలంటూ కోరుతున్నారు. అమెరికాలోని ఓ సంస్థ సహాయంతో లిక్విడ్ నైట్రోజన్‌తో మృతదేహాన్ని శాశ్వతంగా భద్రపరుస్తామని.. ఇందుకు మృతదేహాన్ని అమెరికా తరలించేందుకు తమకు సహకరించాల్సిందిగా బాధిత కుటుంబసభ్యులు పోలీసులను విన్నవించుకుంటున్నారు. ఈ నేపథ్యంలో మృతదేహానికి అంత్యక్రియలు చేయకుండా భద్రపరచి ఉంచవచ్చా అనే విషయంలో లీగల్ అంశాలపై పోలీసులు లోతుగా దర్యాప్తు చేపట్టారు.


భారతీయ చట్టాలు ఏం చెబుతున్నాయి?

భారతీయ సంస్కృతి, చట్టాల ప్రకారం మరణించిన వారికి గౌరవప్రదంగా అంత్యక్రియలు పూర్తి చేయాలి. మృతదేహాన్ని అంతిమసంస్కారాలు చేయకుండా.. అట్టిపెట్టుకోవచ్చా..? అనే అంశంపై చట్టంలో ఎక్కడా లేదు. పోస్ట్‌మార్టం పూర్తయ్యే వరకు, పోలీసుల దర్యాప్తు పూర్తయ్యేవరకూ, లేదా బంధువులు మృతదేహాన్ని తీసుకెళ్లేవరకూ మాత్రమే మార్చురీలో మృతదేహాలను భద్రపరచడానికి చట్టం అనుమతులు ఇచ్చింది. ఈ నేపథ్యంలో మృతదేహాన్ని భద్రపరచాలంటే.. చాలా చట్టాలను పరిశీలించవలసి ఉంటుందని నిపుణులు తెలుపుతున్నారు. మరణాల నమోదు, పబ్లిక్ హెల్త్, మున్సిపల్ పరిపాలన, మృతదేహాల రవాణా ఇలా చాలా అంశాలను పరిగణలోనికి తీసుకోవాల్సి ఉంటుందని తెలుపుతున్నారు.

Updated Date - Sep 30 , 2026 | 12:52 PM