Share News

'శామ్ భాయ్'కు మోదీ దీపావళి శుభాకాంక్షలు.. రాజకీయ విభేదాలు మరచి ఆత్మీయత

ABN , Publish Date - Nov 12 , 2026 | 04:53 PM

రాజకీయ విమర్శలు, సిద్ధాంతపరమైన విభేదాలతో ఎప్పుడూ భిన్న ధ్రువాలుగా ఉండే ప్రధాని నరేంద్ర మోదీ, ఇండియన్ ఓవర్సీస్ కాంగ్రెస్ చీఫ్ శామ్ పిట్రోడాల మధ్య దీపావళి పండుగ వేళ ఆసక్తికరమైన, ఆత్మీయ పరిణామం చోటుచేసుకుంది.

'శామ్ భాయ్'కు మోదీ దీపావళి శుభాకాంక్షలు.. రాజకీయ విభేదాలు మరచి ఆత్మీయత
Modi Sham Pitroda Diwali

ఢిల్లీ, నవంబర్ 12: రాజకీయ విమర్శలు, సిద్ధాంతపరమైన విభేదాలతో ఎప్పుడూ భిన్న ధ్రువాలుగా ఉండే ప్రధాని నరేంద్ర మోదీ, ఇండియన్ ఓవర్సీస్ కాంగ్రెస్ చీఫ్ శామ్ పిట్రోడాల మధ్య దీపావళి పండుగ వేళ ఆసక్తికరమైన, ఆత్మీయ పరిణామం చోటుచేసుకుంది. తన దీర్ఘకాలిక విమర్శకుడైన పిట్రోడాను 'శామ్ భాయ్' అని సంబోధిస్తూ ప్రధాని మోదీ దీపావళి, గుజరాతీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు.

ఇవాళ (గురువారం) ప్రధాని మోదీ ఎక్స్ (X) వేదికగా స్పందిస్తూ 'శామ్ భాయ్, అంజనా బెన్‌లకు దీపావళి, నూతన సంవత్సర అభినందనలు. రాబోయే ఏడాది అంతా ఆనందంగా, ఆరోగ్యంగా ఉండాలని ప్రార్థిస్తున్నాను. జై జగన్నాథ్!' అని పోస్ట్ చేశారు. ప్రధాని మోదీని తన 'గుజరాతీ మిత్రుడు' అని పిట్రోడా అభివర్ణించిన కొద్దిసేపటికే ప్రధాని నుంచి ఈ అనూహ్య స్పందన రావడం విశేషం.

అంతకుముందు ఓ వార్తా సంస్థతో మాట్లాడిన శామ్ పిట్రోడా, ప్రధాని మోదీతో తనకున్న వ్యక్తిగత అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు. 'ఆయన నా గుజరాతీ మిత్రుడు. ఒక వ్యక్తిగా నేను ఆయనను గౌరవిస్తాను. ఆయన మంచి వక్త, కష్టపడి పనిచేసే తత్వం ఉన్నవారు. వ్యక్తిగతంగా మా మధ్య ఎలాంటి విభేదాలు లేవు' అని పిట్రోడా అన్నారు. గతంలో తాను, తన భార్య అంజనా గుజరాత్‌లోని మోదీ ఇంటికి చాలాసార్లు వెళ్లామని, ఆ సమయంలో మోదీ ఎంతో ఆప్యాయంగా, ప్రేమగా ఆతిథ్యం ఇచ్చారని ఆయన గుర్తుచేసుకున్నారు.

మోదీతో ఉన్న విభేదాలపై స్పందిస్తూ.. అవి కేవలం రాజకీయ, సిద్ధాంతపరమైనవి మాత్రమేనని, వ్యక్తిగతమైనవి కావని పిట్రోడా స్పష్టం చేశారు. 'మోదీ ప్రపంచ దృక్పథం, ఆయన సిద్ధాంతాలతో నాకు విభేదాలు ఉండొచ్చు. కానీ అది ఆయన ఆలోచనలపై వ్యతిరేకత మాత్రమే, వ్యక్తిపై కాదు. నేను ఆయనతో రాజకీయంగా విభేదిస్తూనే, ఆయనతో కలిసి డిన్నర్ చేయగలను, సరదాగా నవ్వుకోగలను' అని వ్యాఖ్యానించారు.

దేశానికి హాని తలపెట్టే విదేశీ శక్తులతో కాంగ్రెస్ చేతులు కలిపిందంటూ బీజేపీ చేస్తున్న విమర్శలను పిట్రోడా తోసిపుచ్చారు. బిలియనీర్ ఇన్వెస్టర్ జార్జ్ సోరోస్‌తో తనకు, రాహుల్ గాంధీకి సంబంధాలు అంటగడుతూ బీజేపీ చేస్తున్న ఆరోపణలు పూర్తిగా నిరాధారమైనవని ఆయన కొట్టిపారేశారు. (Modi Sham Pitroda Diwali)


ఇవి కూడా చదవండి..

ఇరాన్‌తో యుద్ధాన్ని అమెరికా మొదలుపెట్టలేదు: డొనాల్డ్ ట్రంప్


ఎన్విడియా సీఈవో జెన్సెన్ హువాంగ్‌కు పదవీ గండం.. తెరపైకి మరో అఫైర్..

Updated Date - Nov 12 , 2026 | 05:42 PM