'అధికారంలో ఉంటే సంక్షేమం.. ప్రతిపక్షంలో ఉంటే పోరాటం'
ABN , Publish Date - May 05 , 2026 | 02:18 PM
తమిళనాడులో డీఎంకే ఓటమి పట్ల ఆ పార్టీ అధినేత స్టాలిన్ స్పందించారు. రాజకీయాల్లో గెలుపోటములు సహజమని.. వాటిని సమానంగా స్వీకరించే శక్తి తమ పార్టీకి ఉందని ఆయన వ్యాఖ్యానించారు.
ఇంటర్నెట్ డెస్క్: తమిళ రాజకీయాల్లో మరోసారి ఉత్సాహాన్ని నింపేలా డీఎంకే అధినేత ఎంకే.స్టాలిన్.. తమ పార్టీ శ్రేణులను ఉద్దేశించి 'ఎక్స్' మీడియా వేదికగా కీలక వ్యాఖ్యలు చేశారు. ఇటీవల జరిగిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో పార్టీ కార్యకర్తలకు ధైర్యం నూరిపోస్తూ, పోటీ తీవ్రతను గుర్తుచేశారు. ముఖ్యంగా ద్రవిడ మున్నేట్ర కళగం(డీఎంకే), తమిళగ వెట్రి కళగం(టీవీకే) మధ్య ఓట్ల తేడా 3.52 శాతమేనని వివరిస్తూ.. ఇది పోరాట స్ఫూర్తిని మరింత పెంచాల్సిన సమయమని పార్టీ నేతలకు సూచించారు.
'మేం చూడని విజయం లేదు.. ఎదుర్కోని ఓటమి లేదు' అని స్టాలిన్ వ్యాఖ్యానించారు. రాజకీయాల్లో జయాపజయాలు సహజమన్న ఆయన.. వాటిని సమానంగా స్వీకరించే శక్తి తమ పార్టీకి ఉందని స్పష్టం చేశారు. పార్టీ చరిత్రలో ఎన్నో ఎత్తుపల్లాలు వచ్చినా.. కార్యకర్తల అంకితభావమే పార్టీని నిలబెట్టిందని గుర్తుచేశారు. అధికారంలో ఉన్నప్పుడు ప్రజల సంక్షేమమే తమ లక్ష్యమని, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రజా హక్కుల కోసం పోరాటమే తమ ధ్యేయమని స్టాలిన్ తెలిపారు. ఈ రెండు పాత్రలలోనూ డీఎంకే ఎప్పుడూ వెనకడుగు వేయదని.. ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకోవడమే తమ ప్రథమ కర్తవ్యమని పేర్కొన్నారు. రాజకీయాలు కేవలం అధికారానికే పరిమితం కాకుండా.. ప్రజాసేవకు అంకితమై ఉండాలని ఆయన అభిప్రాయపడ్డారు.
తమిళనాడును ఎప్పటికీ తలవంచనివ్వమని ఘాటుగా ప్రకటించారు స్టాలిన్. రాష్ట్ర గౌరవం, స్వాభిమానం కాపాడటంలో డీఎంకే ఎప్పుడూ ముందుంటుందని.. కార్యకర్తలంతా ఒకటిగా నిలబడి ఈ లక్ష్యాన్ని సాధించాలని పిలుపునిచ్చారు. ఈ వ్యాఖ్యలు పార్టీ శ్రేణుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపడం సహా రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశమయ్యాయి.
ఇవీ చదవండి:
'ఆప్‌లాగే టీఎంసీ అవినీతిమయమైంది.. తదుపరి టార్గెట్ అదే..'
టీఎంసీ ఓటమిపై కాంగ్రెస్ నేతల సంబరాలు.. రాహుల్ గాంధీ ఆగ్రహం