Share News

దుబాయ్ ముస్లింలపై ప్రేమ ఎందుకు? : సింగర్ మికా సింగ్

ABN , Publish Date - Oct 06 , 2026 | 11:38 AM

పాకిస్తాన్‌తో తనకు ఉన్న అనుబంధం గురించి సింగర్ మికా సింగ్ గుర్తుచేసుకున్నారు. పాక్‌లోని గురుద్వారాలను చూసుకోవడంలో అక్కడి ముస్లింలు కూడా సాయం చేస్తారని ఆయన అన్నారు. ‘బాతే దిల్ సే విత్ నవీకా కుమార్’ కు ఇచ్చిన పాడ్‌కాస్ట్‌లో ఆయన మాట్లాడారు.

దుబాయ్ ముస్లింలపై ప్రేమ ఎందుకు? : సింగర్ మికా సింగ్

ఇంటర్‌నెట్ డెస్క్: పాకిస్తాన్‌తో తనకు ఉన్న అనుబంధం గురించి సింగర్ మికా సింగ్ గుర్తుచేసుకున్నారు. పాక్‌లోని గురుద్వారాలను చూసుకోవడంలో అక్కడి ముస్లింలు కూడా సాయం చేస్తారని ఆయన అన్నారు. ‘బాతే దిల్ సే విత్ నవీకా కుమార్’ కు ఇచ్చిన పాడ్‌కాస్ట్‌లో ఆయన మాట్లాడారు. 2019లో పాక్‌ను సందర్శించిన విషయాన్ని ఆయన ఈ సందర్భంగా ప్రస్తావించారు. దేశంలోని ప్రజలు పాక్ ముస్లింలను ఒకలా, దుబాయ్‌ ముస్లింలను ఒకలా చూస్తారని, ఎందుకు ఇలా చూస్తారో తనకు అర్థం కాదన్నారు. ‘‘పాక్ ప్రజలు అంత చెడ్డవారు కాదు. 2019లో నేను పాక్‌ను సందర్శించినపుడు వారు నన్నెంతో సాదరంగా ఆహ్వానించారు. అలాగే, అక్కడి గురుద్వారాల్లో పాక్ ముస్లింలు పనిచేయడం చూశాను. గురుద్వారాలను నిర్వహించడంలో సిక్కులకు వారు సహకరించడాన్ని స్వయంగా చూశాను. అయితే, మనం పాకిస్తానీయులను ఎందుకు ద్వేషిస్తామో నాకు అర్థం కాదు. అదే సమయంలో దుబాయ్‌ ముస్లింలను మాత్రం ఇష్టపడతాం. నాకు ఇది చాలా వింతగా అనిపిస్తుంది’’ అని మికా సింగ్ పేర్కొన్నారు.


పాక్ సింగర్లతో ఇబ్బంది లేదు..

పాక్ సింగర్లు భారత్‌లో ప్రదర్శనలు చేస్తే తనకు ఎలాంటి ఇబ్బంది లేదని మికా సింగ్ చెప్పారు. పాక్ కళాకారులతో తాను కలిసి పని చేశానని ఆయన తెలిపారు. మన కళాకారులు పాక్‌కు వెళ్లి ప్రదర్శనలు ఇవ్వడాన్ని తాను సమర్థిస్తానని అన్నారు. పాకిస్తాన్‌లో ప్రదర్శనలు ఇచ్చారన్న నెపంతో అలాంటి కళకారులను అనవసరంగా విమర్శించకూడదని సూచించారు. ఆ దేశంలో సిక్కుల మతపరమైన ప్రార్థనా స్థలాలు ఉన్నాయని, అందువల్లే పాక్‌తో తనకు వ్యక్తిగత బంధం ఏర్పడిందని వెల్లడించారు. ఆ బంధంతోనే పాక్‌కు తాను ఎమోషనల్‌గా కనెక్ట్ అయ్యానని వివరించారు. పాక్‌లో నన్ కానా, పంజా సాహిబ్ వంటి పవిత్ర స్థలాలు ఉన్నాయని, అవి పాకిస్తాన్‌లోని ప్రధాన గురుద్వారాలని ఆయన చెప్పారు.


2019లో మికాపై నిషేధం..

పాకిస్తాన్‌లోని కరాచీలో ఒక ప్రీవెడింగ్ ఈవెంట్‌లో 2019 ఆగస్టు 8న ప్రదర్శన చేసినందుకు మికా సింగ్‌పై భారతీయ సినీ పరిశ్రమ అదే ఏడాదిలో నిషేధం విధించింది. పాక్ మాజీ అధ్యక్షుడు పర్వేజ్ ముషారఫ్ దగ్గరి బంధువు ఒకరు ఆ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఆ కార్యక్రమంలో మికా సింగ్ చేసిన ప్రదర్శన సోషల్ మీడియాలో వెలుగులోకి వచ్చి వైరల్‌గా మారింది. తర్వాత ఆయనపై సినీ పరిశ్రమకు చెందిన చాలా మంది విమర్శలు చేశారు. దేశ ప్రయోజనాల కన్నా తన సొంత ప్రయోజనాలు, డబ్బుకే ఆయన ప్రాధాన్యం ఇచ్చారని మికాపై విరుచుకుపడ్డారు.


ఈ వార్తలు కూడా చదవండి..

3 రాష్ట్రాలు, ఒక యూటీలో 6 స్థానాలకు నేడు బైపోల్స్

వాళ్ల దగ్గర భారీగా అణ్వాయుధాలున్నాయి..

మరిన్ని నేషనల్, ఇంటర్నేషనల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Updated Date - Oct 06 , 2026 | 12:56 PM