ఫేస్‌బుక్‌లో మోదీ సెల్ఫీ వీడియో బ్లాక్
ABN , Publish Date - Jul 29 , 2026 | 06:51 AM
విద్యార్థుల నిరసన నేపథ్యంలో యువతను ఉద్దేశించి ప్రధాని మోదీ ఇటీవల విడుదల చేసిన సెల్ఫీ వీడియో ఫేస్‌బుక్‌లో మంగళవారం ఉదయం కొద్దిసేపు బ్లాక్ అయ్యింది.
ప్రభుత్వానికి మెటా క్షమాపణ
సాంకేతిక సమస్య వల్లేనని వివరణ
వెంటనే వీడియో పునరుద్ధరించామని వెల్లడి
మెటా వివరణ సహేతుకం కాదన్న కేంద్రం
మరింత లోతుగా పరిశీలించాలని నిర్ణయం
న్యూఢిల్లీ, జూలై 28: విద్యార్థుల నిరసన నేపథ్యంలో యువతను ఉద్దేశించి ప్రధాని మోదీ ఇటీవల విడుదల చేసిన సెల్ఫీ వీడియో ఫేస్‌బుక్‌లో మంగళవారం ఉదయం కొద్దిసేపు బ్లాక్ అయ్యింది. దీనిని కేంద్ర ప్రభుత్వం తీవ్రంగా పరిగణించింది. ప్రధాని వీడియోను తొలిగించిన విషయంపై ఫేస్‌బుక్ మాతృ సంస్థ అయిన మెటా గ్లోబల్ హెడ్‌కు నోటీసులు జారీ చేసింది. వీడియో తొలగింపుపై మెటా స్పందించింది. ప్రభుత్వానికి క్షమాపణ చెప్పింది.
సాంకేతిక కారణాల వల్ల ఆ వీడియో కొద్దిసేపు కనిపించలేదని, పొరబాటును వెంటనే సరిదిద్ధి ఆ వీడియోను పునరుద్ధరించామని మెటా ప్రతినిధి ఫేస్‌బుక్‌లో పేర్కొన్నారు. ఉద్దేశపూర్వకంగా చేసింది కాదని ప్రభుత్వానికి మెటా వివరణ ఇచ్చినట్లు తెలిసింది. అయితే అది సాంకేతిక తప్పిదం అంటూ మెటా ఇచ్చిన వివరణపై ప్రభుత్వం సంతృప్తిగా లేదని అధికార వర్గాలు పేర్కొన్నాయి. కాగా, మోదీ వీడియో బ్లాక్ అయినప్పుడు లీగల్ రిక్వెస్ట్ కారణంగా ఆ వీడియోను బ్లాక్ చేసినట్లు వివరణ ఉంది. దీంతో ప్రభుత్వం సీరియస్ అయింది.