Share News

హనీమూన్ మర్డర్ కేసు.. సాంకేతిక కారణాలతో నిందితురాలికి బెయిల్!

ABN , Publish Date - Apr 29 , 2026 | 02:18 PM

సంచలనం సృష్టించిన మేఘాలయ హనీమూన్‌ హత్య కేసులో నిందితురాలు సోనమ్‌ రఘువంశీకి బెయిల్‌ మంజూరైన సంగతి తెలిసిందే. ఆమె అరెస్టు సమయంలో పోలీసులు చేసిన తప్పిదం వల్లే ఆమెకు బెయిల్‌ మంజూరైనట్లు తెలుస్తోంది.

హనీమూన్ మర్డర్ కేసు.. సాంకేతిక కారణాలతో నిందితురాలికి బెయిల్!
Meghalaya honeymoon Case

ఇంటర్నెట్‌ డెస్క్‌: దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన మేఘాలయ హనీమూన్‌ హత్య కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో నిందితురాలిగా ఉన్న సోనమ్‌ రఘువంశీకి బెయిల్‌ మంజురైంది. అయితే సోనమ్‌కు బెయిల్ మంజూరు కావడంపై అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. నిందితురాలికి బెయిల్ మంజూరు కావడానికి గల కారణం ఏమిటో తాజాగా బయటకు వచ్చింది. నిందితురాలి అరెస్టు సమయంలో పోలీసులు చేసిన తప్పిదం కారణంగానే ఆమెకు బెయిల్‌ మంజూరైనట్లు తెలుస్తోంది. దీనిపై మృతుడు రఘువంశీ కుటుంబం మేఘాలయ హైకోర్టును ఆశ్రయించేందుకు సిద్ధమవుతుంది.


భారతీయ న్యాయ సంహిత (BNS) ప్రకారం.. హత్యకు సంబంధించి నిందితులపై 103(1), 238(ఏ), 309(6) సెక్షన్‌లను విధించాలి. కానీ ఈ హనీమూన్‌ హత్య కేసుకు సంబంధించి సోనమ్‌ అరెస్టు ఎఫ్ఐఆర్‌లో సెక్షన్‌ 403(1) అని నమోదు చేశారు. బీఎన్‌ఎస్‌లో ఇలాంటి సెక్షనే లేకపోవడం గమన్హారం. సాంకేతిక తప్పిదం వల్ల ఇలా జరిగిందని పోలీసులు పేర్కొన్నారు. అయితే, అరెస్టు మెమోలోనే కాకుండా.. కేసుకు సంబంధించిన అన్ని పత్రాల్లోనూ ఇదే సెక్షన్ ప్రస్తావించడాన్ని షిల్లాంగ్ కోర్టు గుర్తించింది. దీంతో సాంకేతిక తప్పిదమని పోలీసులు చేసిన వాదనలను కోర్టు తిరస్కరించింది.


ఈ క్రమంలో సోనమ్‌ అరెస్టుకి సరైన కారణాలు లేవని పేర్కొంది. అదేవిధంగా సోనమ్‌ను అరెస్టు చేసి తొలిసారి ఘాజీపుర్‌లోని కోర్టులో హాజరుపరిచినప్పుడు.. న్యాయవాదిని కలిసేందుకు ఆమెకు అనుమతులు ఇచ్చినట్లు రికార్డుల్లో ఎక్కడా లేదని కోర్టు వెల్లడించింది. ఈ కారణంతోనే సోనమ్ మొదట్లోనే తన అరెస్టును సవాల్‌ చేయలేకపోయిందని కోర్టు గుర్తించింది. ఈ తప్పిదాలే నిందితురాలికి అనుకూలంగా మారాయి. ఇదే సమయంలో విహాన్ కుమార్ వర్సెస్ స్టేట్ ఆఫ్ హర్యానా 2025 కేసులో సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పు ఆధారంగా రూ. 50,000 వ్యక్తిగత పూచీకత్తుపై సోనమ్‌కు షిల్లాంగ్ కోర్టు బెయిల్ మంజూరు చేసింది. అనుమతి లేకుండా సోనమ్‌ షిల్లాంగ్‌ జిల్లాను విడిచివెళ్లకూడదని షరతు విధించింది.


ఇవి కూడా చదవండి:

ఒపెక్ నుంచి యూఏఈ ఔట్.. భారత్‌కు లాభమేనా..

టీడీపీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా బాధ్యతలు చేపట్టిన లోకేశ్.. నేతల అభినందనలు

Updated Date - Apr 29 , 2026 | 03:08 PM