లెబనాన్‌పై దాడులు.. పెద్దఎత్తున పౌరుల మరణాలపై భారత్ ఆందోళన
ABN , Publish Date - Apr 10 , 2026 | 05:48 PM
లెబనాన్‌పై ఇజ్రాయెల్ జరుపుతున్న వైమానిక దాడులపై భారత్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. ఈ దాడుల్లో పెద్ద సంఖ్యలో పౌరులు మరణించినట్టు వస్తున్న వార్తలు ఆందోళన కలిగిస్తున్నట్టు భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ పేర్కొంది.
న్యూఢిల్లీ: లెబనాన్‌పై ఇజ్రాయెల్ జరుపుతున్న వైమానిక దాడులపై భారత్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. ఈ దాడుల్లో పెద్ద సంఖ్యలో పౌరులు మరణించినట్టు వస్తున్న వార్తలు ఆందోళన కలిగిస్తున్నట్టు భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ (MEA) పేర్కొంది. ఉద్రిక్తలు తగ్గించి సంయమనం పాటించాలని కోరింది. అంతర్జాతీయ చట్టాల గౌరవం, పౌరుల రక్షణ అత్యంత ముఖ్యమని స్పష్టం చేసింది.
అమెరికా, ఇరాన్ మధ్య రెండు వారాల కాల్పుల విరమణ ఒప్పందం అమల్లోకి వచ్చినప్పటికీ లెబనాన్‌పై ఇజ్రాయెల్ దాడులు కొనసాగిస్తోంది. లెబనాన్ ఈ ఒప్పందం పరిధిలోకి రాదని ఇజ్రాయెల్ వాదిస్తోంది. లెబనాన్‌పై దాడులు ఆపకుంటే అమెరికాతో శాంతి చర్చల నుంచి వైదొలుగుతామని ఇరాన్ హెచ్చరిస్తోంది.
శాంతి, సుస్థిరతకు భంగం: ఎంఈఏ
'లెబనాన్‌పై దాడుల్లో పెద్దసంఖ్యలో పౌరులు మరణించినట్టు వస్తున్న వార్తలు ఆందోళన కలిగిస్తున్నాయి. యూఎన్‌ఐఎఫ్ఐఎల్‌కు ట్రూప్ కంట్రిబ్యూటింగ్ దేశంగా లెబన్‌నాన్‌లో శాంతి, భద్రతలకు భారత్ ఎంతో వెచ్చిస్తోంది. జరుగుతున్న పరిణామాలు మాత్రం ఆందోళన కలిగిస్తున్నాయి. పౌరుల రక్షణ, అంతర్జాతీయ చట్టాలు, దేశాల సౌర్వభౌమాధికారాన్ని గౌరవించాలని కోరుతున్నాం . భారతదేశం ఎప్పుడూ పౌరుల భద్రతకు అత్యంత ప్రాధాన్యం ఇస్తుంది. లెబనాన్‌లోని భారత పౌరుల భద్రతను అక్కడి ఇండియన్ ఎంబసీ ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తోంది' అని విదేశాంగ శాఖ కార్యదర్శి రణ్‌ధీర్ జైశ్వాల్ మీడియా సమావేశంలో తెలిపారు.
మోదీ ఆదేశాలతో గల్ఫ్ దేశాల్లో మంత్రులు
పశ్చిమాసియాలో పరిస్థితులను జాగ్రత్తగా గమనిస్తున్నామని, గల్ఫ్ ప్రాంతాల్లోని దేశాలతో ఎప్పటికప్పుడు సంప్రదింపులు సాగిస్తున్నామని జైశ్వాల్ తెలిపారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఆదేశాల మేరకు దేశ ఇంధన భద్రతను పటిష్టం చేసేందుకు మంత్రులు గల్ఫ్ దేశాల్లో పర్యటిస్తున్నారని చెప్పారు. విదేశాంగ మంత్రి ప్రస్తుతం మారిషస్‌లో ఉన్నారని, అక్కడి నుంచి 11,12 తేదీల్లో యూఏఈలో పర్యటిస్తారని తెలిపారు. భారత్-యూఏఈ సంబంధాల బలోపేతంపై అక్కడి నాయకులతో చర్చిస్తారని అన్నారు. పెట్రోలియం మంత్రి సైతం ప్రస్తుతం ఖతార్‌లో పర్యటిస్తున్నట్టు చెప్పారు. భారత్‌కు నమ్మకమైన ఇంధన సరఫరాదారుగా ఉన్న ఖతార్ సైతం భారత్‌తో ఇందన సహకారానికి కట్టుబడి ఉన్నట్టు తెలిపిందని వివరించారు.
ఇవి కూడా చదవండి..
రాజ్యసభకు హరివంశ్‌ను నామినేట్ చేసిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
సీఎం భార్య పాస్‌పోర్ట్ వివాదం.. పవన్ ఖేడాకు ముందస్తు బెయిలు