Share News

'అన్ని దేశాల్లోనూ మూర్ఖులు ఉంటారు'.. యూఎస్ విదేశాంగ మంత్రి మార్కో రూబియో

ABN , Publish Date - May 24 , 2026 | 04:21 PM

భారతీయులు, ఇండియన్-అమెరికన్లపై జరుగుతున్న జాత్యహంకార దాడులు, వ్యాఖ్యలపై అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రపంచంలో ప్రతి దేశంలోనూ మూర్ఖులు ఉంటారని, అటువంటి వారు చేసే వ్యాఖ్యలను తీవ్రంగా పరిగణించాల్సిన అవసరం లేదన్నారు.

'అన్ని దేశాల్లోనూ మూర్ఖులు ఉంటారు'.. యూఎస్ విదేశాంగ మంత్రి మార్కో రూబియో
Marco Rubio Condemns Racism Against Indians, Calls Remarks ‘Stupid’

ఆంధ్రజ్యోతి, మే 24: భారతీయులు, భారతీయ అమెరికన్లపై జరుగుతున్న జాత్యహంకార దాడులు, వ్యాఖ్యలపై అమెరికా టాప్ డిప్లొమాట్, విదేశాంగ మంత్రి (Secretary of State) మార్కో రూబియో కీలక వ్యాఖ్యలు చేశారు. నాలుగు రోజుల పర్యటన నిమిత్తం భారత్ వచ్చిన ఆయన, న్యూఢిల్లీలో భారత విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్‌తో కలిసి నిర్వహించిన ప్రెస్ కాన్ఫరెన్స్‌లో ఈ విషయమై స్పందించారు. ప్రపంచంలో ప్రతి దేశంలోనూ మూర్ఖులు ఉంటారని, అటువంటి వారు చేసే వ్యాఖ్యలను తీవ్రంగా పరిగణించాల్సిన అవసరం లేదని ఆయన కొట్టిపారేశారు.

జాత్యహంకారంపై రూబియో స్పందన:

భారతీయులను లక్ష్యంగా చేసుకుని జరుగుతున్న జాత్యహంకార పూరిత వ్యాఖ్యలపై అడిగిన ప్రశ్నకు రూబియో సమాధానమిస్తూ.. 'ఆన్‌లైన్‌లో లేదా ఇతర చోట్ల కొందరు ఇలాంటి వ్యాఖ్యలు చేస్తుంటారు. ఎందుకంటే ప్రపంచంలోని ప్రతి దేశంలోనూ మూర్ఖులు (Stupid people) ఉంటారు. అమెరికాలోనే కాదు, ఇక్కడ కూడా అలాంటి వారు ఉండవచ్చు. వారు ఎప్పుడూ ఇలాంటి పిచ్చి కామెంట్లు చేస్తూనే ఉంటారు. అయితే ఇలాంటి వ్యాఖ్యలను మేము చాలా తీవ్రంగా పరిగణిస్తాం.'అన్నారు.

అమెరికా ఎప్పుడూ అందరినీ సమానంగా ఆహ్వానించే దేశమని, ప్రపంచం నలుమూలల నుంచి వచ్చిన ప్రజల వల్లనే అమెరికా సంస్కృతి మరింత సుసంపన్నమైందని ఆయన గుర్తుచేశారు. అమెరికా జీవన విధానంలో కలిసిపోయిన భారతీయులు ఆ దేశ అభివృద్ధికి ఎంతో సహకరించారని కొనియాడారు.


కొత్త వీసా నిబంధనలపై స్పష్టత:

అమెరికాలో చట్టబద్ధంగా నివసిస్తున్న వలసదారులు శాశ్వత నివాసం (గ్రీన్ కార్డ్/పర్మనెంట్ రెసిడెన్సీ) కోసం దరఖాస్తు చేసుకోవాలంటే, ముందుగా దేశం విడిచి వెళ్లి విదేశాల నుంచి దరఖాస్తు చేసుకోవాలనే కొత్త యూఎస్ విధానంపై కూడా రూబియో స్పందించారు.

భారత్‌ను ఉద్దేశించినవి కావు: ఈ మార్పులు కేవలం భారతదేశాన్ని లక్ష్యంగా చేసుకుని చేసినవి కావని, తమ వలస విధానాన్ని ఆధునీకరించే ప్రక్రియలో భాగంగా ప్రపంచవ్యాప్తంగా అమలు చేస్తున్నామని స్పష్టం చేశారు.

వలసల సంక్షోభం: గత కొన్ని సంవత్సరాలుగా అమెరికాలోకి దాదాపు 2 కోట్ల మందికి పైగా అక్రమంగా ప్రవేశించారని, ఆ సంక్షోభాన్ని ఎదుర్కొనేందుకే ఈ సంస్కరణలు తెచ్చామని చెప్పారు. ఎవరు, ఎప్పుడు, ఎంతమంది దేశంలోకి రావాలనే దానిపై వ్యవస్థను క్రమబద్ధీకరిస్తున్నట్లు తెలిపారు.

భారత్-అమెరికా వ్యూహాత్మక బంధం:

ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశాలైన భారత్, అమెరికాల మధ్య వ్యూహాత్మక సంబంధాలు బలంగా ఉన్నాయని రూబియో పునరుద్ఘాటించారు. నిన్న రూబియో భారత ప్రధాని నరేంద్ర మోదీతో కూడా భేటీ అయ్యారు. ఇరు దేశాల మధ్య వివిధ రంగాలలో జరుగుతున్న ద్వైపాక్షిక సహకారంపై ప్రధానికి వివరించారు. ఈ భేటీ అనంతరం, ప్రపంచ శ్రేయస్సు కోసం భారత్-అమెరికా కలిసి పనిచేస్తూనే ఉంటాయని ప్రధాని మోదీ సామాజిక మాధ్యమాల ద్వారా ప్రకటించారు.


ఈ వార్తలు కూడా చదవండి..

వివాహేతర సంబంధానికి భర్త బలి.. ప్రియుడితో కలిసి భార్య ఘాతుకం!

పార్టీ బలోపేతం కోసం అందరూ కలిసి పని చేయాలి: ఎంపీ మల్లు రవి

For More TG News And Telugu News

Updated Date - May 24 , 2026 | 04:49 PM