Share News

థరూర్‌కు మంత్రి పదవి కావాలి, పవన్ ఖేరా కీలుకొమ్మ... మణిశంకర్ అయ్యర్ సంచలన వ్యాఖ్యలు

ABN , Publish Date - Feb 16 , 2026 | 05:58 PM

కాంగ్రెస్ వెటరన్ నేత మణిశంకర్ అయ్యర్ మరోసారి సొంత పార్టీపై విమర్శలు గుప్పించారు. పార్టీ సీనియర్ నేతలైన శశిథరూర్, జైరామ్ రమేష్, పవన్ ఖేరాలపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.

థరూర్‌కు మంత్రి పదవి కావాలి, పవన్ ఖేరా కీలుకొమ్మ... మణిశంకర్ అయ్యర్ సంచలన వ్యాఖ్యలు
Mani Shankar Aiyar

తిరువనంతపురం: కాంగ్రెస్ వెటరన్ నేత మణిశంకర్ అయ్యర్ (Mani Shankar Aiyar) మరోసారి సొంత పార్టీపై విమర్శలు గుప్పించారు. పార్టీ సీనియర్ నేతలైన శశిథరూర్, జైరామ్ రమేష్, పవన్ ఖేరాలపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. పార్టీ నేతలు కమ్యూనిస్టులపై చూపించే ద్వేషం కంటే ఎక్కువగా ఒకరినొకరు ద్వేషించుకుంటారని, ఆ కారణంగానే రాబోయే కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలిచే అవకాశం లేదని అన్నారు.


కేరళ ముఖ్యమంత్రి, సీపీఎం నేత పినరయి విజయన్‌పై మణిశంకర్ అయ్యర్ ఇటీవల ఓ కార్యక్రమంలో ప్రశంసలు కురిపించారు. వామపక్ష వెటనర్ విజయన్ అసెంబ్లీ ఎన్నికల తర్వాత తిరిగి సీఎం పోస్టులో కొనసాగుతారని జోస్యం చెప్పారు. ఆయన వ్యాఖ్యలపై కాంగ్రెస్ పార్టీ వెంటనే స్పందించింది. అయ్యర్ వ్యాఖ్యలతో పార్టీకి ఎలాంటి సంబంధం లేదని, ఆయన తన సొంత అభిప్రాయాలు వ్యక్తం చేశారని తెలిపింది.


పవన్ కీలుబొమ్మ

పవన్ ఖేరా పార్టీ ప్రతినిధి కాదని, ఒక కీలుబొమ్మ అని మణిశంకర్ అయ్యర్ తాజా ఇంటర్వ్యూలో వ్యాఖ్యానించారు. పవన్ ఖేరా కాకుండా మరో వ్యక్తి ఎవరూ కాంగ్రెస్‌కు దొరకని పక్షంలో కాంగ్రెస్ పార్టీ ప్రస్తుతం ఏ స్థితిలో ఉందో ఆ స్థితిలోనే ఉంటుందని అన్నారు. కేరళలో పార్టీ విజయావకాశాలపై అడిగినప్పడు 'కాంగ్రెస్ గెలవాలన్నదే నా కోరిక. కానీ కాంగ్రెస్ పార్టీ నేతలు విడిపోయినందున కాంగ్రెస్ గెలుపు సాధిస్తుందని నమ్మడం లేదు. కమ్యూనిస్టులను ద్వేషించే దాని కంటే ఎక్కువగా వాళ్లు ఒకరినొకరు ద్వేషించుకుంటారు' అని జవాబిచ్చారు.


శశిథరూర్ ఆశలన్నీ దానిపైనే..

నాలుగుసార్లు తిరువనంతపురం ఎంపీగా గెలిచి, ఆపరేషన్ సింధూర్ వంటి అంశాలపై పార్టీ అధిష్టానంతో విభేదిస్తున్న శశిథరూర్‌పై కూడా అయ్యర్ విమర్శలు గుప్పించారు. థరూర్ పాకిస్థాన్ వ్యతిరేకి అని, తదుపరి విదేశాంగ మంత్రి కావాలనే బలమైన ఆంక్షలున్నాయని అన్నారు. కాంగ్రెస్ కమ్యూనికేషన్స్ అధిపతి జైరామ్ రమేష్ సైతం తన ఉద్యోగాన్ని నిలుపుకోవాలని అనుకుంటారని చెప్పారు.


పార్టీ సూచనలను ధిక్కరించి..

మణిశంకర్ అయ్యర్ ఇటీవల తిరువనంతపురంలో జరిగిన 'విజన్ 2031-అభివృద్ధి, ప్రజాసామ్యం' అనే సెమినార్‌లో పాల్గొన్నారు. ఈ సెమినార్‌కు హాజరు కావద్దని పలువురు మేథావి వర్గాలకు రాసిన లేఖలో కాంగ్రెస్ అధిష్ఠానం కోరింది. దీనిపై సెమినార్‌లో అయ్యర్ స్పందిస్తూ, ఇది అభినందనో, అవమానమో తెలియడం లేదని, అయితే ఈ కార్యక్రమంలో మా సహచరులు పాల్గొనక పోవడం విచారకరమని అన్నారు. ఇది స్టేట్ అకేషన్ మాత్రమే కాదని, జాతీయ ప్రాధాన్యం కలిగిన సందర్భమని పేర్కొన్నారు. పంచాయతీ రాజ్ పరంగా చూసినప్పుడు కేరళ నెంబర్ వన్‌లో ఉందని, రాజీవ్ గాంధీ కన్న కలలను నిజం చేసిందని అన్నారు. కాంగ్రెస్ వదిలేసిన బాధ్యతను విజయన్ ముందుకు తీసుకువెళ్తున్నారని ప్రశంసించారు.


కాంగ్రెస్‌ స్పందన

మణిశంకర్ వ్యాఖ్యలపై కాంగ్రెస్ సూటిగా స్పందించింది. పార్టీతో చాలా ఏళ్లుగా ఆయనకు సంబంధాలు లేవని, ఆయన ఏమి మాట్లాడినా, రాసినా అవి ఆయన వ్యక్తిగత అభిప్రాయాలేనని సామాజిక మాధ్యమం 'ఎక్స్'లో పవన్ ఖేరా పేర్కొన్నారు. యూడీఎఫ్ ప్రభుత్వాన్ని తిరిగి అధికారంలోకి తీసుకురావాలని కేరళ ప్రజలు కోరుకుంటున్నారని, ఎల్‌డీఎఫ్ - బీజేపీలు రహస్య భాగస్వాములనే విషయం ప్రజలకు బాగా తెలుసునని జైరామ్ రమేష్ అన్నారు.


ఇవి కూడా చదవండి..

శబరిమలలో మహిళలకు ప్రవేశం.. 9 మందితో సుప్రీం దర్మాసనం

రంగంలోకి రాహుల్.. రాజీనామాపై భూపెన్ బోరా పునరాలోచన

Updated Date - Feb 16 , 2026 | 08:18 PM