రంగంలోకి రాహుల్.. రాజీనామాపై భూపెన్ బోరా పునరాలోచన
ABN , Publish Date - Feb 16 , 2026 | 04:58 PM
అసోం కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు భూపెన్ కుమార్ బోరా రాజీనామా వ్యవహారం మలుపు తిరిగింది. రాహుల్ గాంధీ మాట్లాడటంతో తన రాజీనామా నిర్ణయంపై ఆయన వెనక్కు తగ్గారు.
న్యూఢిల్లీ: అసోం కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు భూపెన్ కుమార్ బోరా (Bhupen Kumar Bora) రాజీనామా వ్యవహారం మలుపు తిరిగింది. తన రాజీనామాను పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గేకు పంపినట్టు బోరా ప్రకటించిన కొద్దిసేపటికే అధిష్టానం రంగంలోకి దిగింది. దీంతో తన నిర్ణయాన్ని నఃపరిశీలించేందుకు కొంచెం సమయం ఇవ్వాలని అధిష్టానాన్ని ఆయన కోరారు. దీనిపై అసోం కాంగ్రెస్ అధ్యక్షుడు గౌరవ్ గొగోయ్ మాట్లాడుతూ, భూపెన్ బోరాతో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ మాట్లాడారని, పార్టీ అధిష్టానం ఆయన రాజీనామాను అంగీకరించేది లేదని స్పష్టం చేశారని చెప్పారు.
దీనికి ముందు, కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసినట్టు భూపెన్ బోరా ధ్రువీకరించారు. తన రాజీనామాను అధిష్టానానికి పంపానని చెప్పారు. అయితే రాజీనామాకు కారణాలను చెప్పేందుకు ఆయన నిరాకరించారు. అఖిల్ గొగోయ్, లురిన్‌జ్యోతి గొగోయ్, సీపీఎం నేతలు తనను సంప్రదిస్తున్నట్టు తెలిపారు. కాగా, బోరా వస్తానంటే బీజేపీ తలుపులు తెరిచే ఉంటుందని అసోం ముఖ్యమంత్రి హిమంత బిశ్వా శర్మ తెలిపారు. బోరా సునాయసంగా గెలిచే సీటు ఆయనకు కేటాయిస్తామన్నారు.
పార్టీకి పెద్ద ఆస్తి
భూపెన్ బోరా రాజీనామా ప్రకటన చేసిన వెంటనే ఆసోం కాంగ్రెస్ అధ్యక్షుడు గౌరవ్ గొగోయ్ వెంటనే రంగంలోకి దిగారు. బోరాతో సంప్రదింపుల అనంతరం మీడియాతో మాట్లాడారు. 'భూపెన్ కుమార్ బోరా కాంగ్రెస్ పార్టీ ఆస్తి. చెడుపై పోరాటంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. ఆయనతో 3 గంటల సేపు మాట్లాడాం. ఆయన కాంగ్రెస్ పార్టీ బలమైన నేత. ఏదైనా పొరపాటు జరిగితే ఓ సోదరుడిగా ఆయనకు క్షమాపణ తెలియజేస్తున్నాను. రాహుల్ గాంధీ సైతం భూపెన్ బోరాతో మాట్లాడారు' అని గొగోయ్ తెలిపారు. మీడియా సమావేశంలో భూపెన్ బోరా కూడా పాల్గొన్నారు.
ఇవి కూడా చదవండి..
శబరిమలలో మహిళలకు ప్రవేశం.. 9 మందితో సుప్రీం దర్మాసనం
డిప్యూటీ బ్యాంక్ మేనేజర్ బెట్టింగ్ పిచ్చి.. లాకర్ల నుంచి రూ. 3.5 కోట్ల బంగారం దొంగిలించి..