డిప్యూటీ బ్యాంక్ మేనేజర్ బెట్టింగ్ పిచ్చి.. లాకర్ల నుంచి రూ. 3.5 కోట్ల బంగారం దొంగిలించి..
ABN , Publish Date - Feb 16 , 2026 | 03:49 PM
బెంగళూరులో ఓ బ్యాంక్ డిప్యూటీ మేనేజర్ బరితెగించాడు. బెట్టింగ్ పిచ్చితో కస్టమర్లను దారుణంగా మోసం చేశాడు. బ్యాంకు లాకర్ల నుంచి ఏకంగా రూ.3.5 కోట్ల విలువైన బంగారాన్ని దొంగిలించాడు. ఆ బంగారంతో ఆన్‌లైన్‌లో బెట్టింగ్‌లు ఆడాడు..
కస్టమర్లకు అండగా నిలవాల్సిన బ్యాంక్ డిప్యూటీ మేనేజర్ బరితెగించాడు. బెట్టింగ్ పిచ్చితో కస్టమర్లను దారుణంగా మోసం చేశాడు. బ్యాంకు లాకర్ల నుంచి ఏకంగా రూ.3.5 కోట్ల విలువైన బంగారాన్ని దొంగిలించాడు. ఆ బంగారంతో ఆన్‌లైన్‌లో బెట్టింగ్‌లు ఆడాడు. ఈ సంఘటన కర్ణాటకలో ఆలస్యంగా వెలుగుచూసింది. పోలీసులు తెలిపిన పూర్తి వివరాల్లోకి వెళితే.. బెంగళూరులోని ఓ బ్యాంక్‌లో పని చేస్తున్న డిప్యూటీ మేనేజర్ ఆన్‌లైన్ బెట్టింగ్స్‌కు బానిస అయ్యాడు. బెట్టింగ్‌లు ఆడటానికి డబ్బుల కోసం కన్నింగ్ ప్లాన్ వేశాడు. తను పని చేసే బ్యాంక్ లాకర్లలోని బంగారాన్ని టార్గెట్ చేశాడు.
ఉన్నతాధికారులకు తెలియకుండా లాకర్లనుంచి ఏకంగా 2.7 కేజీల బంగారాన్ని దోచేశాడు. ఆ బంగారాన్ని ఓ ఫినాన్స్ కంపెనీలో తనఖా పెట్టాడు. వచ్చిన డబ్బులతో ఆన్‌లైన్‌లో బెట్టింగులు ఆడాడు. బ్యాంకు లాకర్ల నుంచి పెద్ద మొత్తంలో బంగారం పోయిందని గుర్తించిన చీఫ్ మేనేజర్.. గిరి నగర్ పోలీసులను ఆశ్రయించాడు. ఫిబ్రవరి 5వ తేదీన దొంగతనంపై ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. పోలీసులు డిప్యూటీ మేనేజర్‌ను అదుపులోకి తీసుకుని విచారించగా అసలు విషయం బయటపడింది.
నిందితుడు రూ.3.5 కోట్ల విలువ చేసే బంగారాన్ని దొంగిలించినట్లు పోలీసులు గుర్తించారు. అతడి వద్ద నుంచి 700 గ్రాముల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. మిగిలిన బంగారాన్ని కూడా రాబట్టే పనిలో పడ్డారు. ఈ సంఘటనపై డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ లోకేశ్ బీ జగలసార్ మాట్లాడుతూ.. ‘ఈ కేసుకు సంబంధించి డిప్యూటీ బ్యాంక్ మేనేజర్‌ను అరెస్ట్ చేశాం. బంగారాన్ని రికవరీ చేసే పనిలో ఉన్నాం. ఇప్పటి వరకు 700 గ్రాముల బంగారాన్ని రికవరీ చేశాం. ఫినాన్స్ కంపెనీ వాళ్లు మాకు సరిగా సహకరించటం లేదు. మేము కోర్టు ద్వారా వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటాం’ అని అన్నారు.
ఇవి కూడా చదవండి..
తెలంగాణ రైతాంగానికి గుడ్‌న్యూస్.. పెండింగ్ బకాయిలు క్లియర్..
టీ20 ప్రపంచ కప్: యూఏఈతో మ్యాచ్.. అఫ్గానిస్తాన్ ఘన విజయం