Share News

శబరిమలలో మహిళలకు ప్రవేశం.. 9 మందితో సుప్రీం దర్మాసనం

ABN , Publish Date - Feb 16 , 2026 | 02:58 PM

మందిరంలోకి 10 నుంచి 50 ఏళ్ల లోపు మహిళలకు శబరిమల శ్రీ ధర్మాశాస్త ఆలయం దశాబ్దాలుగా నిరాకరిస్తోంది. దీనికి 2018లో అత్యున్నత న్యాయస్థానం స్వస్తి చెప్పింది.

శబరిమలలో మహిళలకు ప్రవేశం.. 9 మందితో సుప్రీం దర్మాసనం
Sabarimala Temple

న్యూఢిల్లీ: కేరళలోని శబరిమల అయ్యప్ప ఆలయంలోకి మహిళల ప్రవేశాన్ని వ్యతిరేకిస్తూ దాఖలైన పిటిషన్లపై 9 మంది న్యాయమూర్తుల సుప్రీంకోర్టు ధర్మాసనం ఏప్రిల్ 7 నుంచి విచారణ చేపట్టనుంది. మందిరంలోకి 10 నుంచి 50 ఏళ్ల లోపు మహిళలకు శబరిమల శ్రీ ధర్మాశాస్త ఆలయం దశాబ్దాలుగా నిరాకరిస్తోంది. దీనికి 2018లో అత్యున్నత న్యాయస్థానం స్వస్తి చెప్పింది. అన్ని వయస్సుల వారికి ప్రవేశం కల్పిస్తూ తీర్పు ఇచ్చింది. అయితే ఈ అంశాన్ని విస్తృత ధర్మాససానికి అప్పగించేందుకు 2020 ఫిబ్రవరి 10న సుప్రీంకోర్టు అంగీకరించింది. ఈ నేపథ్యంలో సంబంధిత పార్టీలు తమ వాదనలను మార్చి 14 లోగా అందజేయాలని సుప్రీంకోర్టు ఆదేశించింది.


'తొమ్మిది మంది న్యాయమూర్తుల ధర్మాసనం శబరిమల సమీక్ష కేసుపై ఏప్రిల్ 7వ తేదీ ఉదయం 10 గంటల నుంచి విచారణ జరుపుతుంది. ఏప్రిల్ 22 వరకూ రెండు వారాల పాటు విచారణకు సమయం కేటాయిస్తున్నాం. రివ్యూ పిటిషనర్లు, వారికి సపోర్ట్ చేసే పార్టీ వాదనలను ఏప్రిల్ 7 నుంచి ఏప్రిల్ 9 వరకూ విచారిస్తుంది. రివ్యూను వ్యతిరేకించే వారి పిటిషన్లను ఏప్రిల్ 14 నుంచి ఏప్రిల్ 16 వరకూ వింటాం' అని సుప్రీంకోర్టు తెలిపింది. రిజాయిండర్ సబ్మిషన్లు ఉంటే ఏప్రిల్ 21న వింటామని పేర్కొంది.


సమీక్షకు మద్దతు ప్రకటించిన కేంద్రం

కాగా, పిటిషన్లపై సమీక్షకు తాము మద్దతిస్తున్నట్టు కేంద్రం సోమవారంనాడు ప్రకటించింది. ఈ అంశంపై కేరళలోని అధికార లెఫ్ట్ డెమోక్రటిక్ ఫ్రంట్ (ఎల్‌డీఎఫ్) తమ వైఖరిని స్పష్టం చేయాలని కాంగ్రెస్ సారథ్యంలోని యూనైటెడ్ డెమోక్రటిక్ ఫ్రంట్ (యూడీఎఫ్) డిమాండ్ చేసింది. అయితే కోర్టుకు సమర్పించిన వివరాలను వెల్లడించలేమని సీపీఎం తెలిపింది.


ఇవి కూడా చదవండి..

రాజస్థాన్‌లో కెమికల్ ఫ్యాక్టరీలో అగ్నిప్రమాదం.. ఏడుగురి సజీవ దహనం..

అభివృద్ధిలో సహకారాన్ని అందించేందుకు భారత్ ముందడుగు: ప్రధాని మోదీ

Updated Date - Feb 16 , 2026 | 03:01 PM