సోనియాగాంధీతో మమతా బెనర్జీ సమావేశం.. భవిష్యత్తు వ్యూహంపై చర్చ
ABN , Publish Date - Jun 09 , 2026 | 07:12 PM
కాంగ్రెస్ అగ్రనేత సోనియాగాంధీని తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి, పశ్చిమబెంగాల్ మాజీ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మంగళవారంనాడు 10 జన్‌పథ్‌లో కలుసుకున్నారు. ఐక్యత, భాగస్వామ్య పార్టీల మధ్య మెరుగైన సమన్వయానికి పిలుపునిస్తూ ఇండియా కూటమి సమావేశం ముగిసిన మరుసటి రోజే ఉభయులూ కలుసుకోవడం ప్రాధాన్యం సంతరించుకుంది.
న్యూఢిల్లీ: కాంగ్రెస్ అగ్రనేత సోనియాగాంధీ (Sonia Gandhi)ని తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి, పశ్చిమబెంగాల్ మాజీ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ (Mamata Banerjee) మంగళవారంనాడు 10 జన్‌పథ్‌లో కలిశారు. ఐక్యత, భాగస్వామ్య పార్టీల మధ్య మెరుగైన సమన్వయానికి పిలుపునిస్తూ ఇండియా కూటమి సమావేశం ముగిసిన మరుసటి రోజే ఉభయులూ కలుసుకోవడం ప్రాధాన్యం సంతరించుకుంది. దీనికితోడు టీఎంసీలో తలెత్తిన అంతర్గత తిరుగుబాటు, రాజీనామాల పర్వం కూడా వీరి కలయికకు ప్రధాన కారణంగా తెలుస్తోంది.
టీఎంసీలో వేగంగా మారుతున్న సమీకరణలు
ఇండియా కూటమి సమావేశంలో మమతాబెనర్జీ పాల్గొన్న సమయంలోనే ఆ పార్టీ రాజ్యసభ ఎంపీ సుఖేందు శేఖర్ రాయ్ రాజీనామా చేయడం, సుమారు 13 మంది ఎంపీలు ఆయన నివాసంలో సమావేశం కావడం, అనంతరం కేంద్ర మంత్రి భూపేందర్ యూదవ్ నివాసంలో వీరంతా సమావేశం కావడం సంచలనమైంది. వేగంగా చోటుచేసుకున్న పరిణామాల్లో భాగంగా లోక్‌సభలో తమను ప్రత్యేక గ్రూపుగా పరిగణించాలని కోరుతూ 20 మంది టీఎంసీ ఎంపీలు స్పీకర్ ఓం బిర్లాకు లేఖ పంపారు. దీంతో టీఎంసీలో తలెత్తిన సంక్షోభం మరింత ముదిరింది.
ఇటీవల జరిగిన పశ్చిమబెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో టీఎంసీ ఓటమిని చవిచూడటం, రాష్ట్ర శాసనసభలో 58 మంది ఎమ్మెల్యేలు తిరుగుబాటు చేయడం, ఆ వెంటనే పార్లమెంటుకు సైతం తిరుగుబాటు విస్తరించడం ఆ పార్టీని ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. ఈ నేపథ్యంలో సోనియాగాంధీతో మమతాబెనర్జీ అత్యవసరంగా సమావేశమయ్యారు. కాంగ్రెస్, టీఎంసీ భవిష్యత్తు వ్యూహంపై ఈ భేటీలో ప్రధానంగా చర్చించినట్టు తెలుస్తోంది.
ఇవి కూడా చదవండి..
సంతకాల ఫోర్జరీ కేసు.. మమతా బెనర్జీ కార్యాలయానికి సీఐడీ టీమ్
రిజైన్ చేసి హ్యాపీగా వెళ్లిపోవచ్చు... రెబల్ ఎంపీలకు టీఎంసీ ఘాటు సందేశం