మరోసారి కట్టుకథలతో నమ్మించేందుకే... మోదీ జాతినుద్దేశించి చేసే ప్రసంగంపై మమత
ABN , Publish Date - Apr 18 , 2026 | 08:08 PM
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శనివారం రాత్రి 8.30 గంటలకు జాతినుద్దేశించి ప్రసంగించనుండటంపై పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి, టీఎంసీ అధ్యక్షురాలు మమతా బెనర్జీ స్పందించారు. మరోసారి తన 'కట్టుకథల'తో నమ్మించేందుకే జాతినుద్దేశించి ఆయన ప్రసంగించనున్నారని అన్నారు.
కోల్‌కతా: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శనివారం రాత్రి 8.30 గంటలకు జాతినుద్దేశించి ప్రసంగించనుండటంపై పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి, టీఎంసీ అధ్యక్షురాలు మమతా బెనర్జీ (Mamata Banerjee) స్పందించారు. మరోసారి తన 'కట్టుకథల'తో నమ్మించేందుకే జాతినుద్దేశించి ఆయన ప్రసంగించనున్నారని అన్నారు. చట్టసభల్లో మహిళా రిజర్వేషన్ అమలుకు ఉద్దేశించిన 131వ రాజ్యాంగ సవరణ బిల్లు విపక్షాల వ్యతిరేకతతో లోక్‌సభలో వీగిపోయింది. ఈ క్రమంలో ప్రధానమంత్రి మోదీ ఈరోజు రాత్రి 8.30 గంటలకు జాతినుద్దేశించి ప్రసంగించనుండటంతో సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.
దేశాన్ని విభజించేందుకే..
కాగా, దేశాన్ని విభజించేందుకే బిల్లును లోక్‌సభలో కేంద్రం ప్రవేశపెట్టిందని అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో ఉన్న మమతాబెనర్జీ విమర్శించారు. డీలిమిటేషన్ ప్రక్రియతో లోక్‌సభ సీట్లు 850కి పెంచడం ద్వారా బీజేపీ రాజకీయ ప్రయోజనాలను లక్ష్యంగా పెట్టుకుందని ఆరోపించారు. 'మోదీ పతనం నిన్న ఢిల్లీలో ప్రారంభమైంది. ఇది మహిళా బిల్లు కాదు. మహిళా బిల్లుపై నేను 1998 నుంచి పోరాడుతున్నాను. బెంగాల్‌ను, బీజేపీయేతర రాష్ట్రాలను విభజించేందుకే ఈ బిల్లును తెచ్చారు. 543 నియోజకవర్గాల్లోనూ నెగ్గలేమని ఆయనకు తెలుసు. అందుకే 850 నియోజకవర్గాలంటూ గేమ్ ఆడుతున్నారు. అది తెలిసినందునే ఎన్నికల ప్రచారం ఉన్నప్పటికీ టీఎంసీకి చెందిన 21 మంది ఎంపీలను పంపాను. దేశాన్ని, బెంగాల్‌ను ఎట్టి పరిస్థితుల్లోనూ విభజన కానీయం' అని మమతా బెనర్జీ అన్నారు.
ఇవి కూడా చదవండి..
చేసిన తప్పులకు విపక్షాలు మూల్యం చెల్లించుకోక తప్పదు: మోదీ
ట్రంప్ చెబితే మోదీ జంప్ చేస్తారు.. రాహుల్ ఆరోపణ