ట్రంప్ చెబితే మోదీ జంప్ చేస్తారు.. రాహుల్ ఆరోపణ
ABN , Publish Date - Apr 18 , 2026 | 07:00 PM
ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ మరోసారి తీవ్ర ఆరోపణలు చేశారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కంట్రోల్‌లో మోదీ ఉన్నారని ఆరోపించారు.
రాణిపేట్: ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ (Rahul Gandhi) మరోసారి తీవ్ర ఆరోపణలు చేశారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ 'కంట్రోల్'లో మోదీ ఉన్నారని ఆరోపించారు. మోదీ తన రాజకీయ అధికారంతో తమిళనాడును తన కంట్రోల్‌లో ఉంచుకునేందుకు అన్నాడీఎంకేను అధికారంలోకి తీసుకురావాలని చూస్తున్నారని అన్నారు. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా రాణిపేట్‌లో జరిగిన ర్యాలీలో రాహుల్ గాంధీ శనివారంనాడు పాల్గొన్నారు.
నియోజకవర్గాల పునర్విభజన బిల్లుపై పార్లమెంటులో చర్చ సందర్భంగా మోదీ వ్యవహార శైలిపై రాహుల్ మాట్లాడుతూ 'నిన్న పార్లమెంటులో ప్రధానమంత్రి ముఖంలో ఎక్కడా ధీమా కనిపించలేదు. విపక్షాలను కూడా ఎదుర్కోలేకపోయారు. ఒక పక్కకు తిరిగి కూర్చున్నారు. అమెరికా కంట్రోల్‌లో ఆయన ఉండటమే అందుకు కారణం' అని అన్నారు.
అంతర్జాతీయ ఒప్పందాల ద్వారా మోదీ దేశ ప్రయోజనాల విషయంలో రాజీపడ్డారని రాహుల్ ఆరోపించారు. మన రైతులు, చిన్న, మధ్యతరహా పరిశ్రమలను అమ్మకానికి పెట్టడంతో పాటు ఇంధన రంగం, మన డాటా విషయంలో రాజీ పడ్డారని అన్నారు. ట్రంప్ చెబితే మోదీ జంప్ చేస్తారని, కూర్చోమంటే కూర్చుంటారని విమర్శలు గుప్పించారు. ఎప్‌స్టీన్ పైల్స్, మోదీ ఆర్థిక లావాదేవీలు, అదానీతో సంబంధాల గురించి ట్రంప్‌కు తెలియడమే ఇందుకు కారణమని అన్నారు. ట్రంప్‌ను మోదీ కంట్రోల్ చేస్తున్నట్టే మోదీ సైతం తమిళనాడు సీఎంను తన కంట్రోల్‌లో పెట్టుకోవాలని అనుకుంటున్నట్టు రాహుల్ పేర్కొన్నారు. ఆ కారణంగానే తమిళనాడులో అన్నాడీఎంకే అధికారంలోకి రావాలని మోదీ కోరుకుంటున్నట్టు చెప్పారు.
ఇవి కూడా చదవండి..
మహిళా బిల్లును వ్యతిరేకించి విపక్షాలు తప్పు చేశాయి: మోదీ
డీలిమిటేషన్‌ను అందుకే అడ్డుకున్నాం: రాహుల్ గాంధీ