డీలిమిటేషన్‌ను అందుకే అడ్డుకున్నాం: రాహుల్ గాంధీ
ABN , Publish Date - Apr 18 , 2026 | 03:08 PM
మహిళా రిజర్వేషన్ సవరణ బిల్లు పార్లమెంటులో వీగిపోవడంపై కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ స్పందించారు. మహిళా రిజర్వేషన్ల వెనుక నియోజకవర్గాల పునర్విభజన దాగి ఉందని, రిజర్వేషన్ల పేరుతో పునర్విభజన బిల్లును ఆమోదించుకోవాలని కేంద్రం చూసిందని అన్నారు.
పొన్నేరి: మహిళా రిజర్వేషన్ సవరణ బిల్లు పార్లమెంటులో వీగిపోవడంపై కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ (Rahul Gandhi) స్పందించారు. మహిళా రిజర్వేషన్ల వెనుక నియోజకవర్గాల పునర్విభజన దాగి ఉందని, రిజర్వేషన్ల పేరుతో పునర్విభజన బిల్లును ఆమోదించుకోవాలని కేంద్రం చూసిందని అన్నారు. ఈ డీలిమిటేషన్ బిల్లుతో తమిళనాడుకు ప్రాతినిధ్యం తగ్గిపోతుందని చెప్పారు. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా తిరువళ్లూరు జిల్లా పొన్నేరిలో జరిగిన ర్యాలీలో రాహుల్ శనివారంనాడు పాల్గొన్నారు.
తమిళ భాష, సంస్కృతిని దెబ్బతీసేందుకు ఆర్ఎస్ఎస్, బీజేపీ గత కొన్నేళ్లుగా ప్రయత్నిస్తున్నాయని రాహుల్ విమర్శించారు. తమిళనాడుతో తనకున్న అనుబంధాన్ని వివరిస్తూ 'చాలా ఏళ్లుగా తమిళనాడు ప్రజలతో నాకు అనుబంధం ఉంది. నేను తమిళనాడులో పుట్టలేదు. నా కుటుంబం కూడా తమిళనాడు నుంచి వచ్చినది కాదు. అయినప్పటికీ ఇది నా సొంతిల్లులా అనిపిస్తుంది. తమిళ భాష, సంస్కృతిపై ఆర్ఎస్ఎస్, బీజేపీ దాడికి ప్రయత్నిస్తున్నాయి. వీళ్లకెంత ధైర్యం అని నాకు అపిస్తుంటుంది' అని రాహుల్ అన్నారు.
పార్లమెంటులో పరిణామాలపై మాట్లాడుతూ, కొత్త బిల్లు పేరుతో వాళ్లు పార్లమెంటు ముందుకు వచ్చారని, దానిని మహిళా బిల్లు అని చెబుతున్నారని, అయితే మహిళా బిల్లును 2023లోనే ఆమోదించడం జరిగిందని తెలిపారు. బిల్లు వెనుక అసలు ఉద్దేశం నియోజకవర్గాల పునర్విభజనేనని అన్నారు. పార్లమెంటులో తమిళనాడుకు ప్రాతినిధ్యం తగ్గించడం, దక్షిణాది, ఈశాన్య రాష్ట్రాలను బలహీనపరచడం బిల్లు ఉద్దేశమని, అందువల్లే ఆ బిల్లును తాము ఓడించామని చెప్పారు. భారతదేశం రాష్ట్రాల యూనియన్ అనీ, అన్ని రాష్ట్రాలను సమానంగా చూడాలని, కేంద్రంలో ప్రతి రాష్ట్రానికి మాట్లాడే అవకాశం, భాష, సంప్రదాయాలను స్వేచ్ఛగా ప్రకటించుకునే వీలుండాలని అన్నారు. బీజేపీ పాలనా విధానం ఇందుకు భిన్నంగా ఉందని, ప్రధానమంత్రి ఒకే దేశం, ఒకే నేత, ఒకే భాష, ఒకే ప్రజ అంటూ రాజ్యాంగంపై దాడి చేస్తున్నారని విమర్శించారు. కేంద్రం గుత్తాధిపత్యాన్ని తమ కూటమి అడ్డుకుంటుందని చెప్పారు.
ఢిల్లీ నుంచి తమిళనాడును శాసించాలని బీజేపీ, ఆర్ఎస్ఎస్ అనుకుంటున్నాయని రాహుల్ విమర్శించారు. అయితే ఇందుకు తాము ఎంతమాత్రం అనుమతించేది లేదన్నారు. తమిళనాడు తన భవిష్యత్తును తానే నిర్దేశించుకుంటుందని, తమిళ సంస్కృతి, హక్కులు, భాషా పరిరక్షణలో తాము ప్రజలకు బాసటగా ఉంటామని చెప్పారు. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ఏప్రిల్ 23న జరుగనుండగా, మే 4న ఫలితాలు వెలువడతాయి.
ఇవి కూడా చదవండి..
మహిళా బిల్లును వ్యతిరేకించి విపక్షాలు తప్పు చేశాయి: మోదీ
విపక్షాలు ఐక్యంగా ఉండి బీజేపీ కుట్రలను అడ్డుకున్నాయి: ప్రియాంక