Share News

టార్గెట్ దాడులపై కోల్‌కతాలో మమత బైఠాయింపు నిరసన

ABN , Publish Date - Jun 02 , 2026 | 04:08 PM

తృణమూల్ కాంగ్రెస్ పార్టీ ఎంపీలు అభిషేక్ బెనర్జీ, కల్యాణ్ బెనర్జీపై దాడులకు నిరసనగా ఆ పార్టీ అధినేత్రి, మాజీ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కోల్‌కతాలో మంగళవారంనాడు బైఠాయింపు దీక్షకు దిగారు.

టార్గెట్ దాడులపై కోల్‌కతాలో మమత బైఠాయింపు నిరసన
Mamata Banerjee

కోల్‌కతా: తృణమూల్ కాంగ్రెస్ పార్టీ (TMC) ఎంపీలు అభిషేక్ బెనర్జీ, కల్యాణ్ బెనర్జీపై దాడులకు నిరసనగా ఆ పార్టీ అధినేత్రి, మాజీ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ (Mamata Banerjee) కోల్‌కతాలో మంగళవారంనాడు బైఠాయింపు దీక్షకు దిగారు. రాణి రష్మోని ఎవెన్యూ వద్ద నిరసన దీక్షకు పోలీసులు అనుమతి నిరాకరించడంతో ధర్మ్‌తలా ప్రాంతంలోని బస్టాండ్ సమీపంలో బైఠాయింపు నిరసన చేపట్టారు. టీఎంసీ సీనియర్ నేతలు డెరిక్ ఒబ్రెయిన్, చంద్రిమ భట్టాచార్య, శోభన్‌దేబ్ చటోపాధ్యాయ తదితరులు పాల్గొన్నారు. సిటీలోని పలు ప్రాంతాలకు చెందిన పార్టీ కార్యకర్తలు హాజరయ్యారు.


mamata-banerjee2.jpg

నిరసన దీక్షకు ముందు భారతరత్న డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ విగ్రహానికి మమతా బెనర్జీ నివాళులర్పించారు. అనంతరం భారత రాజ్యంగం పుస్తకాన్ని చేతిలో ఉంచుకుని దీక్షాస్థలికి వెళ్లారు. మమతాబెనర్జీ నిరసన ర్యాలీతో పోలీసులు పెద్దఎత్తున మోహరించారు.


దీనికి ముందు మమతా బెనర్జీ సోషల్ మీడియాలో ఒక వీడియో పోస్ట్ చేశారు. కోల్‌కతాలో ధర్నా చేపట్టేందుకు పోలీసులు అనుమతి నిరాకరించారని, అనుమతి ఇవ్వకున్నా ధర్మా నిర్వహిస్తామని, కావాలంటే అరెస్టు చేసుకోవచ్చని పేర్కొన్నారు. ప్రజాస్వామ్యబద్ధంగా నిరసన తెలిపేందుకు అనుమతించకుంటే ఢిల్లీకి వెళ్తామని హెచ్చరించారు. రెండవ అతిపెద్ద విపక్ష పార్టీ ఎంపీలపై దాడి జరిగిన తీరు దిగ్భ్రాంతి కలిగిస్తోందని, డాక్టర్లను ట్రీట్‌మెంట్ ఇవ్వద్దని ఆదేశాలు వెళ్తున్నాయని, ఇదెలాంటి నిరంకుశ ధోరణి అని ప్రశ్నించారు. కొద్ది మంది ఎంపీలనో, ఎమ్మెల్యేలనో బయపెట్టి, డబ్బులు చూపించినంత మాత్రాన తమ పార్టీ బలహీన పడదని, పార్టీ మరింత బలంగా పుంజుకుంటుందని అన్నారు.


ఇవి కూడా చదవండి..

అనవసర బలవంతం తగదు.. వందేమాతరం పూర్తి గేయంపై శశిథరూర్

బీజేపీకి తమిళనాడు నేత అన్నామలై రాజీనామా

Updated Date - Jun 02 , 2026 | 04:21 PM