టీఎంసీ రెబల్స్ కొత్త పార్టీ.. తెరపైకి ‘అస్లీ తృణమూల్’..
ABN , Publish Date - Jun 02 , 2026 | 01:48 PM
పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత టీఎంసీ పార్టీ పరిస్థితి దారుణంగా తయారైంది. పార్టీ తీవ్ర అంతర్గత సంక్షోభంలో చిక్కుకుంది. టీఎంసీలో కీలక నేతల తిరుగుబాటు మొదలైంది.
కోల్‌కతా, జూన్ 2: పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత టీఎంసీ పార్టీ పరిస్థితి దారుణంగా తయారైంది. పార్టీ తీవ్ర అంతర్గత సంక్షోభంలో చిక్కుకుంది. టీఎంసీలో కీలక నేతల తిరుగుబాటు మొదలైంది. అసెంబ్లీ ఎన్నికలు జరిగి నెల తిరక్కుండానే కీలక పరిణామం చోటు చేసుకుంది. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారనే ఆరోపణలతో సాందీపన్ సాహా, రితబ్రత బెనర్జీ అనే ఇద్దరు ఎమ్మెల్యేలను అధిష్ఠానం పార్టీ నుంచి బహిష్కరించింది.
ఈ నేపథ్యంలోనే టీఎంసీ భవిష్యత్తుపై పలు పుకార్లు షికార్లు చేస్తున్నాయి. టీఎంసీ పార్టీ రెండుగా చీలే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు.. గత కొన్ని వారాలుగా కోల్‌కతాలోని ఎమ్మెల్యే హాస్టల్‌తో పాటు గేట్‌వే హోటల్‌లో టీఎంసీ రెబల్స్ సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఆ సమావేశాల్లో ‘అస్లీ తృణమూల్’ పేరిట కొత్త పార్టీ ఏర్పాటుపై ప్రధానంగా చర్చిస్తున్నారు. అయితే, ఇప్పటి వరకు కొత్త పార్టీ ఏర్పాటుపై ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు.
రెబల్స్ తమతో కలిసి వచ్చే వారి మద్దతును కూడగట్టేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. తాజాగా, మమతా బెనర్జీ నివాసంలో జరిగిన టీఎంసీ శాసనసభా పక్ష సమావేశానికి కేవలం 19 మంది ఎమ్మెల్యేలు మాత్రమే హాజరయ్యారు. 61 మంది ఎమ్మెల్యేలు మీటింగ్‌కు హాజరు కాకుండా డుమ్మా కొట్టారు. వీరిలో సుమారు 50 మందికి పైగా ఎమ్మెల్యేలు ‘అస్లీ తృణమూల్’ వైపు మొగ్గుచూపుతున్నట్లు తెలుస్తోంది.
ఇవి కూడా చదవండి
జనసేన హౌస్‌మోషన్ పిటిషన్‌ను తిరస్కరించిన హైకోర్టు
44 ఏళ్ల వయసులో సెరెనా రీఎంట్రీ.. వింబుల్డన్‌లో ఆడనుందా?