Share News

44 ఏళ్ల వయసులో సెరెనా రీఎంట్రీ.. వింబుల్డన్‌లో ఆడనుందా?

ABN , Publish Date - Jun 02 , 2026 | 01:30 PM

టెన్నిస్ ప్రపంచాన్ని దాదాపు రెండు దశాబ్దాల పాటు ఏలిన దిగ్గజ ప్లేయర్ సెరెనా విలియమ్స్ దాదాపు నాలుగేళ్ల విరామం తర్వాత మళ్లీ కోర్టులో అడుగుపెట్టనున్నట్లు ప్రకటించింది. దీంతో ప్రతిష్ఠాత్మక గ్రాండ్ స్లామ్ టోర్నీ వింబుల్డన్ 2026లో సెరెనా బరిలోకి దిగుతుందా? అనే చర్చ జోరందుకుంది.

44 ఏళ్ల వయసులో సెరెనా రీఎంట్రీ.. వింబుల్డన్‌లో ఆడనుందా?
Serena Williams

ఇంటర్నెట్ డెస్క్: టెన్నిస్ ప్రపంచాన్ని దాదాపు రెండు దశాబ్దాల పాటు ఏలిన దిగ్గజ ప్లేయర్ సెరెనా విలియమ్స్ అభిమానులకు గుడ్‌ న్యూస్ చెప్పింది. దాదాపు నాలుగేళ్ల విరామం తర్వాత మళ్లీ కోర్టులో అడుగుపెట్టనున్నట్లు ప్రకటించింది. దీంతో ప్రతిష్ఠాత్మక గ్రాండ్ స్లామ్ టోర్నీ వింబుల్డన్ 2026లో సెరెనా బరిలోకి దిగుతుందా? అనే చర్చ జోరందుకుంది. 2022లో జరిగిన యూఎస్ ఓపెన్ తర్వాత సెరెనా ప్రొఫెషనల్ సింగిల్స్ మ్యాచ్ ఆడలేదు. అయితే అప్పట్లో ఆమె అధికారికంగా రిటైర్‌మెంట్ ప్రకటించలేదు. పోటీ టెన్నిస్‌కు దూరమవుతున్నానని మాత్రమే చెప్పింది. ప్రస్తుతం 44 ఏళ్ల వయసులో ఇద్దరు పిల్లలకు తల్లి అయిన తర్వాత సెరెనా మళ్లీ రాకెట్ పట్టేందుకు సిద్ధమైంది.


క్వీన్స్ క్లబ్ నుంచే పునరాగమనం

లండన్‌లో జరిగే క్వీన్స్ క్లబ్ ఛాంపియన్‌షిప్ టోర్నీలో డబుల్స్ విభాగంలో పాల్గొని.. సెరెనా తన సెకండ్ ఇన్నింగ్స్‌ను ప్రారంభించనుంది. జూన్ 8 నుంచి 21 వరకు జరిగే ఈ గ్రాస్‌ కోర్ట్ టోర్నీని వింబుల్డన్‌కు ముందు జరిగే సన్నాహక పోటీగా భావిస్తారు. ‘నా కెరీర్‌లో టెన్నిస్ కోర్ట్‌లు అత్యంత ప్రత్యేకమైన జ్ఞాపకాలను ఇచ్చాయి. ఈ కొత్త అధ్యాయాన్ని ప్రారంభించడానికి క్వీన్స్ క్లబ్ సరైన వేదికగా అనిపించింది. మళ్లీ పోటీల్లో పాల్గొనబోతున్నందుకు ఎంతో ఉత్సాహంగా ఉన్నాను’ అని సెరెనా తెలిపింది.


వింబుల్డన్‌లో కనిపించనుందా?

ప్రతిష్ఠాత్మక గ్రాండ్ స్లామ్ టోర్నీ వింబుల్డన్ ఛాంపియన్‌షిప్స్ పోటీలు జూన్ 29 నుంచి ప్రారంభం కానున్నాయి. ఇందులో సెరెనాకు వైల్డ్‌కార్డ్ అవకాశం లభించే అవకాశం ఉంది. ఆమె ఆసక్తిని బట్టి సింగిల్స్ లేదా డబుల్స్ విభాగంలో చోటు కల్పించే అవకాశాలు ఉన్నాయని టెన్నిస్ వర్గాలు భావిస్తున్నాయి. అలాగే ఈ ఏడాది చివర్లో జరిగే యూఎస్ ఓపెన్‌లో కూడా సెరెనా ఆడనున్నట్లు సమాచారం.


సెరెనాతో ఆడాలని సబలెంకా ఆసక్తి

ఇదిలా ఉండగా.. ప్రపంచ నంబర్-1, నాలుగు గ్రాండ్‌ స్లామ్ టైటిళ్ల విజేత సబలెంకా.. సెరెనా పునరాగమనంపై స్పందించింది. ‘సెరెనా ఒక లెజెండ్. ఆమె తిరిగి రావడం ఎంతో స్ఫూర్తిదాయకం. ఆమెను మళ్లీ కోర్టులో చూడాలని, అవకాశం వస్తే సెరెనాతో పోటీ పడాలని ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను’ అని సబలెంకా తెలిపింది. 23 గ్రాండ్ స్లామ్ సింగిల్స్ టైటిళ్లతో అత్యంత విజయవంతమైన మహిళా టెన్నిస్ ప్లేయర్‌గా నిలిచిన సెరెనా విలియమ్స్ పునరాగమనం ఇప్పుడు టెన్నిస్ ప్రపంచంలో హాట్‌ టాపిక్‌గా మారింది. అభిమానులు మాత్రం ఆమెను వింబుల్డన్ కోర్టులో మళ్లీ చూడాలని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.


ఇవి కూడా చదవండి:

టీమిండియాలోకి వైభవ్ సూర్యవంశీ.. బీసీసీఐ రియాక్షన్ ఇదే!

జట్టు ఓడిపోవడం కోహ్లీకి అస్సలు నచ్చదు: వెంకటేశ్ అయ్యర్

Updated Date - Jun 02 , 2026 | 01:49 PM